భారత్‌ను శ్రీలంకతో పోల్చడం హాస్యాస్పదం!

తీవ్ర సంక్షోభంలో కూరుకుపోయిన శ్రీలంకతో భారత ఆర్థిక పరిస్థితులను పోల్చి చూడటం హాస్యాస్పదమేనని ఇద్దరు ప్రముఖ ఆర్ధిక వేత్తలు –  నీతి ఆయోగ్‌ మాజీ వైస్‌ చైర్మన్‌ అరవింద్‌ పనగారియా, ఆర్‌బిఐ మాజీ గవర్నర్ రఘురామ్ రాజన్ స్పష్టం చేశారు. అయితే, శ్రీలంక సంక్షోభం నుంచి నేర్చుతగిన పాఠాలు ఉంటాయని వారు తెలిపారు.

1991లో దేశీయంగా చెల్లింపుల సంక్షోభం తలెత్తినప్పట్నుంచి అధికారంలోకి వచ్చిన ప్రభుత్వాలన్నీ స్థూల ఆర్థిక పరిస్థితులు కట్టు తప్పకుండా, దేశాన్ని సంరక్షిస్తున్నాయని పనగారియా చెప్పారు.

ఇలా ఉండగా,  శ్రీలంక, పాకిస్థాన్ వంటి ఆర్థిక సమస్యలు భారత్‌కు ఎదురుకావని, విదేశీ మారకద్రవ్య నిల్వలను తగినంతగా ఉన్నాయని రాజన్  కూడా స్పష్టం చేశారు. విదేశీ మారక ద్రవ్య నిల్వలను పెంచడంలో ఆర్‌బిఐ (రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా) బాగా పనిచేస్తోందని ఆయన చెప్పారు.

అందువల్ల శ్రీలంక, పాకిస్థాన్ దేశాల వంటి ఆర్థిక సంక్షోభం పరిస్థితులు భారత్ ఉండబోవని భరోసా వ్యక్తం చేశారు. పైగా,  భారత్ కు విదేశీ రుణాలు కూడా తక్కువేనని ఆయన గుర్తు చేశారు. అయితే ప్రపంచవ్యాప్తంగా దేశాల్లో ద్రవ్యోల్బణం ఉందని రాజన్ వివరించారు. ద్రవ్యోల్బణాన్ని తగ్గించేందుకు ఆర్‌బిఐ వడ్డీ రేట్లను పెంచుతోందని గుర్తు చేశారు.

 అత్యధిక ద్రవ్యోల్బణం ఆహారం, ఇంధనంలో ఉంది. అయితే ప్రపంచంలో ఆహార ధరల పెరుగుదల తగ్గుముఖ పడుతోందని, వచ్చే రోజుల్లో భారతదేశంలో కూడా తగ్గుతాయని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు.

కాగా, శ్రీలంక-, పాకిస్థాన్ రెండు దేశాల్లోనూ ద్రవ్యోల్బణం గరిష్ట స్థాయికి చేరుకుంది. జూలైలో శ్రీలంక రిటైల్ ద్రవ్యోల్బణం 61 శాతానికి చేరింది. ఇప్పుడు దేశం ఎమర్జెన్సీ పరిస్థితులను ఎదుర్కొంటోందని రాజన్ గుర్తు చేశారు. పాకిస్తాన్ విషయానికొస్తే, రాజకీయ అశాంతి కారణంగా ఆర్థిక అనిశ్చితి పెరిగింది, రూపాయి విలువ తగ్గుతోంది. దీంతో పాకిస్థాన్ ఆర్థిక వ్యవస్థ కూడా అధ్వాన్నంగా మారిందని రాజన్ పేర్కొన్నారు. 

ఆర్‌బిఐ తాజా డేటా ప్రకారం, జూలై 22తో ముగిసిన వారానికి భారతదేశ విదేశీ మారక నిల్వలు 571.56 బిలియన్ డాలర్లుగా ఉన్నాయి. అదే వారంలో విదేశీ మారక నిల్వల్లో 1.152 బిలియన్ డాలర్ల క్షీణత నమోదైంది. మరోవైపు, భారత్‌ ప్రధాన సమస్య నిరుద్యోగం కాదని, ఉత్పాదకత, జీతాల స్థాయి తక్కువగా ఉండటమేనని పనగారియా తెలిపారు. పెద్ద సంఖ్యలో ప్రజలకు మెరుగైన జీతాలు లభించే ఉద్యోగాలను సృష్టించే దిశగా కృషి చేయల్సిన అవసరం ఉందని సూచించారు.

 2017–18లో 6.1 శాతంగా ఉన్న నిరుద్యోగిత రేటు కరోనా పరంగా కష్టకాలం అయినప్పటికీ 2020–21లో 4.2 శాతానికి దిగి వచ్చిందని పనగారియా గుర్తు చేశారు. 2017–18లో నిరుద్యోగిత రేటుపై ఆందోళనలు చేసిన వారంతా తాజా గణాంకాల తర్వాత మౌనం వహిస్తున్నారని ఆయన పేర్కొన్నారు.

వివిధ విషయాలపై భారత అధికారిక డేటాపై కొందరు నిపుణులు సందేహాలు వ్యక్తం చేస్తుండటంపై స్పందిస్తూ దేశ జీడీపీ, కీలక గణాంకాల సేకరణ అంతా కూడా అంతర్జాతీయ ప్రమాణాలతోనే జరుగుతోందని పనగరియా స్పష్టం చేశారు. సహేతుకమైన కొన్ని విమర్శలపై దృష్టి పెట్టాల్సిన అవసరం ఉన్నప్పటికీ, ఉద్దేశ్యపూర్వకంగా చేసే విమర్శలను తప్పక ఖండించాలని ఆయన తెలిపారు.