నీటిపై తేలియాడే సౌర విద్యుత్ తెలంగాణకే గర్వకారణం 

రామగుండం ఎన్టీపిసి జలాశయం నీటిపై 100 మెగావాట్ల నీటిపై తేలియాడే సౌర విద్యుత్ ప్రాజెక్టును నిర్మించడం తెలంగాణకు గర్వకారణమని కేంద్ర మంత్రి జి కిషన్‌రెడ్డి పేర్కొన్నారు. ‘ఆజాదీకా అమృత్ మహోత్సవ్’ కార్యక్రమంలో భాగంగా రంగారెడ్డి జిల్లా కందుకూరు మండలం కేంద్రంలో ‘ఉజ్వల భారత్- ఉజ్వల భవిష్యత్’ కార్యక్రమానికి శనివారం ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. 

ఇక్కడి నుంచే వర్చువల్‌గా ప్రధాని నరేంద్ర మోదీ పలు రాష్ట్రాల విద్యుత్‌కు సంబంధించిన ప్రాజెక్టులను ప్రారంభించడంతో పాటు ఈ పధకాన్ని కూడా జాతికి అంకితం చేశారు.  ఈ సందర్భంగా కిషన్ రెడ్డి  మాట్లాడుతూ సోలార్ విద్యుత్ ప్లాంట్ వల్ల 1.65 లక్షల టన్నుల బొగ్గు అదా అవుతుందని చెప్పారు. వేల కోట్ల రూపాయల ఖర్చును తగ్గించుకోవాల్సిన అవసరం ఉందని పేర్కొంటూ అందులో భాగంగా రీనబులే ఎనర్జీ ప్రోత్సహించాలని సూచించారు. 

ఖమ్మం జిల్లాలో ఒక పట్టణాన్ని బొగ్గు గనుల తవ్వకాల తీసుకున్నారని చెబుతూ ఇది బాధాకరమని పేర్కొన్నారు. 2,45,555 మెగా వాట్స్ విద్యుత్ అభివృద్ధి అయ్యిందని, 2014 తర్వాత 4 లక్షల మెగావాట్స్ సౌర విద్యుత్‌ను ఉత్పత్తి చేస్తున్నామని వెల్లడించారు. ప్రజలు సౌర విద్యుత్‌పై అవగాహన పెంచుకోవాలని కోరారు.

గ్రామం నుంచి పట్టణం కార్యాలయం ఏదైనా కావచ్చు, సౌర విద్యుత్ ఉత్పత్తి చేసే అవకాశం వినియోగించుకోవాలని ఆయన సూచించారు. ఎక్కువ సౌర విద్యుత్ ఉత్పత్తి అయితే మాములు విద్యుత్ కు అంతగా డిమాండ్ ఉండదని ఆయన పేర్కొన్నారు. ఎక్కడ కూడ వ్యవసాయ మోటార్లకు మీటర్లు పెట్టాలని తాము చెప్పలేదని ఆయన స్పష్టం చేశారు.  కొన్ని మీడియా సంస్థలు, కొన్ని రాజకీయ పార్టీలు అనవసరంగా ప్రచరం చేస్తున్నాయని ధ్వజమెత్తారు.

ఎన్టీపిసి 4,000 మెగావాట్స్ పవర్ ప్రాజెక్ట్ త్వరలో పూర్తి కాబోతుందని ఆయన ప్రకటించారు. రామగుండం లో రాష్ట్ర రైతుల కొసం జై కిసాన్ బ్రాండ్ యూరియా కొనుగోలుపై సబ్సిడీ నిమిత్తం కేంద్రం ఒక బస్తా మీద రూ.3,000లను చెల్లిస్తుందని తెలిపారు.

ప్రధాని జాతికి అంకితం 

రామగుండం 100 మెగావాట్ల సౌర విద్యుత్ ప్రాజెక్టుతో పాటు కేరళలోని 92 మెగావాట్ల సౌర విద్యుత్ ప్రాజెక్టును జాతికి అంకింతం చేశారు. రాజస్థాన్‌లో 735 మెగావాట్ల సోలార్ ప్రాజెక్టు, గుజరాత్‌లోని హైడ్రోజన్ ఫిల్లింగ్ స్టేషన్లకు ఆయన వర్చువల్ ద్వారా శంకుస్థాపన చేశారు.

రామగుండం ఎన్టీపిసి జలాశయం నీటిపై నిర్మించిన 100 మెగావాట్ల తేలియాడే సౌర విద్యుత్ ప్రాజెక్టు ద్వారా సాధారణ సమయంలో ఎండకు రోజుకు 5 లక్షల యూనిట్‌ల విద్యుత్ ఉత్పత్తి చేస్తుండగా దాదాపు 2 లక్షల యూనిట్లను గోవా రాష్ట్రానికి అందిస్తుండగా మిగతా 3 లక్షల యూనిట్లను విఫణికి సరఫరా చేస్తుని ప్రధాని తెలిపారు. 

40 బ్లాక్ నిర్మించిన ఈ ప్రాజెక్టులో ఒక్కో బ్లాక్‌లో 2.5 మెగావాట్ల సామర్థంతో విద్యుత్‌ను ఉత్పత్తి చేస్తుని పేర్కొన్నారు. హెచ్‌డిపిఈ (హై డెన్సిటీ పాలిఇథలిన్)తో తయారు చేసిన ప్లోటర్లపై సౌర ఫలకాలు ఏర్పాటు చేసి విద్యుత్ ఉత్పత్తి చేస్తున్నారు. జూలై 1వ తేదీ నుంచి 100 మెగావాట్ల విద్యుత్‌ను ఉత్పత్తి చేస్తున్నారు.

ఈ సందర్భంగా విద్యుదీకరణ అనంతరం దేశ ప్రజల జీవితాల్లో వచ్చిన మార్పులపై హిమచల్ ప్రదేశ్, త్రిపుర, విశాఖపట్నం, ఉత్తరప్రదేశ్, గుజరాత్ వాసులతో వీడియో కాన్ఫరెన్స్‌లో మాట్లాడారు.