సైబర్ నేరగాళ్ల అక్రమ సామ్రాజ్యాన్ని కూకటివేళ్లతో పెకిలించేందుకు హైదరాబాద్ పోలీసులు ఎక్కుపెట్టిన ‘ఆపరేషన్ ఆక్టోపస్’ అస్త్రం ఇప్పుడు దేశవ్యాప్త సమరానికి దిక్సూచిగా మారింది. నగర పోలీస్ యంత్రాంగం ప్రదర్శించిన అసమాన తెగువ, వ్యూహాత్మక చొరవ దేశ రాజధాని ఢిల్లీని కదిలించడమే కాకుండా, కేంద్ర ప్రభుత్వం అత్యున్నత స్థాయి సమీక్షా సమావేశాన్ని నిర్వహించేలా ప్రేరేపించింది.
డిజిటల్ ఆర్థిక మోసాల్లో కీలకమైన ‘మ్యూల్’ ఖాతాల అక్రమ చలామణీని ఛేదించడంలో హైదరాబాద్ పోలీసులు సాధించిన అద్భుత విజయాలను కేంద్ర ఆర్థిక సేవల విభాగం (డీఎఫ్‌ఎస్) ఒక ఆదర్శ నమూనాగా తీసుకుంది. ఈ నేపథ్యంలోనే కేంద్ర ఆర్థిక సేవల విభాగం కార్యదర్శి నేతృత్వంలో ఢిల్లీలో గురువారం జరిగిన కీలక సమావేశం సైబర్ నేరాల నియంత్రణలో ఒక నవశకానికి నాంది పలికింది. ఈ సమావేశంలో హైదరాబాద్ సీపీ వీసీ సజ్జనర్ పాల్గొన్నారు.
నగరంలో పంజా విసురుతున్న సైబర్ మాయగాళ్లకు అడ్డుకట్ట వేసేందుకు హైదరాబాద్ పోలీసులు అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ‘ఆపరేషన్ ఆక్టోపస్’, నేరగాళ్ల నెట్‌వర్క్‌ను మూలాల నుంచి దెబ్బతీసింది. ఇందులో 32 మంది బ్యాంక్ అధికారులను నగర సైబర్ క్రైమ్ పోలీసులు అరెస్ట్ చేశారు. ముఖ్యంగా అమాయకుల పేరిట తెరిచే మ్యూల్ ఖాతాలను నేరగాళ్లు ఎలా వినియోగించుకుంటున్నారో పక్కా ఆధారాలతో సహా బహిర్గతం చేయడంతో కేంద్రం అప్రమత్తమైంది.
హైదరాబాద్ పోలీస్ కమిషనర్ వీసీ సజ్జనర్ అందించిన క్షేత్రస్థాయి నివేదికల ఆధారంగా ఐ4సీ, సీబీఐ, ఆర్బీఐ వంటి అగ్రశ్రేణి సంస్థలతో పాటు వివిధ బ్యాంకుల ఉన్నతాధికారులతో కేంద్రం ప్రత్యేక సమీక్ష నిర్వహించింది. ఈ భేటీలో హైదరాబాద్ పోలీసుల పనితీరును ప్రత్యేకంగా కొనియాడడమే కాకుండా, ఇక్కడి విజయవంతమైన మోడల్‌ను దేశమంతటా అమలు చేయాలని నిర్ణయించింది.
నేరగాళ్ల వేటలో మరింత వేగం పెంచేందుకు ‘మ్యూల్ హంటర్.ఏఐ’ అనే కృత్రిమ మేధస్సు సాధనాన్ని తక్షణమే వినియోగంలోకి తీసుకురావాలని ఆర్బీఐ బ్యాంకులకు కీలక ఆదేశాలు జారీ చేసింది. సమన్వయ లోపం లేకుండా పోలీసులు, బ్యాంకులు రియల్ టైం డేటాను పంచుకోవాలని, ఎస్‌ఎల్‌బీసీల ద్వారా ప్రజల్లో విస్తృత అవగాహన కల్పించాలని ఈ సమావేశం దిశానిర్దేశం చేసింది.
హైదరాబాద్ పోలీస్ యంత్రాంగం ప్రదర్శించిన ఈ కార్యదక్షత మిగిలిన రాష్ట్రాలకు స్ఫూర్తిదాయకమని కేంద్ర అధికారులు అభిప్రాయపడ్డారు. వెరసి, హైదరాబాద్ పోలీసుల అలుపెరగని పోరాటం ఇప్పుడు దేశవ్యాప్త సైబర్ భద్రతకు ఒక కొత్త మార్గదర్శిగా నిలుస్తూ, మోసగాళ్ల ఆట కట్టించేందుకు యావత్ యంత్రాంగాన్ని సన్నద్ధం చేసింది.

More Stories
కేరళలో యూడీఎఫ్ గెలిస్తే ప్రభుత్వం ఏర్పాటులో కీలకంగా ముస్లిం లీగ్!
తెలంగాణలో మోదీ పర్యటనలో రూ.7,823 కోట్ల అభివృద్ధి పనులు
సగంకు పైగా దేశాలలో `కఠినంగా’ పత్రికా స్వేచ్ఛ