బాసర ట్రిపుల్‌ ఐటీ విద్యార్థుల నిరసన.. బీజేపీ ఎంపీ అరెస్ట్‌

బాసర ట్రిపుల్‌ ఐటీలో విద్యార్థుల ఆందోళనలు కొనసాగుతూనే ఉన్నాయి. ఆదివారం కూడా ట్రిపుల్‌ వద్ద ఉద్రిక్తత నెలకొంది. నిరసన తెలుపుతున్న విద్యార్థులకు పరామర్శించేందుకు బీజేపీ నేతలు లోపలికి వెళ్లే ప్రయత్నం చేశారు. ఈ క్రమంలో బాసరకు వస్తున్న బీజేపీ ఎంపీ సోయం బాపూరావును లోకేశ్వరం వద్ద పోలీసులు అరెస్ట్‌ చేశారు.
ట్రిపుల్‌ లోపలికి వెళ్లేందుకు మరికొందరు బీజేపీ నేతలు ప్రయత్నించగా వారిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.  ఇదిలా ఉండగా.. కొద్దిరోజుల కిత్రం బాసర ట్రిపుల్‌ ఐటీలో విషాహారం కారణంగా వందల సంఖ్యలో విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు. దీంతో, దీనికి కారణమైన వారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేస్తూ విద్యార్థులు ఆందోళనకు దిగారు.
భోజనశాలకు లైసెన్స్‌ను వెంటనే రద్దు చేసి కొత్త వారిని నియమించాలని శనివారం రాత్రి ఆందోళన చేపట్టారు. తమ డిమాండ్లను నెరవేరుస్తామని ఇచ్చిన హామీలను పక్కనపెట్టడంతో శనివారం రాత్రి భోజనం చేసేందుకు వెళ్లిన విద్యార్థులందరూ అన్నం తినకుండా నిరసన వ‍్యక్తం చేశారు. తమ సమస్యలను పరిష్కరించేంతవరకు భోజనం చేయబోమని పట్టబట్టారు. రాత్రంతా మెస్‌లోనే జాగారం చేశారు.
ఇంచార్జ్  వీసీ  వచ్చి  చర్చలు జరిపినా విద్యార్థులు పట్టు వీడలేదు.  తాము లేవనెత్తిన   5 డిమాండ్లపై  క్లారిటీ ఇవ్వాలని డిమాండ్  చేస్తున్నారు. ఐదు డిమాండ్లలో మెస్ టెండర్లు పిలిచారు. మిగితా 4 డిమాండ్లపై విద్యార్థులు నిలదీస్తున్నారు . విషాహారం ఘటనకు  పూర్తి బాధ్యత  వహించిన  స్టూడెంట్ వెల్ఫేర్ కు  చెందిన సిబ్బంది  మొత్తం త్వరలో  రాజీనామా చేస్తారన్నారని, అయినా ఎలాంటి చర్యలు  తీసుకోలేదంటున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. 
 
మెస్ మేనేజ్ మెంట్ కి ఇచ్చిన షోకాజ్ నోటీసుపై  వారు వివరణ ఇచ్చారా లేదా అనేదానిపై ఎలాంటి అప్ డేట్ లేదని విద్యార్థులు విమర్శిస్తున్నారు. విషాహారంకు కారణమైన నమూనా నివేదికలను ఎందుకు ప్రకటించలేదని ప్రశ్నిస్తున్నారు. కారణం బహిరంగంగా ఎందుకు ప్రకటించలేదని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.  
 
జూలై 24 నాటికి మెస్ ల కోసం కొత్త టెండర్లు పిలుస్తామని చెప్పి ఆలస్యం చేశారని నిరసన వ్యక్తం చేస్తున్నారు. తమ నిరసనతో ఆగమేఘాల మీద మెస్ టెండర్లకు నోటిఫికేషన్ విడుదల చేశారంటున్నారని  విద్యార్థులు చెబుతున్నారుబాసర ట్రిపుల్ ఐటీ వద్ద పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. ట్రిపుల్ ఐటీలోకి సిబ్బంది మినహా ఇతరులను ఎవరినీ రానివ్వడం లేదు. యూనివర్సిటీ పరిసరాల్లో పోలీసులు  ఆంక్షలు విధించారు. 
 
బండి సంజయ్ నిరసన 
బాసర ట్రిపుల్ ఐటీలో నెలకొన్న సమస్యలను పరిష్కరించకుండా ప్రభుత్వం మొద్దు నిద్ర పోతోందని రాష్ట్ర బీజేపీ అధ్యక్షులు బండి సంజయ్ విమర్శించారు. అసలు సమస్యలను ఎందుకు పరిష్కరించడం లేదని ప్రశ్నించారు. విద్యార్థుల ఆందోళనలు సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తున్నా . ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్లుగా వ్యవహరించడం దారుణమని మండిపడ్డారు. 
 
బాసర ట్రిపుల్ ఐటీలో నెలకొన్న సమస్యలపై బీజేపీ ఎంపీ సోయం బాపురావు ఎన్నోసార్లు ముఖ్యమంత్రికి విజ్ఞప్తి చేసారని గుర్తు చేశారు. విద్యార్థుల సమస్యలపై చర్చించి,, వారి బాధలు వినాలనే ఉద్దేశంతో అక్కడకు వెళితే పోలీసులు అరెస్టు చేయడం దారుణమని తెలిపారు. స్థానిక పార్లమెంట్ సభ్యుడిని అడ్డుకోవాల్సిన అవసరం ఏమొచ్చిందని నిలదీశారు.