ఉపాధ్యాయ ఎంపికల కుంభకోణంలో కీలకం మమతా, అభిషిక్!

పశ్చిమ బెంగాల్ స్కూల్ సర్వీస్ కమిషన్ రిక్రూట్‌మెంట్ కుంభకోణంపై  కొనసాగుతున్న విచారణ తరువాత అరెస్ట్ అయినా మాజీ మంత్రి పార్థ ఛటర్జీతో పాటు, రాష్ట్ర ముఖ్యమంత్రి మమతా బెనర్జీ, ఆమె మేనల్లుడు, టిఎంసి జాతీయ కార్యదర్శి అభిషేక్ బెనర్జీలు ఈ నేరంలో చురుకుగా పాల్గొన్నారని బిజెపి నాయకులు ఆరోపించారు.

“మమతా బెనర్జీ ప్రధాన దోషి. పార్థ ఛటర్జీ సిఎంతో దాదాపు 8 నుండి 10 గంటలు గడిపేవారు, ఎస్ ఎస్ సి కుంభకోణం మమత సమ్మతితోనే జరిగింది. మమతా బెనర్జీ, ఆమె మేనల్లుడు ఇప్పుడు తనను తాను రక్షించుకోవడానికి ప్రయత్నిస్తున్నారు. మేము ఇంకేమి వస్తుందో వేచిచూస్తాం” అని బెంగాల్ బిజెపి ఉపాధ్యక్షుడు సౌమిత్రా ఖాన్ తెలిపారు.

“ఈడీ కేవలం నగదు కోసం మాత్రమే సోదాలు చేస్తున్నట్లయితే,  బ్యాంకు ఖాతాలోని డబ్బును ఎందుకు విచారించడం లేదు? డబ్బును సిఎం మేనల్లుడు అభిషేక్ బెనర్జీకి పంపారు.  దానిపై కూడా దర్యాప్తు చేయాలి.  ఇది పెద్ద కుట్ర” అని ఆయన ఆరోపించారు. 


మరోవైపు, మమతా బెనర్జీ లాంటి పెద్ద నేతకు ఈ కుంభకోణం గురించి తెలియకుండా ఉండలేరని బీజేపీ జాతీయ కార్యదర్శి అనుపమ్ 
హజారా తెలిపారు.  “పార్థ ఛటర్జీ ఇంటికి డబ్బు ఎక్కడి నుంచి వస్తుందో మమతా బెనర్జీ లాంటి పెద్ద నాయకురాలికి తెలియకపోవడం సాధ్యం కాదు, ఆమె నిరంకుశ నాయకురాలు. ఆమె అనుమతి లేకుండా పార్టీలో ఎవరూ ఊపిరి పీల్చుకోలేరు. హైకమాండ్ అనుమతి లేకుండా ఏదైనా జరుగుతుందా?”అని ప్రశ్నించారు.

“పార్థ ఛటర్జీ ఎవరి అంగీకారంతో ఈ డబ్బు వసూలు చేశారో కూడా భవిష్యత్తులో తెలుస్తుంది. బహుశా తృణమూల్ కాంగ్రెస్ (టిఎంసి) పార్థను ఎవరి పేరును అదుపులోకి తీసుకోకూడదని ఆందోళన చెందుతున్నట్లున్నది. అందుకే అతన్ని అన్ని పార్టీ పదవుల నుండి సస్పెండ్ చేశారు.” అని ధ్వజమెత్తారు.

పశ్చిమ బెంగాల్ స్కూల్ సర్వీస్ కమీషన్, పశ్చిమ బెంగాల్ బోర్డ్ ఆఫ్ ప్రైమరీ ఎడ్యుకేషన్ రిక్రూట్‌మెంట్ అవకతవకలను ఈడీ పరిశీలిస్తోంది. ఈ కుంభకోణం జరిగినప్పుడు ఛటర్జీ పశ్చిమ బెంగాల్‌లో విద్యాశాఖ మంత్రిగా ఉన్నారు. ఈ కుంభకోణంలో పాల్గొన్న వారి మనీలాండరింగ్ కోణంలో ఈడీ దర్యాప్తు చేస్తోంది.

అతని సన్నిహితులలో ఒకరైన అర్పితా ముఖర్జీని కూడా నగరంలోని కొన్ని ప్రాంతాల్లోని ఆమె నివాసాలలో కోట్లాది రూపాయల నగదు స్వాధీనం చేసుకున్న తర్వాత ఈడీ అరెస్టు చేసింది. గురువారం సాయంత్రం, నగరంలోని చినార్ పార్క్ ప్రాంతంలోని ముఖర్జీకి సంబంధించిన మూడవ అపార్ట్‌మెంట్‌పై కేంద్ర ఏజెన్సీ అధికారులు దాడి చేశారు. 
 
ఫ్లాట్‌కు తాళం వేసి ఉండడంతో పాటు కీలు కనిపించకపోవడంతో సెంట్రల్ ఫోర్స్ అధికారుల సమక్షంలో ఈడీ స్లీత్‌లు దాని ప్రవేశ ద్వారం తెరిచారు. అంతకుముందు, ముఖర్జీకి చెందిన బెల్గోరియా ఏరియా ఫ్లాట్‌లో దాడులు నిర్వహించారు. అక్కడ సుమారు రూ. 28 కోట్ల లెక్కల్లో చూపని నగదు పెద్ద మొత్తంలో బంగారం మరియు వెండిని దాచి పెట్టినట్లు స్పష్టంగా కనిపించింది.