సీఎం రేవంత్ రెడ్డి పై చర్యలు తీసుకోవాలి

ఎన్నికల ప్రచారంలో భాగంగా హిందుత్వంపై,  హిందూ విశ్వాసాలపై,  హిందువుల ఆరాధ్య దైవం శ్రీరామచంద్రుడు, సీతామాతలపై విమర్శలు గుప్పించడాన్ని విశ్వహిందూ పరిషత్ తప్పుపడుతోంది. ఇటీవల తుక్కుగూడ బహిరంగ సభలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట్లాడుతూ అయోధ్య శ్రీరామ జన్మభూమి అక్షింతలను అవమానపరిచారని విశ్వహిందూ పరిషత్ ఆగ్రహం వ్యక్తం చేసింది. 

“విశ్వహిందూ పరిషత్ వాళ్లు పంచిన అక్షింతలు అయోధ్య నుంచి వచ్చినవి కాదని, అవి కంట్రోల్ బియ్యంతో తయారుచేసి పంచారు”అని ఆరోపించడాన్ని వ్యతిరేకించింది. హిందువుల మనోభావాలు దెబ్బతీసేలా ఓటు బ్యాంకు రాజకీయాలకు ప్రాధాన్యమిస్తూ,  ముస్లిం, క్రైస్తవుల మెప్పు కోసం ప్రయత్నం చేసిన రేవంత్ రెడ్డి పై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేసింది. 

తెలంగాణ ఎన్నికల అధికారి వికాస్ రాజు గారిని కలిసి వీహెచ్‌పీ    నేతలు ఫిర్యాదు చేశారు. గతంలో మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు, బీఆర్ఎస్  వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వకుంట్ల తారక రామారావు మాట్లాడుతూ   జై శ్రీరామ్ అంటే ఉద్యోగం వస్తుందా ?  పొలాలకు నీరు వస్తాయా?  అంటూ వ్యంగంగా ఎగతాళి చేశారని ఎన్నికల అధికారి దృష్టికి తీసుకెళ్లారు.

 ప్రస్తుతం కాంగ్రెస్ నేత అద్దంకి దయాకర్ కూడా విచక్షణ కోల్పోయి హిందుత్వంపై దూషణలు చేస్తున్నారని వివరించారు. హిందూ దేవి దేవతలను దూషించే నేతలపై చట్టపరమైన చర్యలు తీసుకొని, రాజ్యాంగ విలువలను కాపాడాలని వారు ఎన్నికల అధికారిని కోరారు. ఈ కార్యక్రమంలో పరిషత్ రాష్ట్ర కార్యదర్శి  పండరీనాథ్, ఉపాధ్యక్షులు జగదీశ్వర్, సహకార్యదర్శి రావినూతల శశిధర్, ప్రచార ప్రముఖ్ పగుడాకుల బాలస్వామి, ధర్మ ప్రసార్ ప్రాంత సహ ప్రముఖ్ సుభాష్ చందర్, బజరంగ్ దళ్ రాష్ట్ర కన్వీనర్ శివ రాములు పాల్గొన్నారు.