టిఆర్ఎస్ కు 15 సీట్లకు మించి రానేరావు!

వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో టీఆర్‌ఎస్ కు 15 సీట్లకు మించి రాబోవని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ స్పష్టం చేశారు. తమకు 90 సీట్లు వస్తాయంటూ టీఆర్‌ఎస్‌ నాయకులు చేస్తున్న ప్రచారాన్ని ఆయన తిప్పికొట్టారు. ఒకప్పుడు కాంగ్రెస్‌ కూడా ఇలాగే బీరాలు పలికిందని, ఎన్టీఆర్‌ వచ్చిన తర్వాత ఏం జరిగిందో మరచిపోవద్దని ఎద్దేవా చేశారు.
 లోక్‌సభ ఎన్నికల నాటికి టీఆర్‌ఎస్ అనే పార్టీ ఉండదని, ఇక ఆ పార్టీకి ఎన్ని సీట్లు వస్తాయన్నదానిపై చర్చ ఎక్కడ ఉంటుందని తేల్చి చెప్పారు.  లోక్‌సభ ఎన్నికల్లో రాష్ట్రంలో బీజేపీకి 12 ఎంపీ సీట్లు ఖాయమని, ఎంఐఎం సీటు కూడా తాము కైవసం చేసుకుంటామని ధీమా వ్యక్తం చేశారు.
కేసీఆర్‌ ఇప్పుడు చెల్లని రూపాయి అని, ఆయన బొమ్మతో గెలవడం కష్టమని టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేలు జంకుతున్నారని తెలిపారు. అందుకే ముందస్తు ఎన్నికల గురించి కేసీఆర్‌ మళ్లీ మాట్లాడటం లేదని చెప్పారు.  మునుగోడుకు ఉప ఎన్నిక రావాలని కేసీఆర్‌ కోరుకుంటున్నారని, ఉద్యోగులకు వేతనాల ఆలస్యం, వరదలు వంటి అంశాల నుంచి ప్రజల దృష్టి ఉప ఎన్నికపై మరలుతుందని ఆయన నమ్మకమేమో అని చెప్పారు.
ఇక, ఉపఎన్నిక జరగవద్దని కాంగ్రెస్‌ కోరుకుంటోందని, అయితే ప్రజల అభీష్టం మేరకే బీజేపీ ముందుకు వెళ్తుందని ఆయన తెలిపారు. కాళేశ్వరం ప్రాజెక్టులో అవినీతితో పాటు వివిధ పథకాల్లో అక్రమాలపై అన్ని ఆధారాలుంటే టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి ఎందుకు కోర్టులను ఆశ్రయించడం లేదని సంజయ్ ప్రశ్నించారు.
క్యాసినో వ్యవహారం బయటపడగానే టీఆర్‌ఎస్‌ నాయకులు భయపడుతున్నారని చెబుతూ చీకటి దందాలకు కేరాఫ్‌ అడ్రస్‌గా టీఆర్‌ఎస్‌ మారిందని ఆరోపించారు. కాగా, ఎన్నికల్లో ఎవరికి టికెట్‌ ఇవ్వాలన్నది తమ పార్టీ పార్లమెంటరీ బోర్డు నిర్ణయిస్తుందని సంజయ్‌ తెలిపారు.  తనతో సహా, ఏ నాయకుడు కూడా తనకు తాను ఫలానా స్థానం నుంచి పోటీ చేస్తానని ప్రకటించే సంప్రదాయం బీజేపీలో లేదని స్పష్టం చేశారు. తాను ఒక స్థానం నుంచి పోటీ చేస్తానని ఒక నాయకుడు తన అభిప్రాయంగా చెప్పవచ్చు.. కానీ అదే ఫైనల్‌ కాదని ప్రకటించారు.
 తాను గజ్వేల్‌ నుంచి పోటీ చేయబోతున్నట్లు బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యుడు, ఎమ్మెల్యే ఈటల రాజేందర్‌ ఇటీవల ప్రకటించిన నేపథ్యంలో సంజయ్‌ పైవిధంగా స్పందించారు.  వరదల్లో కాళేశ్వరం ప్రాజెక్టు మునిగిపోవడానికి సీఎం కేసీఆరే కారణమని ఆరోపించారు.  ఈ అంశంపై ప్రజలు ప్రశ్నిస్తారన్న భయంతో, అందరి దృష్టిని మరల్చేందుకు సీఎం భద్రాచలం వరద ప్రాంతాల పర్యటనకు వెళ్లారని, అదంతా ఓ డ్రామా అని విమర్శించారు. వరద బాధితులను పట్టించుకోకుండా వారం రోజులుగా కేసీఆర్‌ ఢిల్లీలో మకాం వేశారని ధ్వజమెత్తారు.