టివి చర్చలు, సోషల్‌ మీడియా కంగారు కోర్టులు

టివి చర్చలు, సోషల్‌ మీడియా కంగారు కోర్టులు (వాద, ప్రతివాదనలు లేని అనధికార కోర్టులు)దేశాన్ని వెనక్కి తీసుకెళ్తున్నాయని భారత ప్రధాన న్యాయమూర్తి ఎన్‌వి రమణ ఆవేదన వ్యక్తం చేశారు. పక్షపాత ధోరణితో, తక్కువ సమాచారం, ఓ ఎజెండాతో మాత్రమే నడిచేవిగా మీడియా తీరు ఉంటుందని ఆయన మండిపడ్డారు.
 
‘న్యాయమూర్తులకు వ్యతిరేకంగా సోషల్‌ మీడియాలో ఏకీకృత ప్రచారాలు జరుగుతున్నాయి. జడ్జిలు త్వరగా స్పందించలేకపోవచ్చు. దయచేసి దీన్ని బలహీనత లేదా నిస్సహాయతగా తీసుకోవద్దు’ అని హితవు చెప్పారు. రాంచిలోని నేషనల్ లా యూనివర్సిటీలో “ఓ న్యాయమూర్తి జీవితం” అంశంపై జస్టిస్ ఎస్ బి సిన్హా మెమోరియల్ ప్రసంగం శనివారం చేశారు. 
 
 ఇప్పుడు మీడియాకు ఉంటున్న సాధనాలు చాలా సామర్థ్యం కలవని, అయితే తప్పు, ఒప్పులు, మంచి, చెడు, అబద్ధం, నిజం మధ్య వ్యత్యాసాన్ని గుర్తించలేకపోతున్నాయని పేర్కొన్నారు. 
 
మీడియా విచారణకు కేసులను నిర్ధారించడంలో మార్గదర్శత లేదని, కొన్ని సార్లు అనుభవజ్ఞులైన న్యాయమూర్తులు కూడా కొన్ని సమస్యలపై నిర్ణయం తీసుకోవడం కష్టమని, కానీ మీడియా త్వరితగతిన కోర్టులను నడుపుతున్నట్లు చూస్తున్నామని ఆగ్రహం వ్యక్తం చేశారు. న్యాయం జరగాల్సిన సమస్యలపై అవగాహన లేని, ఎజెండాతో నడిచే చర్చలు ప్రజాస్వామ్య ఆరోగ్యానికి హానికరమని హెచ్చరించారు.

మీడియా పక్షపాత ధోరణితో వ్యాప్తి చేస్తోన్న అభిప్రాయాలు ప్రజాస్వామ్యాన్ని బలహీనపరుస్తున్నాయని, వ్యవస్థకు హాని కలిగిస్తున్నాయని సిజెఐ స్పష్టం చేశారు. ఈ ప్రక్రియలో న్యాయ పంపిణీ ప్రతికూలంగా ప్రభావితమౌతుంది ఆందోళన వ్యక్తం చేశారు. మీడియా బాధ్యతలను అతిక్రమించడం ద్వారా ప్రజాస్వామ్యాన్ని రెండు అడుగులు వెనక్కి తీసుకెళ్తున్నాయని మండిపడ్డారు. 

 
ప్రింట్‌ మీడియా కొంత వరకు జవాబుదారీతనంతో ఉందని, ఎలక్ట్రానిక్‌ మీడియా జవాబుదారీ తనం శూన్యమని పేర్కొన్నారు. ఇక సోషల్‌ మీడియా పరిస్థితి అధ్వాన్నంగా ఉందని విమర్శించారు. మీడియాకు స్వీయ నియంత్రణ, తమకంటూ ఓ కొలమానం ఉండాలని జస్టిస్ రమణ  సూచించారు. సోషల్‌ మీడియా బాధ్యతాయుతంగా వ్యవహరించాలని విజ్ఞప్తి చేశారు. 
 
ప్రజలకు అవగాహన కల్పించేందుకు, దేశాన్ని విద్యావంతులను చేసేందుకు ఎలక్ట్రానిక్‌ మీడియా తమ గొంతుకను వినియోగించాలని సూచించారు.

‘జడ్జిల మీద దాడులు పెరిగిపోతున్నాయి. ప్రజాప్రతినిధులు, రాజకీయ నాయకులు, అధికారులు, పోలీసు అధికారులు.. ఇలా రిటైర్‌మెంట్‌ తర్వాత సున్నిత అంశాలతో ముడిపడిన వ్యక్తులకు రక్షణ ఇస్తోంది మన దేశం. కానీ, న్యాయమూర్తుల విషయంలోనే అది జరగడం లేదు” అని విచారం వ్యక్తం చేశారు. 

 
`న్యాయమూర్తులంటే.. పది గంటలకు వచ్చి సాయంత్రం నాలుగు గంటలకు వెళ్లిపోతారు. సెలవుల్ని ఆస్వాదిస్తారు.. వాళ్లు వాళ్ల వాళ్ల జీవితాల్లో కంఫర్ట్‌గా ఉన్నారు అనేది ఒక దురభిప్రాయం మాత్రమే. అదంతా వాస్తవం కాదు’ అని స్పష్టం చేశారు. 
 
కొన్ని దశాబ్దాల క్రితం వరకు.. న్యాయమూర్తి అంటే కోర్టుల ముందు పార్టీల మధ్య వివాదాల పరిష్కారానికి మాత్రమే పరిమితం అనే అంచనాలు జనాలకు ఉండేవి. ఇప్పుడు, సమాజంలో ఆలోచించదగిన ప్రతి సమస్య న్యాయవ్యవస్థ ద్వారా పరిష్కరించబడుతుందని భావిస్తున్నారని తెలిపారు.న్యాయం అమలు చేయడానికి, న్యాయమూర్తులు సామాజిక వాస్తవాల గురించి తెలుసుకోవాలి. సామాజిక ఏకాంతంగా పరిమితం కాకూడదు. నిష్పాక్షికత, స్వతంత్రత అనేది మానసిక స్థితి అని మనం అర్థం చేసుకోవాలని సూచించారు. 
 
 ఈరోజుల్లో.. న్యాయం అందించడం అంత తేలికైన బాధ్యత కాదని రమణ చెప్పారు. ఇది రోజురోజుకూ సవాలుగా మారుతోందని అంటూ కొన్నిసార్లు, మీడియాలో, ముఖ్యంగా సోషల్‌ మీడియాలో న్యాయమూర్తులకు వ్యతిరేకంగా ఏకీకఅత ప్రచారాలు కూడా జరుగుతాయని గుర్తు చేసారు.