తెలంగాణ బీజేపీలో భారీగా చేరనున్న ఇతర పార్టీల నేతలు

తెలంగాణాలో వచ్చే ఎన్నికలలో అధికారం కైవసం చేసుకోవాలని పట్టుదలతో వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్న బిజెపి జాతీయ నాయకత్వం ఇతర పార్టీల నుండి భారీగా నేతలను ఆకర్షించేందుకు రంగం సిద్ధం చేస్తున్నది. ఇప్పటికే ఓ భారీ జాబితాను సిద్ధం చేశారు. ఒక వంక పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ మూడో విడత ప్రజా సంగ్రామ యాత్రను మంగళవారం నుండి ప్రారంభిస్తుండగా, మరోవంక మాజీ మంత్రి, హుజురాబాద్ ఎమ్యెల్యే ఈటెల రాజేందర్ నేతృత్వంలో ఏర్పాటైన `చేరికల కమిటీ’ పార్టీలో కొత్తవారి చేరికకు భారీ కసరత్తు చేస్తున్నది.

ఇప్పటికే కాంగ్రెస్‌, టీఆర్‌ఎస్‌ పార్టీలకు చెందిన పలువురు సీనియర్‌ నాయకులు, ప్రజా ప్రతినిధులతో మంతనాలు జరిపి, వారిని బిజెపిలోకి చేర్చుకునేందుకు వ్యూహరచన చేస్తున్నారు. ఈ కమిటీ సభ్యురాలైన బిజెపి జాతీయ ఉపాధ్యక్షురాలు, మాజీ మంత్రి డి  కె అరుణతో కలసి ఈ విషయమై  రాష్ట్ర వ్యవహారాల ఇంఛార్జ్ తరుణ్ చుగ్ తో ఢిల్లీలో సోమవారం భేటీ జరిపారు. పార్టీలో చేరికలపై చర్చించారు.

పార్టీ అధ్యక్షుడు జెపి నడ్డాతో కూడా సమావేశమై వారు పార్టీలో చేరబోయే వారి జాబితాను అందజేసినట్లు తెలుస్తున్నది. కాంగ్రెస్‌ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్‌ రెడ్డి, ఉమ్మడి వరంగల్‌ జిల్లాకు చెందిన మాజీ మంత్రి, ఉమ్మడి మహబూబ్‌నగర్‌ జిల్లాకు చెందిన మరో మాజీ మంత్రి సహా వివిధ పార్టీలకు చెందిన 18 మంది ముఖ్య నేతలు, దాదాపు వంద మంది ఇతర నేతల పేర్లు ఈ జాబితాలో ఉన్నట్లు తెలిసింది.

ఉమ్మడి ఖమ్మం జిల్లాకు చెందిన మాజీ ఎంపీ, మరో మాజీ మంత్రి ఒకరు బీజేపీ ముఖ్యులకు టచ్‌లో ఉన్నట్లు సమాచారం. వీరితో ఇప్పటికే ఒక దఫా చర్చలు జరిగినట్లు బీజేపీ వర్గాలు వెల్లడించాయి. మరోవైపు, రైస్‌ మిల్లర్స్‌ అసోసియేషన్‌ నాయకులు మోహన్‌రెడ్డి, హైకోర్టు న్యాయవాది రచనారెడ్డి తదితరులు మంగళవారం బీజేపీలో చేరనున్నారని పార్టీ వర్గాలు తెలిపాయి. వీరితో పాటు మాజీ ఐపీఎస్‌ కృష్ణప్రసాద్‌ కూడా పార్టీలో చేరే అవకాశం ఉందని పేర్కొన్నాయి.

కోమటిరెడ్డి రాజగోపాలరెడ్డిని కాంగ్రెస్ నుండి నిష్క్రమించకుండా చేయడం కోసం ఆ పార్టీ అగ్రనేతలు చేస్తున్న ప్రయత్నాలు ఫలించడం లేదు. స్వయంగా దిగ్విజయ్ సింగ్ ఫోన్ చేసి వచ్చి రాహుల్ గాంధీని కలవమన్నా ఆయన ఖాతరు చేయకపోవడం గమనార్హం. దానితో ఆయన ఎమ్యెల్యే పదవికి రాజీనామా చేసి,  బీజేపీలో చేరడానికి సిద్ధంగా ఉన్నట్లు వెల్లడవుతుంది.

కాంగ్రెస్‌ నుంచి భారీ ఎత్తున బీజేపీలో చేరనున్నారని పార్టీ పెద్దలకు ఈటల, డీకే అరుణ చెప్పినట్లు సమాచారం. తెలంగాణలో సీఎం కేసీఆర్‌ వ్యక్తిగత విశ్వసనీయత పూర్తిగా పడిపోయిందని చెప్పినట్లు తెలిసింది. అధికార టీఆర్‌ఎస్‌ నుంచి ముఖ్య నేతలను చేర్చుకోవడం వల్ల బీజేపీకే నష్టమని, అందువల్ల ఆ పార్టీలోని ద్వితీయ శ్రేణి నేతలను గుర్తించి ఆచితూచి చేర్చుకోవడం మంచిదని వారు చెప్పినట్లు సమాచారం.