రేపటి నుంచే సంజయ్ మూడో విడత ప్రజా సంగ్రామ యాత్ర 

భారతీయ జనతా పార్టీ తెలంగాణ అధ్యక్షుడు, ఎంపీ బండి సంజయ్  మూడో విడత ప్రజా సంగ్రామ యాత్రను మంగళవారం ప్రారంభించనున్నారు. ఈ  సందర్భంగా నేడు సోమవారం మహాశక్తి అమ్మవారి ఆలయంలో ఆయన అమ్మవారి ఆశీస్సులు తీసుకుంటున్నారు.  మూడో విడత ప్రజా సంగ్రామ యాత్ర ఆగస్టు 2న యాదగిరిగుట్ట నుంచి ప్రారంభమై 26వ తేదీన హనుమకొండ భద్రకాళి అమ్మవారి ఆలయం దగ్గర ముగియనుంది. 24 రోజుల పాటు 125 గ్రామాల మీదుగా 325 కిలోమీటర్ల మేర బండి సంజయ్ పాదయాత్ర కొనసాగుతుంది.
ఆలేరు, భువనగిరి, మునుగోడు, నకిరేకల్, తుంగతుర్తి, జనగామ, పాలకూర్తి, స్టేషన్ ఘన్‌పూర్, వర్ధన్నపేట, పరకాల, వరంగల్ వెస్ట్, వరంగల్ ఈస్ట్ నియోజకవర్గాల్లో పాదయాత్ర చేపట్టనున్నారు. యాత్ర ప్రారంభంలో మహారాష్ట్ర ఉప  ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవిస్, ముగింపు సందర్భంగా జరిగే భారీ బహిరంగ సభలో పార్టీ అధ్యక్షుడు జె  పి నడ్డా పాల్గొనబోతున్నల్టు ప్రకటించారు.
గతేడాది ఆగస్టు 28న హైదరాబాద్ చార్మినార్ భాగ్యలక్ష్మి ఆలయం నుంచి తొలి విడత ప్రజా సంగ్రామ యాత్రను ప్రారంభించిన బండి సంజయ్ హుస్నాబాద్‌లో ముగించిన విషయం తెలిసిందే. 36 రోజులపాటు 8 జిల్లాలు 19 అసెంబ్లీ నియోజకవర్గాలు, 6 పార్లమెంట్‌ నియోజకవర్గాల మీదుగా 438 కిలోమీటర్ల దూరం బండి సంజయ్ పాదయాత్ర చేపట్టారు.
ఇక రెండో విడత ప్రజా సంగ్రామ యాత్రను గద్వాల జిల్లా అలంపూర్ జోగుళాంబ అమ్మవారి ఆలయం వద్ద నుంచి ప్రారంభించారు. 31 రోజుల పాటు పాదయాత్ర కొనసాగేలా ప్రణాళిక రూపొందించారు. బీజేపీ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌ఛార్జి తరుణ్‌ఛుగ్ సమక్షంలో పాదయాత్ర ప్రారంభమైంది.  రెండో విడత పాదయాత్ర ముగిశాక హైదరాబాద్ శివారు ప్రాంతం తుక్కుగూడ వద్ద నిర్వహించిన పార్టీ బహిరంగ సభకు కేంద్ర హోంమంత్రి అమిత్ షా హాజరయిన విషయం తెలిసిందే.