క్యాసినో డీలర్లు, ఏజెంట్ల ఇళ్లలో ఈడీ దాడులు… నేతలలో కలవరం 

హైదరాబాద్‌లోని క్యాసినో డీలర్లు, ఏజెంట్ల ఇళ్లు, కార్యాలయాల్లో సోదాలలో భాగంగా సైదాబాద్‌కు చెందిన చికోటి ప్రవీణ్‌, బోయినపల్లికి చెందిన మాధవరెడ్డి ఇళ్లతో సహా ఎనిమిది చోట్ల న్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ (ఈడీ) అధికారులు బుధవారం తనిఖీలు చేపట్టారు. బుధవారం ఉదయం నుంచి అర్ధరాత్రి దాకా ఈ సోదాలు సాగాయి. ఆ ఇద్దరి సెల్‌ఫోన్లతో పాటు ల్యాప్‌టా్‌పలను ఈడీ అధికారులు సీజ్‌ చేశారు.
 
ముఖ్యమైన పత్రాలు, క్యాసినోలతో చేసుకున్న ఒప్పందాలు, హవాలా మార్గంలో తెచ్చిన నగదుకు సంబంధించి ఆధారాలను ఈడీ స్వాధీనం చేసుకున్నట్లు తెలిసింది. వారికి రెండు తెలుగు రాష్ట్రాలలోని పలువురు మంత్రులు, ప్రజాప్రతినిధులు, కీలక రాజకీయ నాయకులతో సన్నిహిత సంబంధాలు ఉన్నట్లు వెల్లడి కావడంతో ఈ దాడుల పట్ల వారు కలవరం చెందుతున్నారు. మాధవరెడ్డి ఇంట్లో ఒక కారుపై మంత్రికి సంబంధించిన కారు స్టిక్కర్‌ అతికించి ఉంది.
 
ఏకంగా ప్రత్యేక విమానాల్లో విదేశాలకు తీసుకెళ్లి కోట్లలో క్యాసినోలు ఆడించే ఖతర్నాక్‌ ఆర్గనైజర్‌  చీకోటి ప్రవీణ్‌ అని గుర్తించారు. చీకోటి ప్రవీణ్‌ ఒకప్పుడు నగరంలో సాదాసీదా పేకాట క్లబ్బులు నడిపించిన వ్యక్తి. బేగంపేట, వనస్థలిపురం, సికింద్రాబాద్, జూబ్లీహిల్స్‌ తది తర ప్రాంతాల్లో సెలబ్రిటీల కోసమే క్యాసినోలు ఏర్పాటుచేసి దందా సాగించేవాడు. 
 
2014 తర్వాత అతడి సుడి మారిపోయిందని చెబుతారు. ఇద్దరు మంత్రులు, 16 మంది ఎమ్మెల్యేల సాన్నిహిత్యంతో చీకోటి వ్యవహారం విదేశాలకు విస్తరించింది. ప్రత్యేక విమానాల్లో ఇండోనేషియా, నేపాల్‌కు తీసుకెళ్లి రూ.కోట్లలో పేకాట ఆడించడం వరకు వెళ్లాడు. ఇండోనేషియా, నేపాల్, శ్రీలంకలో పేకాట ఆడించేందుకు హవాలా ద్వారా నగదు లావాదేవీలు చేసి ఈడీకి అడ్డంగా బుక్కయినట్టు తెలిసింది.
 
హైదరాబాద్‌లో భారత కరెన్సీని హవాలా రూపంలో అందించి.. నేపాల్, ఇండోనేషియాలో తనకు ఎంత కావాలో ఆమేరకు అక్కడి కరెన్సీని తీసుకునేవాడు. ఇలా గత జూన్‌ 10, 11, 12, 13 తేదీల్లో 8 ప్రత్యేక విమానాల్లో నేపాల్‌లోని హోటల్‌ మిచీక్రౌన్‌లో భారీ ఎత్తున క్యాసినో ఏర్పాటుచేసి చాలామంది ప్రముఖులను తరలించాడు. సమాచారం అందుకున్న ఈడీ అధికారులు హవాలా ద్వారా వెళ్లిన నగదుకు సంబంధించి కీలక ఆధారాలు సేకరించి రంగంలోకి దిగినట్టు తెలిసింది.
 
బాలీవుడ్, టాలీవుడ్‌కు చెందిన ప్రముఖ హీరోలు, హీరోయిన్లు సైతం చీకోటితో సాన్నిహిత్యంగా ఉన్న ఫొటోలు, వీడియోలు ఈడీ అధికారులను షాక్‌ తినేలా చేసినట్టు తెలుస్తోంది. గతంలో బేగంపేటలోని ఓ అపార్ట్‌మెంట్‌లో జరిగిన బర్త్‌డే ఫంక్షన్‌లో క్యాసినో ఏర్పాటుచేసిన అంశం పెద్ద దుమారమే రేపింది. ఆ పార్టీకి ఓ మంత్రి, ఇద్దరు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీతోపాటు సీనియర్‌ ఐఏఎస్‌లు హాజరవడం సంచలనం రేపింది.