
దేశానికి స్వాతంత్య్రం వచ్చి 75 ఏళ్లు పూర్తవుతున్న సందర్భంగా దేశ ప్రజలంతా వారి సోషల్ మీడియా ఖాతాల్లో ప్రొఫైల్ పిక్చర్‌గా త్రివర్ణ పతాకాన్ని ఉంచాలని దేశ ప్రధాని నరేంద్ర మోదీ ‘మన్ కీ బాత్’లో ఆదివారం పిలుపునిచ్చారు. ఆగస్ట్ 2 నుంచి ఆగస్ట్ 15 వరకూ సోషల్ మీడియా ప్రొఫైల్స్‌లో డీపీగా (డిస్‌ప్లే పిక్చర్)గా త్రివర్ణ పతాకాన్ని ఉంచాలని సూచించారు.
ఆజాదీకా అమృత్ మహోత్సవ్ కార్యక్రమంలో భాగంగా ఆగస్టు 2 నుంచి 15 వరకు ‘హర్ ఘర్ తిరంగా’ కార్యక్రమాన్ని కేంద్రం నిర్వహిస్తోందని చెప్పారు. దేశంలో ప్రతీ ఇంటిపై జాతీయ జెండాను ఎగురవేయడం ద్వారా ఈ ఉద్యమాన్ని ముందుకు తీసుకెళ్లాలని పిలుపు నిచ్చారు.
ఆగస్టు 2న జాతీయ పతాక సృష్టికర్త పింగళి వెంకయ్య జయంతి సందర్బంగా ఆ రోజు నుంచి ఆగస్టు 15 వరకు జాతీయ జెండాను ప్రొఫైల్ పిక్గా పెట్టుకోవాలని దేశ ప్రజలను మోదీ కోరారు. 91వ ఎడిషన్ ‘మన్ కీ బాత్’ కార్యక్రమంలో ప్రధాని ప్రసంగిస్తూ స్వాతంత్య్రం వచ్చి 75 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా భారతదేశం ఒక అద్భుతమైన, చారిత్రక ఘట్టానికి సాక్ష్యమిస్తోందని తెలిపారు.
1921లో వెంకయ్య ముసాయిదా జాతీయ పతాకంను రూపొందించి మహాత్మా గాంధీకి అందించిచారు. చివరికి జాతీయ జెండాగా మారిన దాని నుండి కొద్దిగా భిన్నంగా ఉంది. కానీ అది ఒక నమూనాగా పనిచేసింది.ఆయన డిజైన్‌లో ఈ రోజు మనకున్న మూడు రంగులు ఉన్నాయి. కానీ పతాకం అంతటా విస్తరించిన చరఖా (స్వావలంబనకు చిహ్నం) నేడు మధ్యలో ఉంది.
ప్రధాని “మేడమ్ కామా”ని కూడా ప్రస్తావించారు. ఆమె పూర్తి పేరు భికైజీ రుస్తోమ్ కామా, జాతీయ జెండాకు ఆకృతి ఇవ్వడంలో ఆమె కీలక పాత్ర పోషించిందని చెప్పారు. 1907 నుండి ఆమె వెర్షన్‌లో మూడు రంగులు ఉన్నాయి, అనేక సాంస్కృతిక, మతపరమైన చిహ్నాలు ఉన్నాయి, మధ్యలో ‘వందేమాతరం’ ఉంది.
75 ఏళ్ల స్వాతంత్య్రానికి గుర్తుగా దేశంలోని 75 రైల్వే స్టేషన్లకు స్వాతంత్య్ర సమరయోధుల పేర్లు పెట్టినట్లు ప్రధాని గుర్తు చేశారు. అలాంటి స్టేషన్లను పిల్లలు సందర్శించాలని సూచించారు. దేశం కోసం ప్రాణాలు అర్పించిన షహీద్ ఉద్ధమ్ సింగ్ జీకి ప్రధాని మోదీ సంతాపం తెలిపారు.
హిమాచల్‌ప్రదేశ్‌లో జరుగుతున్న మిజార్ మేళాను వీలైతే సందర్శించాలని ప్రజలను కోరారు. మరోవైపు, పీవీ సింధూ, నీరజ్ చోప్రాలకు శుభాకాంక్షలు తెలిపారు. యూకేలోని బర్మింగ్‌హామ్‌లో జరుగుతోన్న కామన్‌వెల్త్ గేమ్స్‌లో పాల్గొంటున్న భారత క్రీడాకారులు గొప్ప ఆట తీరును ప్రదర్శించాలని ప్రధాని ఆకాక్షించారు.
‘హర్ ఘర్ తిరంగా’ ప్రచారం కోసం కేంద్ర ప్రభుత్వం ఫ్లాగ్ కోడ్‌ను కూడా సవరించింది. ఇప్పుడు, జెండాల తయారీకి అన్ని రకాల పదార్థాలను ఉపయోగించవచ్చు – పాలిస్టర్, కాటన్, ఉన్ని, సిల్క్ , ఖాదీ, బంటింగ్ మెటీరియల్. అంతకుముందు యంత్రాలతో తయారు చేసిన, పాలిస్టర్ జెండాలకు అనుమతిం లేదు. జెండా పరిమాణంపై లేదా దాని ప్రదర్శన సమయంపై కూడా ఎటువంటి పరిమితి నేడు లేదు. ఇంతకు ముందు సూర్యోదయం నుంచి సూర్యాస్తమయం వరకు మాత్రమే జెండా ఎగురవేయడానికి అనుమతి ఉండేది.
అధికారిక ప్రకటన ప్రకారం, మూడు రోజుల పాటు ఇళ్లపై 20 కోట్లకు పైగా జాతీయ జెండాలు ఆవిష్కరిస్తారు. ప్రధాని మోదీ ప్రసంగంలో ప్రధానంగా స్వాతంత్య్ర వేడుకలపై దృష్టి సారించారు. దేశంలోని అన్ని వర్గాల ప్రజలు, సమాజంలోని అన్ని వర్గాల ప్రజలు దేశవ్యాప్తంగా వివిధ కార్యక్రమాల్లో పాల్గొంటున్నారని తెలిపారు.
ఆయన తన ప్రభుత్వ పథకాల గురించి కూడా మాట్లాడారు. ఆయుర్వేదం వలె అనేక సంస్కృతుల ఉత్సవాలు కూడా ప్రస్తావించారు. జూలైలో విజయాలు సాధించిన క్రీడాకారులను ఆయన అభినందించారు.
కొద్ది రోజుల క్రితం దేశవ్యాప్తంగా 10, 12 తరగతుల ఫలితాలు ప్రకటించారని చెబుతూ “తమ కృషి, అంకితభావంతో విజయం సాధించిన విద్యార్థులందరికీ నేను అభినందనలు తెలుపుతున్నాను” అని చెప్పారు.
More Stories
రైళ్ల పేర్లలో గందరగోళంతో ఢిల్లీలో తొక్కిసలాట!
అక్రమ వలసదారులతో అమృత్సర్ కు మరో రెండు విమానాలు
భారతదేశ వారసులు హిందువులే