కామన్వెల్త్‌ గేమ్స్‌లో మీరాబాయికి స్వర్ణం, మరో మూడు పతాకాలు

బర్మింగ్‌హామ్‌: కామన్వెల్త్‌ గేమ్స్‌లో రెండోరోజు భారత వెయిట్‌ లిఫ్టర్లు అదరగొట్టారు. శనివారం రెండవ రోజున నాలుగు వేర్వేరు పతకాలు సాధించారు. టోక్యో ఒలింపిక్స్‌లో రజతం సాధించి 49 కేజీల కేటగిరీలో అలవోకగా, ప్రత్యర్థులకు అందనంత బరువెత్తి మొదటి స్థానంలో నిలిచిన  మణిపూర్‌కు చెందిన మీరాబాయి స్నాచ్‌లో 88 కేజీలు, క్లీన్‌ అండ్‌ జర్క్‌లో 113 కేజీలు (మొత్తం 201 కేజీలు) ఎత్తి భారత్  నుండి తొలి బంగారు పతాకం కైవసం చేసుకుంది.
 పురుషుల 55కిలోల విభాగంలో సంకేత్‌ సాగర్‌ రజత పతకం, 61 కిలోల విభాగంలో గురురాజ పుజారి కాంస్య పతకం సాధించారు. సంకేత్‌ సాగర్‌ స్నాచ్‌లో 113కిలోలు, క్లీన్‌ అండ్‌ జెర్క్‌లో 135కిలోల బరువును లిఫ్ట్‌ చేశాడు. క్లీన్‌ అండ్‌ జెర్క్‌లో 139కిలోల బరువును లిఫ్ట్‌ చేయడంలో విఫలమయ్యాడు.
 మహారాష్ట్రకు చెందిన సంకేత్‌ స్నాచ్‌లో 113 కేజీలు, క్లీన్‌ అండ్‌ జర్క్‌లో 135 కేజీలు (మొత్తం 248 కేజీలు) బరువెత్తిన అతను రెండో స్థానంలో నిలిచాడు. కేవలం ఒక కేజీ బరువు తేడాతో బంగారు పతాకం కోల్పోయాడు. ఈ విభాగంలో మొహమ్మద్‌ అనీఖ్‌ కస్‌దమ్‌ (మలేసియా)కు స్వర్ణ పతకం దక్కింది. దీంతో భారత్‌కు తొలి కామన్వెల్త్‌ గేమ్స్‌లో తొలి పతకం రజతాన్ని అందించాడు. 
మహిళల 55 కిలోల బరువులో బింద్యారాణి రజిత పతాకం పొందారు. ఇక గురురాజ పుజారి స్నాచ్‌లో 118కిలోలు, క్లీన్‌ అండ్‌ జెర్క్‌లో 151కిలోలు బరువును ఎత్తి మూడోస్థానంలో నిలిచాడు. మొత్తం 269 కిలోల బరువును ఎత్తి కాంస్య పతకాన్ని సాధించాడు. దీంతో రెండోరోజు భారత్‌కు రెండు పతకాలు దక్కాయి.
కాగా, బ్యాడ్మింటన్‌లో భారత జట్టు తొలి లక్ష్యం పూర్తయింది. మిక్స్‌డ్‌ టీమ్‌ ఈవెంట్‌లో వరుసగా రెండో విజయంతో భారత్‌ క్వార్టర్‌ ఫైనల్‌ చేరుకుంది. గ్రూప్‌ ‘ఎ’ రెండో లీగ్‌ మ్యాచ్‌లో టీమిండియా 5–0తో శ్రీలంక జట్టును ఓడించింది. మొదటి రోజున పాకిస్థాన్ ను ఓడించారు.
స్విమ్మింగ్‌ పురుషుల 100 మీటర్ల బ్యాక్‌స్ట్రోక్‌ విభాగంలో భారత స్విమ్మర్‌ శ్రీహరి నటరాజ్‌ ఫైనల్లోకి దూసుకెళ్లాడు. సెమీఫైనల్లో శ్రీహరి 54.55 సెకన్లలో గమ్యానికి చేరి నాలుగో స్థానంలో నిలిచి ఫైనల్‌ బెర్త్‌ ఖరారు చేసుకున్నాడు.   పురుషుల బాక్సింగ్‌లో తెలంగాణ బాక్సర్‌ హుసాముద్దీన్‌ (57 కేజీలు) ప్రిక్వార్టర్‌ ఫైనల్లోకి, మహిళల విభాగంలో లవ్లీనా బొర్గోహైన్‌ (70 కేజీలు) క్వార్టర్‌ ఫైనల్లోకి ప్రవేశించారు.
 భారత్‌కు తొలి పతకాన్ని అందించిన వెయిట్‌లిఫ్టర్ సంకేత్ సర్గర్ తన పతకాన్ని భారత సైన్యానికి అంకితమిచ్చాడు. 55 కేజీల విభాగంలో 248 కేజీలు ఎత్తి ఒక్క కేజీ తేడాతో స్వర్ణం కోల్పోయిన సంకేత్.. తన ప్రదర్శనపై కొంత అసంతృప్తి వ్యక్తం చేశాడు. తాను మరింత మెరుగైన ప్రదర్శన చేయాల్సిందని చెప్పాడు. 
 
 అంచనాలకు మించి రాణించలేకపోయానని పేర్కొన్న సంకేత్.. క్లీన్ అండ్ జెర్క్‌లో నిరాశపరిచాడు. ఫలితంగా పసిడి సాధించే అవకాశాన్ని కోల్పోయాడు. అయితే, రజత పతకం సాధించడం కొంత ఆనందంగానే ఉందని పేర్కొన్నాడు.