హుజురాబాద్‌లో టీఆర్‌ఎస్‌-బీజేపీ కార్యకర్తలు బాహాబాహీ

హుజురాబాద్‌లోని అంబేద్కర్‌ చౌరస్తా వద్ద ఇరు పార్టీల కార్యకర్తలు తీవ్ర స్థాయిలో ఘర్షణ వాతావరణం సృష్టించారు. టీఆర్‌ఎస్‌-బీజేపీ కార్యకర్తలు బాహాబాహీకి దిగారు. నేతల బహిరంగ చర్చ, సవాళ్లు, ప్రతిసవాళ్లతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది.  ఫ్లెక్సీల అంశానికి సంబంధించి గురువారం సాయంత్రం ప్రాంతంలో టీఆర్‌ఎస్‌-బీజేపీ కార్యకర్తలు బహిరంగ చర్చ సవాళ్లతో హంగామా సృష్టించారు.  ఈ క్రమంలో ఇరు వర్గాల మధ్య తోపులాట జరిగి పరిస్థితి ఉద్రిక్తతలకు దారి తీసింది. 
 
హుజురాబాద్ అభివృద్ధిపై అంబేద్కర్ చౌరస్తాలో చర్చకు రావాలంటూ బిజెపి  ఎమ్యెల్యే, మాజీ మంత్రి  ఈటల రాజేందర్ కు ఎమ్యెల్సీ  పాడి కౌశిక్ రెడ్డి సవాల్ చేశారు. 4 రోజుల క్రితం ఈటల చర్చకు రావాలని హుజురాబాద్ లో కౌశిక్ రెడ్డి ప్లెక్సీలు ఏర్పాటు చేశారు. పోలీసుల అనుమతి లేకపోయినా గులాబీ శ్రేణులు స్టేజి ఏర్పాటు చేసి మైకులు, హోర్డింగ్ లు ఏర్పాటు చేశారు.  స్టేజీపై రెండు కుర్చీలు వేశారు.
 
శుక్రవారం భారీ సంఖ్యలో టీఆర్ఎస్ శ్రేణులు తరలివచ్చారు. పాడి కౌశిక్ రెడ్డికి పోలీసులు రక్షణ ఇచ్చి వేదిక వద్దకు తీసుకరావడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. అదే, సభా వేదిక వద్దకు వచ్చిన బీజేపీ మహిళ నాయకురాలు పంజల లక్ష్మి, లతలను అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్ కు తరలించారు. 
 
నియోజకవర్గంలో అభివృద్ది జరగలేదని, తామే చర్చిస్తామని వస్తే ఎందుకు అడ్డుకుంటారని వారు  ప్రశ్నించారు. మరోవైపు, చర్చకు ఎమ్మెల్యే ఈటల రాజేందర్ ఎందుకని తామే వస్తామని బీజేపీ నేతలు ప్రకటించారు. దీంతో ముందస్తుగా పోలీసులు అరెస్టుల పర్వానికి తెరలేపారు. 
 
ఎక్కడికక్కడనే నేతలను నిర్భందం చేశారు. జిల్లా బీజేపీ అధ్యక్షుడు కృష్ణారెడ్డిని అరెస్ట్ చేశారు.వారు బయటకు రాకుండా చర్యలు తీసుకున్నారు. పోలీసుల వ్యవహరాన్ని బీజేపీ నేతలు తప్పుబడుతున్నారు. 
 
హుజురాబాద్ అభివృద్ధిపై చర్చకు సిద్ధమని ప్రకటించి, వేదిక వద్దకు వెళుతున్న బీజేపీ నేతలను అరెస్టు చేయడంపై ఆ పార్టీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. వారిని అరెస్టు చేసి వీణవంక పోలీస్ స్టేషన్ కు తరలించారు. అక్రమ అరెస్టులకు వ్యతిరేకంగా బీజేపీ నేతలు ఆందోళనలు నిర్వహించారు. కౌశిక్ రెడ్డి, టీఆర్ఎస్ కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. 
కౌశిక్ దిష్టిబొమ్మను దగ్ధం చేశారు. బీజేపీ కార్యకర్తలను పోలీసులు అడ్డుకోవడంతో వారి మధ్య వాగ్వాదం, తోపులాట చోటుచేసుకుంది. దీంతో పోలీసులు వారిని చెదరగొట్టారు.  కౌశిక్ రెడ్డి సవాళ్లపై బీజేపీ నేతలు స్పందిస్తూ మానుకొండలో తెలంగాణ ఉద్యమకారులపై రాళ్లు వేసిన కౌశిక్ రెడ్డితో చర్చకు ఈటల రారని, హుజురాబాద్ అభివృద్ధిపై మాట్లాడేందుకు తామే వస్తామని నియోజకవర్గ బీజేపీ నేతలు కౌంటర్ ఇచ్చారు.
అన్నట్లుగానే  సభా వేదిక వద్దకు భారీ ర్యాలీతో కౌశిక్ రెడ్డి చేరుకున్నారు. ఆయన ప్రసంగం ముగిసే  సమయానికి కొంతమంది  బీజేపీ కార్యకర్తలు అక్కడకు చేరుకోవడంతో ఉద్రిక్తత నెలకొంది. అప్పటికే భారీ సంఖ్యలో వచ్చిన టీఆర్ఎస్ నేతలు వారిని అడ్డుకున్నారు. ఇరువర్గాల మధ్య తోపులాట చోటు చేసుకోవడంతో పరిస్థితి కొంత ఉద్రిక్తతంగా మారింది.  వీరిని మరోసారి పోలీసులు చెదరగొట్టి కౌశిక్ రెడ్డిని అక్కడి నుండి తీసుకెళ్లారు.