అమిత్ షాను కలిసిన కోమటిరెడ్డి సోదరులు…. కాంగ్రెస్ లో కల్లోలం

పిసిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డిపై ఒక వంక మాటల యుద్ధం చేస్తున్న కోమటిరెడ్డి సోదరులు, మరోవంక శుక్రవారం కేంద్ర హోమ్ మంత్రి అమిత్ షాను విడివిడిగా కలవడం తెలంగాణ రాజకీయాలలో సంచలనం రేపుతున్నది. ఇప్పటికే కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసి, ఎమ్యెల్యే పదవికి కూడా రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించిన కోమటిరెడ్డి రాజగోపాలరెడ్డి ఢిల్లీ వచ్చి అమిత్ షాను ప్రత్యేకంగా కలిశారు. 
 
బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యులు వివేక్ వెంకటస్వామితో కలిసి అమిత్ షాను కలసిన ఆయన ఈ నెల 21న అమిత్ షా సమక్షంలో బీజేపీలో చేరుతానని ప్రకటించారు. తనతోపాటు బీజేపీలో చాలామంది చేరుతున్నారని చెబుతూ తన అన్నగారైన భువనగిరి ఎంపీ వెంకటరెడ్డి సహితం  త్వరలోనే మంచి నిర్ణయం తీసుకుంటారని ఆశాభావం వ్యక్తం చేశారు.
 
కాంగ్రెస్ పార్టీ తప్పుడు వ్యక్తుల చేతుల్లోకి వెళ్లిందని మండిపడుతూ  బయటనుంచి వచ్చిన వ్యక్తికి పీసీసీ చీఫ్ పదవి కట్టబెట్టారని, ఆయనను ముఖ్యమంత్రి చేయడానికి తాము కష్టపడాలా? అని ప్రశ్నించారు. తాను బీజేపీకి అమ్ముడుపోయినట్లు నిరూపిస్తే రాజకీయ సన్యాసం తీసుకుంటానని సవాల్ విసిరారు. దమ్ముంటే రేవంత్ రెడ్డి తన సవాల్ స్వీకరించాలని చెప్పారు
 
మరోవంక,  తెలంగాణలో వరద నష్టాలపై అమిత్‌షాతో చర్చించానని,. వరద బాధితుల కష్టాలను తెలియజేశానని ఆయనను కలసిన అనంతరం కోమటిరెడ్డి వెంకటరెడ్డి తెలిపారు. కాగా, రేవంత్ ఎవరినీ సంప్రదించకుండా గత ఎన్నికలలో తనను ఓడించేందుకు ప్రయత్నించినా  చెరుకు సుధాకర్ రెడ్డిని పార్టీలో చేర్చుకోవడం పట్ల ఆయన తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇకపై రేవంత్‌రెడ్డి ముఖం చూడనని స్పష్టం చేశారు. 
అదే విధంగా తన నియోజకవర్గంలోని మునుగోడులో శుక్రవారం తనకు తెలియకుండా కాంగ్రెస్ సభ నిర్వహించడంపై ఆగ్గిమీద గుగ్గిలం అయ్యారు. తనకు పార్లమెంట్ లో ప్రశంలు, పార్లమెంటరీ కమిటీ సమావేశం ఉన్నందున తాను  రాలేనని తెలిసే పెట్టారనే అనుమానం వ్యక్తం చేశారు. తనను కూడా బలవంతంగా పార్టీ నుండి పంపే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు. 
మరోవైపు  రాజగోపాల్‌రెడ్డి రాజీనామా నిర్ణయం కాంగ్రెస్‌ పార్టీలో చిచ్చు రేపుతోంది. ఏడాది కాలంగా రాజగోపాల్‌రెడ్డి అసంతృప్తి వ్యక్తం చేస్తున్నా.. ఆయనను పార్టీలో కొనసాగించే విషయంపై రాష్ట్ర కాంగ్రెస్‌ వ్యవహారాల ఇన్‌చార్జి మాణిక్కం ఠాగూర్‌, రేవంత్ రెడ్డి ఆసక్తి చూపలేదని నల్లగొండ జిల్లాకు చెందిన సీనియర్‌ నేతలతోపాటు కొందరు ఇతర ప్రాంతాల నేతలు ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్‌కు ఫిర్యాదు చేసినట్లు తెలిసింది.
 
పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి.. రాజగోపాల్‌రెడ్డితోపాటు కోమటిరెడ్డి కుటుంబాన్ని కూడా అవమానించేలా మాట్లాడారని, దీంతో ఆయన సోదరుడు, ఎంపీ కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి కూడా బీజేపీలో చేరే అవకాశం ఉందని వారు చెప్పినట్లు తెలిసింది. 
 
విశ్వసనీయ సమాచారం ప్రకారం.. రాజగోపాల్‌రెడ్డి నిష్క్రమణ వల్ల కాంగ్రెస్‌కు రెండు మూడు నియోజకవర్గాల్లో నష్టం జరుగుతుందని, కానీ, వెంకట్‌రెడ్డి కూడా వెళ్లిపోతే ఐదారు నియోజకవర్గాలను కోల్పోతామని వేణుగోపాల్‌ వద్ద వారు స్పష్టం చేశారు. 

దాసోజు శ్రవణ్‌ రాజీనామా

మరోవంక, కాంగ్రెస్‌ జాతీయ అధికార ప్రతి దాసోజు శ్రవణ్ పార్టీకి రాజీనామా చేశారు. గత ఎన్నికల్లో ఖైరతాబాద్‌ నుంచి పోటీ చేసి ఓడిపోయిన తనకు తెలియకుండా విజయారెడ్డిని రేవంత్ పార్టీలో చేర్చుకోవడంపై ఆయన తీవ్ర  అసంతృప్తితో ఉన్నారు. 
 
శ్రవణ్‌ కాంగ్రెస్‌ పార్టీని వీడుతున్నట్లు తెలియగానే ఆ పార్టీ నేతలు కోదండరెడ్డి, మహేశ్‌కుమార్‌ గౌడ్‌ కలిసి దాసోజు ఇంటికి చేరుకుని బుజ్జగిస్తున్నారు. హస్తం పార్టీని వీడొద్దని నచ్చజెప్పే ప్రయత్నం చేస్తున్నారు. 
 
కాంగ్రెస్ లో సామాజిక న్యాయం కరువైందన్న ఆయన రేవంత్ రెడ్డి ఆధిపత్య రాజకీయాల వల్లే పార్టీని వీడుతున్నారని శ్రవణ్ స్పష్టం చేశారు. రేవంత్ ఒంటెత్తు పోకడ  కారణంగా పార్టీ ఆగమవుతోందని విమర్శించారు. రేవంత్ ఓ బ్లాక్ మెయిలర్ అన్న శ్రవణ్ఆ యన పీసీసీగా ఉన్నంత వరకు పార్టీ బాగుపడదని స్పష్టం చేశారు.