జగన్‌ కన్ను పడితే ఏదైనా సర్వనాశనమే

ముఖ్యమంత్రి వై ఎస్ జగన్‌ మోహన్ రెడ్డి కన్ను పడితే ఏదైనా సర్వనాశనమేనని, ఇందుకు విశాఖలో రుషికొండ ఒక నిదర్శనమని బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు, మాజీ ఎమ్యెల్యే  విష్ణుకుమార్‌రాజు దుయ్యబట్టారు. పచ్చటి రుషికొండ పర్యాటకులను ఎంతో అలరించేదని, జగన్‌ కన్ను పడ్డాక.. దాని రూపమే మారిపోయిందని పేర్కొన్నారు.

అక్కడ ఏమి జరుగుతున్నదో తెలుసుకోవడానికి హైకోర్టు న్యాయవాది వస్తే, ఆయనతో పాటు అక్కడికి వెళ్లిన మీడియా ప్రతినిధులపై కేసులు పెట్టారని తెలిపారు. త్వరలో విశాఖ బీచ్‌ ను కూడా తాకట్టు పెట్టేసి, అక్కడికి వెళ్లే సందర్శకుల నుంచి కూడా చార్జీలు వసూలు చేస్తారేమోనని విశాఖ ప్రజలు భయపడుతున్నారని తెలిపారు.

మూడు రాజధానులపై ఎవరికీ నమ్మకం లేదని, ప్రధాని మోదీ శంకుస్థాపన చేసిన అమరావతే రాజధానిగా ఉండాలని ఆయన స్పష్టం చేశారు. అంతగా కావాలంటే, కడపను సొంత రాజధానిగా ప్రకటించుకోవాలని ఎద్దేవా చేశారు. వైసీపీ అధికారంలోకి వస్తే దశల వారీగా మద్య నిషేధం అమలుచేస్తామని 2019 ఎన్నికలకు ముందు హామీ ఇచ్చి, ఇప్పుడు అందుకు విరుద్ధంగా వ్యవహరిస్తున్నారని విష్ణుకుమార్‌రాజు విమర్శించారు.