కాళేశ్వరం ప్రాజెక్టు పనులు నిలిపివేయమన్న సుప్రీంకోర్టు 

కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించిన మూడో (అదనపు) టీఎంసీ పనుల్లో స్టేటస్ కో పాటించాలని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వాన్ని సుప్రీంకోర్టు ఆదేశించింది. తదుపరి ఉత్తర్వులు వచ్చే వరకు పనులు నిలిపివేయాలని స్పష్టం చేసింది. భూసేకరణ గురించి పక్కనపెడితే.. ప్రాజెక్టుకు పర్యావరణ అనుమతులు లేవన్న విషయాన్ని కోర్టు ప్రస్తావించింది. భూసేకరణ లావాదేవీలను సమగ్రంగా నమోదు చేస్తామని, భూసేకరణ చట్టబద్ధతను హైకోర్టు తేల్చాలని పేర్కొంది.
దీనిపై ఆగస్టు 16 లోగా అఫిడవిట్ దాఖలు చేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. మూడో టీఎంసీ (అదనపు) పనులను పర్యావరణ అనుమతులు, డీపీఆర్ లేకుండా రాష్ట్ర ప్రభుత్వం చేపడుతోందని పలువురు భూనిర్వాసితులు, చెరుకు శ్రీనివాస్ రెడ్డి గతంలో హైకోర్టును ఆశ్రయించారు. ఈ ప్రాజెక్టు కోసం జరుగుతోన్న భూసేకరణను అడ్డుకోవాలని కోరారు.
వీరి పిటిషన్​ను హైకోర్టు కొట్టివేయడంతో సుప్రీం కోర్టును ఆశ్రయించారు. బుధవారం ఈ పిటిషన్​ను జస్టిస్ ఏఎం ఖన్విల్కర్, జస్టిస్ అభయ్,  జస్టిస్ జేబీ పార్థీవాలాతో కూడిన ముగ్గురు సభ్యుల బెంచ్ విచారించింది. పర్యావరణ అనుమతులు లేకుండా మూడో టీఎంసీ పనులు జరుగుతున్నాయని, ఇందుకోసం భూసేకరణ చేపడుతున్నారని నిర్వాసితుల తరపున సీనియర్ న్యాయవాది రంజిత్ కుమార్ వాదనలు వినిపించారు.
రూ. 16 వేల కోట్ల ఖర్చుతో అదనపు టీఎంసీ పనులు చేపట్టారని కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. ప్రాజెక్టుపై నేషనల్ గ్రీన్ ట్రిబ్యూనల్ (ఎన్జీటీ) కూడా స్టే ఇచ్చిందని తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం తరపున సీనియర్ అడ్వకేట్ వైద్య నాథన్ వాదనలు వినిపించారు. కేవలం 120 రోజుల్లో నీటిని లిఫ్ట్ చేయాలనే ఉద్దేశంతో  రాష్ట్ర ప్రభుత్వం కాళేశ్వరం ప్రాజెక్టును చేపట్టిందని పేర్కొన్నారు.
అయితే, అకాల వర్షాలు పడే సందర్భాల్లో తక్కువ సమయంలో ఎక్కువ నీటిని ఎత్తిపోసేలా మూడో టీఎంసీ పనులు చేపడుతున్నట్లు తెలిపారు. ఇందులో రైతుల ప్రయోజనాలు కూడా ఉన్నాయన్నారు. ప్రాజెక్టులో నీటిని ఎత్తిపోయడం పక్క రాష్ట్రానికి ఇష్టం లేదని చెప్పారు.
మూడో టీఎంసీకి పర్యావరణ అనుమతులపై కేంద్రం నిర్ణయం తీసుకోవాలని ఎన్జీటీ తీర్పు ఇచ్చిందని, అందుకే స్టేటస్​కో విధించవద్దని కోరారు. దీంతో ప్రాజెక్టు పర్యావరణ అనుమతులు చూపించాలని బెంచ్ కోరింది. మూడో టీఎంసీ పనులపై స్టేటస్ కో విధిస్తూ, తదుపరి విచారణను వచ్చే నెల 23 కు వాయిదా వేసింది.