హైదరాబాద్​ను అతలాకుతలం చేసిన భారీ వర్షం

మరోసారి భారీ వర్షం హైదరాబాద్​ను అతలాకుతలం చేసింది. శుక్రవారం ఉదయం నుండి హైదరాబాద్ లో వర్షం పడుతూనే ఉండగా..సాయంత్రం ఒక్కసారి కుంభవర్షం పడింది. దీంతో లోతట్టుప్రాంతాలన్నీ నీటమునిగాయి. ఎక్కడ చూసిన..ఎటు చూసిన వరదనీరే కనిపిస్తుంది. రోడ్లన్నీ నదులను తలపించాయి.
అటు ఉత్తర తెలంగాణ, ఇటు దక్షి ణ తెలంగాణలోని పలు జిల్లాలు తడిసి ముద్దయ్యా యి. భాగ్యనగరం మాటైతే చెప్పక్కర్లేదు. ఏ ప్రాంతం నిండుకుండలా మారిపోయింది. పది రోజుల క్రితం వర్షాలతో ఉక్కిరిబిక్కిరి అయిన రాష్ట్రం మరోసారి వరుణ ప్రతాపం తో ఇబ్బందులు పడేలా కన్పిస్తోంది. ఏ సమయంలో ఎటువంటి ఉపద్రవం కన్పిస్తోంది. ఏ సమయంలో ఎటువంటి ఉపద్రవం వచ్చి పడుతుందోనని జనం బెంబేలెత్తిపోతున్నారు.
హైదరాబాద్ నగరంలో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. ప్రజలు కొన్ని చోట్ల ఇంటి నుంచి బయటకు వెళ్లలేని పరిస్థితి నెలకొంది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు తెలిపారు. అత్యవసరమైతే తప్ప ఇంటి నుంచి బయటకు రావొద్దని హెచ్చరిస్తున్నారు.
హఫీజ్ పేట్, బాలానగర్ లో 9.8 సెంటీమీటర్ల వర్షపాతం నమోదు కాగా.. కూకట్ పల్లి, శేర్లింగంపల్లి వెస్ట్ లో 6.8 సెంటీమీటర్లు.. మియాపూర్, మాదాపూర్, ఆర్సిపురంలో 7.6 సెంటీమీటర్లు.. ఏఎస్ రావు నగర్ లో 7.1 సెంటీమీటర్లు.. మౌలాలిలో 7.2 సెంటీమీటర్లు.. కుత్బుల్లాపూర్ లో 7.4 సెంటీమీటర్ల వర్షం కురిసింది.
ఖైరతాబాద్ లో 5.4 సెంటీమీటర్లు..చర్లపల్లిలో 5.2 సెంటీమీటర్లు.. బోరబండ యూసఫ్ గూడాలో 5.1 సెంటీమీటర్లు.. జూబ్లీహిల్స్, పాటిగడ్డ, నాంపల్లిలో 4.9 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. కుత్బుల్లాపూర్ పరిసరాల్లోని ప్రసూన నగర్, మల్లికార్జున నగర్, వాని నగర్, ఇంద్ర సింగ్ నగర్, శ్రీనివాస్ నగర్​ను వరద ముంచెత్తింది.
నాలాల్లోని వరద కాలనీల్లోకి రావడంతో డ్రైనేజీ నీరు రోడ్లపై ప్రవహిస్తోంది. సురారం ప్రధాన రహదారిపై భారీగా వర్షం నీరు నిలవడంతో వాహనాలు నెమ్మదిగా వెళ్లాల్సిన పరిస్థితి ఏర్పడింది. శ్రీ రాంనగర్, వెంకటేశ్వర కాలనీలోని లోతట్టు ప్రాంతాల్లో వరద నీరు నిలిచింది. జీడిమెట్ల డిపో వద్ద వరద నీరు రోడ్డుపై నిలిచింది. భారీ వర్షానికి చార్మినార్ సమీపంలోని మక్కా మసీదు ప్రాంగణంలో మదద్ ఖానా గోడ కూలింది.
మొన్న వచ్చిన వర్షాలతో ఇప్పటికే నదులు ఉప్పొంగి ఊళ్ల మీదకు వరదల రూపంలో వచ్చి చెరువులు, కుంటలు పొంగి ప్రవహించగా.. దాన్నుంచి ఇంకా కోలుకోకుండగనే తిరిగి ఇంత దట్టంగా వర్షాలు కురుస్తుండటంతో జనం అల్లాడిపోతున్నారు.
ఉదయం నుంచి కురుస్తున్న భారీ వర్షాలతో ఉమ్మడి వరంగల్, రంగారెడ్డి, హైదరాబాద్, ఖమ్మం, నల్లగొండ, కరీంనగర్ జిల్లాలు ముద్దాయ్యాయి. వర్షాల మూలంగా ఏ క్షణంలో ఎటువంటి ఉపద్రవం ముంచుకువస్తుందో.. ఎటువంటి ప్రమాదాన్ని ఎదుర్కొవాల్సి వస్తుందోనని ఆందోళన చెందుతున్నారు. పల్లపు ప్రాంతాల ప్రజలైతే బిక్కుబిక్కుమంటూ జీవనం గుడుపుతున్నారు.
మరో మూడు రోజులపాటు భారీ వర్షాలు కురిసే అవకాశాలున్నాయంటూ వాతావరణ శాఖ హెచ్చరికల నేపథ్యంలో అయా జిల్లాల్లోని అధికార యంత్రాంగం అప్రమత్తమైంది. మహబూబాబాద్ , నిజామాబాద్‌, ఆదిలాబాద్‌, క‌రీంన‌గ‌ర్‌, వ‌రంగ‌ల్‌, ఖ‌మ్మం, మెద‌క్‌, రంగారెడ్డి జిల్లాల్లో భారీ వ‌ర్షాలు కురియ‌నున్నాయి. ప్ర‌జ‌లు అప్ర‌మ‌త్తంగా ఉండాల‌ని సూచించింది. అవ‌స‌ర‌మైతేనే బ‌య‌ట‌కు రావాల‌ని విజ్ఞ‌ప్తి చేసింది.