ప్రజలు ఎన్నిసార్లు తిప్పికొట్టినా కాంగ్రెస్ తీరు మారదా?

ప్రజాస్వామ్యం, ప్రజాస్వామ్య వ్యవస్థలు కళ్లెదుట చచ్చిపోతుండటాన్ని భారతదేశం చూస్తోందంటూ కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యల పట్ల  బీజేపీ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. రాహుల్ నాయకత్వంలో పార్టీని ప్రజలు అనేక సార్లు తిప్పికొట్టినా భారత ప్రజాస్వామ్యంపై ఆయన నిందాపూర్వక వ్యాఖ్యలు చేయడం సిగ్గుచేటని, బాధ్యతారాహిత్యమని మాజీ కేంద్ర మంత్రి రవిశంకర్ ప్రసాద్ మండిపడ్డారు. 
 
ఆయన నానమ్మ ఇందిరాగాంధీనే దేశంలో అత్యవసర పరిస్థితి విధించి ప్రజాస్వామిక హక్కులను కాలరాసారని ప్రతి విమర్శలు చేశారు. ధరల పెరుగుదల, నిరుద్యోగం, ద్రవ్యోల్బణానికి వ్యతిరేకంగా కాంగ్రెస్‌ శుక్రవారం దేశ వ్యాప్తంగా చేపట్టిన నిరసన ప్రదర్శనలలో భాగంగా ఢిల్లీలో ప్రధాని నివాస ముట్టడితో పాటు పార్లమెంటు నుంచి రాష్ట్రపతి భవన్‌ వైపు ర్యాలీగా వెళ్లాలని కాంగ్రెస్‌ నేతలు భావించారు.
అయితే, పోలీసులు అడ్డుకొని వారిని ఎక్కడికక్కడ అరెస్ట్ చేశారు. ఈ సందర్భంగా   రాహుల్ గాంధీ మీడియాతో మాట్లాడుతూ, ప్రజాస్వామ్యం చనిపోతుండటాన్ని భారతదేశం చూస్తోందని, ప్రభుత్వ నియంతృత్వాన్ని ఎవరు నిలదీసినా వారిపై దాడులకు పాల్పడుతోందని విమర్శించారు. ఇద్దరు, ముగ్గురు వ్యాపార దిగ్గజాల ప్రయోజనాలను కాపాండేందుకు ఇద్దరు వ్యక్తులు నియంతృత్వాన్ని అమలు చేస్తు్న్నారని మండిపడ్డారు.
దీనిపై రవిశంకర్ ప్రసాద్ థీటుగా స్పందిస్తూ ”మీ అవినీతి, తప్పిదాల నుంచి కాపాడుకునేందుకు వ్యవస్థల ప్రతిష్టను దిగజార్చే పని ఆపండి. ప్రజలు మీ మాట వినకపోతే అందుకు మమ్మల్ని నిందిస్తారా?” అంటూ హితవు చెప్పారు.
“ప్రజలు నియంతృత్వం అనేది చూశారంటే అది ఎమర్జెన్సీలోనే చూశారు. విపక్ష నేతలు, సంపాదకులను జైళ్లకు పంపారు. న్యాయమూర్తులను బేఖాతరు చేశారు. సెన్సార్‌షిప్ విధించారు. మిమ్మల్ని ప్రజలు పదేపదే ఎన్నికల్లో నిరాకరిస్తున్నారు. ఆ కారణంగా ప్రజాస్వామ్యంపై నిందలు వేస్తారా?” అని ప్రశ్నించారు. 2019 ఎన్నికల్లోనూ మోదీపై రాహుల్ అనేక ఆరోపణలు చేశారని, కానీ ప్రజలు మోదీని భారీ తీర్పుతో గెలిపించుకున్నారని గుర్తు చేశారు.
సోనియాగాంధీ, రాహుల్‌పై ఈడీ కేసును ప్రస్తావిస్తూ, 76 శాతం వాటాలున్న గాంధీలిద్దరూ (సోనియాగాంధీ, రాహుల్) కేవలం రూ.5 లక్షలతో రూ.5,000 కోట్ల విలువచేసే నేషనల్ హెరాల్డ్ ఆస్తులను యంగ్ ఇండియా ఎలా సొంతం చేసుకుందో జవాబు చెప్పితీరాల్సిందేనని స్పష్టం చేశారు. తనపైన, ఇతరుల పైన ఉన్న ఆరోపణలను కొట్టివేసేందుకు న్యాయవ్యవస్థ నిరాకరించడంతోనే ఇప్పుడు ప్రజాస్వామ్య వ్యవస్థలను రాహుల్ నిందిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
 ”మీరు విచారణను ఎదుర్కోవలసిందే. ఈడీ ప్రశ్నలకు సమాధానం చెప్పాల్సిందే” అని రాహుల్‌ను ఉద్దేశించి రవిశంకర్ ప్రసాద్ తేల్చి చెప్పారు. విపక్ష నేతలు, వారి సన్నిహితులు సంపాదించిన అక్రమ ఆస్తులపై ఈడీ కొరడా ఝలిపించి, ఢిల్లీ నుంచి కోల్‌కతా వరకూ వివిధ ప్రాంతాల్లో వాటిని స్వాధీనం చేసుకుందని గుర్తుచేశారు.
 
మరోవంక, వందేళ్లుగా ఇటుకఇటుక పేర్చుకుంటూ భారత్ నిర్మించిన దానిని ఇప్పుడు మన కళ్ల ముందే నాశనం చేస్తున్నారని ప్రియాంక గాంధీ ఆవేదన వ్యక్తం చేశారు. దీనికి వ్యతిరేకంగా ఎవరైనా నిలబడినా, మాట్లాడినా దారుణంగా దాడి చేస్తున్నారని, జైలుపాలు చేస్తున్నారని, అరెస్టులు చేస్తున్నారని, కొడుతున్నారని ఆరోపించారు.
ప్రియాంక వ్యాఖ్యలను బీజేపీ తిప్పి అసలు కాంగ్రెస్ పార్టీలోనైనా ప్రజాస్వామ్యం ఉందా? అని ప్రశ్నించింది. కాంగ్రెస్ పార్టీని వారసత్వం పార్టీగా అభివర్ణించిందని ధ్వజమెత్తారు.