వైద్యుల కొరత లేదని, వారి సేవల వినియోగంలోనే లోపం 

భారత దేశంలో వైద్యుల కొరత లేదని, వారి సేవల వినియోగంలోనే లోపముందని లోక్‌ సత్తా పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు డాక్టర్‌ జయప్రకాష్‌ నారాయణ్‌ తెలిపారు. 75 ఏళ్ల స్వాతంత్య్ర సంబరాల్లో భాగంగా ఇండియన్‌ మెడికల్‌ అసోసియేషన్‌, రంగరాయ వైద్య కళాశాల సంయుక్తంగా ఏర్పాటు చేసిన ‘సమగ్ర ఆరోగ్య విధానం’ సదస్సులో పాల్గొన్నారు.  

 దేశ ప్రజలకు సంపూర్ణ ఆరోగ్యం అందించాల్సిన బాధ్యత ప్రభుత్వాలపై ఉందని చెప్పారు. గతంలో వైఎస్‌ఆర్‌ ప్రవేశపెట్టిన ఆరోగ్యశ్రీ పథకం ద్వారా రాష్ట్ర ప్రజలకు కొంత వరకూ న్యాయం జరుగుతోందని, ఇతర రాష్ట్రాలకూ ఆదర్శంగా నిలిచిందని తెలిపారు. గ్లోబల్‌ వార్మింగ్‌ వల్ల వాతావరణంలో అనేక మార్పులు చోటుచేసుకుంటున్నాయని పేర్కొన్నారు. 

అధిక వర్షాలు, వరదలు, ఎండలు ఇందులో భాగమేనని తెలిపారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పర్యావరణ పరిరక్షణకు చర్యలు తీసుకోవాలని సూచించారు. సరైన కార్యాచరణ లేకే ఏటా వరద ముప్పును ఎదుర్కోవలసి వస్తోందని ఆయన చెప్పారు. 

నేటి విద్యా విధానంలో ఎన్నో లోపాలు ఉన్నాయని, విద్యా ప్రమాణాలు పెంపొందించేందుకు ప్రభుత్వాలు చర్యలు తీసుకోవాలని సూచించారు. పాఠశాలల క్రమబద్ధీకరణపై సరైన చర్చ జరగాలని సూచించారు.