కమిట్మెంట్ చిత్ర యూనిట్ పై పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు

 
పడక గదిలో శృంగారంతో కూడిన అశ్లీల దృశ్యాలకు భగవద్గీత శ్లోకాలను జోడించి చిత్రీకరించిన కమిట్మెంట్ చిత్ర దర్శక, నిర్మాతలపై, నటి నటులపై, చిత్ర ట్రైలర్ కు అనుమతించిన సిన్సార్ బోర్డు అధికారులపై క్రిమినల్ కేసులు నమోదు చేసి, చట్టపరమైన చర్యలు చేపట్టాలని కోరుతూ విశ్వహిందూ పరిషద్ రాష్ట్ర సహా కార్యదర్శి రావినూతల శశిధర్ డిమాండ్ చేశారు. 
 
ఆ మేరకు,  వనస్థలీపురం పోలీస్ స్టేషన్ లో సోమవారం ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా శశిధర్ మాట్లాడుతూ హిందువులు పరమ పవిత్రంగా పూజించే భగవద్గీత శ్లోకాలను అశ్లీల దృశ్యాలకు జోడించి హిందువుల విశ్వాసాలను తీవ్రంగా గాయపరచారని ఆవేదన వ్యక్తం చేశారు. 
 
 వెంటనే సంబంధిత వ్యక్తులను అరెస్టు చేయకపోతే వి హెచ్ పి   పెద్ద ఎత్తున ఆందోళన చేస్తుందని, చిత్ర ప్రదర్శనను అడ్డుకుంటామని ఆయన హెచ్చరించారు. డిస్ట్రిబ్యూటర్లు, సినిమా థియేటర్ యాజమాన్యాలు కూడా చిత్రాన్ని సామాజిక బహిష్కరణ చేయాలని ఆయన పిలుపునిచ్చారు. 
 
సినిమా రంగాన్ని కేంద్రంగా చేసుకొని భారతీయ సంస్కృతిపై జీహద్ చేస్తున్నారని, అందులో భాగంగానే హిందూ ఆచారాలు దేవీ దేవతలను కించపరుస్తూ అవహేళన చేస్తూ సినిమాల నిర్మాణం జరుగుతుందని ఆయన ఆరోపించారు. దీనిపై ఎన్ఐఎ  చేత విచారణ జరిపించాలని ఆయన కోరారు. కాలం చెల్లిన, లోపభూయిష్టమైన సినిమాటోగ్రాఫి చట్టాన్ని పూర్తిగా ప్రక్షాళన చేయాల్సిన అవసరం ఉందని  ఆయన చెప్పారు.