మట్టిలో మాణిక్యం… స్టేట్ థర్డ్ ర్యాంకర్

మట్టిలో మాణిక్యం… స్టేట్ థర్డ్ ర్యాంకర్
 
* శిశుమందిర్ బాలికకు రాష్ట్ర స్థాయిలో మూడో ర్యాంక్ 

చిన్న కుటుంబం నుంచి వచ్చినా, పట్టుదలతో పుల్లా చైత్ర రాష్ట్రంలోనే థర్డ్ ర్యాంక్ సాధించటం అభినందనీయం అని రిటైర్డ్ ఐ ఎ ఎస్ అధికారి, విద్యాభారతి దక్షిణ భారత అధ్యక్షులు డాక్టర్ చామర్తి ఉమా మహేశ్వరరావు కొనియాడారు. కార్పొరేట్ స్కూల్స్ కాకపోయినా, టాప్ ర్యాంక్ తెచ్చుకోవటం సంతోషకరం అని అభిప్రాయపడ్డారు. 
విద్యాభారతికి అనుబంధంగా తెలంగాణ లో శిశుమందిర్ పేరుతో వందలాది స్కూల్స్ నడుస్తున్నాయి.
సేవా భావంతో నామమాత్రపు ఫీజు తో విలువలతో కూడిన విద్యను అందిస్తూ ఉంటాయి. ఈ పాఠశాలల్లో చదువుతూ ర్యాంక్ లు సాధించిన విద్యార్థులు అందరికీ ఆయన అభినందనలు తెలియచేశారు. హైదరాబాద్ సైదాబాద్ ప్రాంతంలోని శ్రీ సరస్వతీ శిశుమందిర్ పాఠశాలలో పుల్లా చైత్ర పదోతరగతి పూర్తి చేశారు. మొన్నటి పబ్లిక్ పరీక్షల్లో 600 కి గాను 595 మార్కులు సాధించారు. ప్రధానమైన సబ్జెక్టులలో వందకు వంద తెచ్చుకొన్నారు.
చైత్ర తండ్రి ప్రైవేటు ఉద్యోగి కాగా, తల్లి శిశుమందిర్ స్కూల్ లోనే టీచర్ గా సేవలు అందిస్తున్నారు. మధ్య తరగతి కుటుంబమే అయినా తల్లిదండ్రులు చైత్ర చదువుకు బాగా ప్రాధాన్యం ఇచ్చారు.  స్కూల్ ప్రిన్సిపాల్ ఆధ్వర్యంలో శిశుమందిర్ టీచర్స్ ప్రోత్సాహంతో ర్యాంక్ ను సాధించినట్లు చైత్ర వెల్లడించారు. ఒత్తిడి లేని ప్రణాళిక, విలువలతో కూడిన విద్యతోనే ఈ విజయం సాధ్యం అయిందని వివరించారు.
స్టేట్ లో థర్డ్ ర్యాంక్ తెచ్చుకొన్న పుల్లా చైత్ర కు శ్రీ సరస్వతీ విద్యాపీఠం తెలంగాణ అధ్యక్షులు ప్రొఫెసర్ తిరుపతిరావు, కార్యదర్శి అనఘా వెంకట లక్ష్మి  ఆత్మీయ సత్కారం నిర్వహించారు.  చైత్ర తల్లిదండ్రులు, స్కూల్ ప్రిన్సిపాల్ ను పిలిపించి అభినందనలు తెలిపారు. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా 970 మంది విద్యార్థులు 39 పాఠశాలల నుంచి పదోతరగతి పరీక్షలకు హాజరయ్యారు.
ఇందులో 594 మంది విద్యార్జులకు 500 కు పైగా మార్కులు లభించాయి. మొత్తం స్టూడెంట్స్ లో 85శాతం మంది ఫస్ట్ క్లాస్ లు తెచ్చుకొన్నారు. ఓవరాల్ గా 99 శాతం రిజల్ట్ సాధించారు. ఈ సందర్భంగా విద్యార్జులు, తల్లిదండ్రులు, టీచర్స్ కు తిరుపతిరావు, వేంకట లక్ష్మి అభినందనలు తెలిపారు.