ప్రత్యక్ష ఎన్నికలకు యడియూరప్ప స్వస్తి

బీజేపీ సీనియర్ నేత, నాలుగు సార్లు కర్ణాటక ముఖ్యమంత్రిగా పనిచేసిన బీఎస్ యడియూరప్ప త్వరలోనే ప్రత్యక్ష ఎన్నికలకు స్వస్తి చేయనున్నట్లు ప్రకటించారు.  2023 అసెంబ్లీ ఎన్నికల్లో షికారిపుర నియోజకవర్గాన్ని తాను వదులు కుంటున్నట్లు శుక్రవారం  ప్రకటించారు. తన కుమారుడు బీవై విజయేంద్ర అక్కడి నుంచి పోటీ చేస్తారని తెలిపారు.
”నేను పోటీ చేయడం లేదు. షికారిపుర నుండి విజయేంద్ర నిలబడతాడు. నాకంటే ఎక్కువ మెజారిటీతో విజయేంద్రను గెలిపించాలని షికారిపుర ప్రజలను వేడుకుంటున్నాను” అని యడియూరప్ప తెలిపారు. దక్షిణాదిన మొదటిసారిగా బిజెపిని అధికారంలోకి తీసుకు రావడంతో ఆయన కీలక పాత్ర వహించారు. మొత్తం దక్షిణాది రాష్ట్రాలలోని విశేషమైన ప్రజాదరణ గల బిజెపి నాయకుడిగా గుర్తింపు పొందారు. 
పాత  మైసూరు నుంచి పోటీ చేయాలని విజయేంద్ర అభిమానులు కోరుకుంటున్నారనే విషయంపై అడిగినప్పుడు, అక్కడ్నించి పోటీ చేయాలనే గట్టి ఒత్తిడి విజయేంద్రపై ఉందని, అయితే తాను షికారిపురను ఖాళీ చేయడం, పోటీకి దూరంగా ఉండాలనుకోవడంతో అక్కడ్నించే విజయేంద్ర పోటీ చేస్తారని యడియూరప్ప సమాధానమిచ్చారు.
బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడుగా 2020 జూలైలో విజయేంద్ర నియమితుడయ్యాడు. దానికి ముందు బీజేపీ యువజన విభాగం ప్రధాన కార్యదర్శిగా పనిచేశారు. 2018 మే అసెంబ్లీ ఎన్నికలకు ముందు మైసూరులోని వరుణ నియోజకవర్గం నుంచి ఆయన టిక్కెట్ ఆశించి నప్పటికీ పార్టీ నిరాకరించింది.
అయితే, ఆ తర్వాత కేఆర్ పేట్, సిరా అసెంబ్లీ సెగ్మెంట్లలో 2019, 2020లో జరిగిన ఉప ఎన్నికల్లో బీజేపీ ఘన విజయం సాధించడంలో విజయేంద్ర కీలక పాత్ర పోషించారు. దాంతో పార్టీలో ఆయనకు ప్రాధాన్యత పెరిగింది.
గత ఏడాది 75 సంవత్సరాల అనధికార వయోపరిమితి దాటిన కారణంగా ముఖ్యమంత్రి పదవికి పోటీ చేసిన యడ్డ్యూరప్ప ఇప్పటికి కర్ణాటకలో అత్యంత ప్రజాదరణ గల బిజెపి నేతగా పేరొందారు. వచ్చే ఏడాది జరిగే అసెంబ్లీ ఎన్నికల్లో బిజెపి ప్రచారంలో ఆయన కీలక పాత్ర పోషింప వలసి ఉంది. సొంతంగా ఎన్నికల్లో పోటీ చేయకపోవడంతో    ఎన్నికల ప్రచారంలో కీలక పాత్ర పోషించే అవకాశం ఉంది.
కాగా, మాజీ సీఎం సిద్ధరామయ్య, కేపీసీసీ అధ్యక్షుడు డీకే శివకుమార్‌ సీఎం పదవి కోసం కలలు కంటున్నారని, అయితే కాంగ్రెస్‌ పార్టీ అధికారంలోకి రాదని, వారిద్దరూ సీఎంలు కాలేరని యడియూరప్ప స్పష్టం చేశారు. వచ్చే శాసనసభ ఎన్నికల్లో బీజేపీ మళ్లీ అధికారం చేపడుతుందని భరోసా వ్యక్తం చేశారు.
బీజేపీ విజయాన్ని కాంగ్రెస్, ఇతర ఏ పార్టీ కూడా అడ్డుకోలేదని ధీమా వ్యక్తం చేశారు. విజయేంద్ర మాట్లాడుతూ యడియూరప్ప కేవలం ఎన్నికల్లో మాత్రమే పోటీ చేయరని, రాజకీయాలకు వీడ్కోలు పలకడం లేదని స్పష్టం చేశారు.   యడియూరప్ప 1983 నుంచి 8 సార్లు షికారిపుర ఎమ్మెల్యేగా గెలుపొందారు. 1999లో ఒక్కసారి ఓడిపోయారు. 2014 ఎన్నికల్లో శివమొగ్గ లోక్‌సభ నియోజకవర్గం నుంచి ఎంపీగా గెలుపొందారు.