ముఖానికి బొట్టు లేదు, కాళ్లకు మెట్టెలు లేవు… అన్నమాచార్య కీర్తన!

టాలీవుడ్‌ గాయని శ్రావణి భార్గవి ఇటీవల విడుదల చేసిన అన్నమాచార్య  కీర్తన ` ‘‘ఒకపరి కోకపరి వయ్యారిమై … ‘ పాట  పెను వివాదం సృష్టిస్తోంది. ఆమె విడుదల చేసిన అల్బుల్లో ఈ పాట పాడుతూ అసభ్యకరమైన హావభావాలు ప్రదర్శించడం పట్ల తీవ్ర నిరసనలు వ్యక్తం అవుతున్నాయి.  అన్నమయ్య కీర్తనను అపహాస్యం చేసిందంటూ అన్నమయ్య వంశస్తులతో పాటు పలువురు నెటిజన్లు మండిపడుతున్నారు.  తాజాగా ఈ వివాదంపై కరాటే కల్యాణి ఘాటుగా స్పందించారు.

“శ్రావణ భార్గవి చేసిన వీడియోలో కొన్ని తప్పులున్నాయి. స్వామి సేవలో పాడే కీర్తనకు ఓ ఔన్నత్యం ఉంటుంది. దాని విలువను మనం కాపాడాలి.  తప్ప కాళ్లు రెండు పైకెత్తి ఊపుతూ చేయడమేంటి? నువ్వు పెళ్లైన అమ్మాయివి. కాళ్లకు మెట్టెలు లేవు, నుదుటన బొట్టు లేదు, మెడలో మంగళసూత్రం లేదు..” అంటూ ఆమె శ్రావణి భార్గవిని నిలదీశారు.

శాస్త్రబద్ధంగా ఉన్నప్పుడు అవెందుకు పాటించలేదు? ముందు అవి వేసుకో.. కీర్తనలు పాడుకునేటప్పుడు మీ పైత్యాన్ని ఇందులో చూపించొద్దు అంటూ ఆమె హితవు చెప్పారు.  కె.విశ్వనాథ్‌ సినిమాల్లో కూడా ఇలాంటివి ఉన్నాయి అంటే.. అప్పుడు తాను పుట్టలేదని, వాళ్లు ఇప్పుడు సినిమాలు చేసినా కూడా అందులో ఏ కీర్తన అయినా అభ్యంతరకరంగా ఉంటే కచ్చితంగా ఖండించాల్సిందే అని కళ్యాణి స్పష్టం చేశారు.

” భార్గవి పాట నాకు అభ్యంతరకరంగా ఉంది. ఆ పాటలో కొన్ని క్లిప్పులు తొలగించేలా చిన్న చిన్న ఎడిటింగ్‌ చేయాల్సిందే!”‘ అని కరాఖండిగా తేల్చి చెప్పారు. మరోవైపు ఏదేమైనా తన పాటను తొలగించనని  చేయనని మంకు పట్టిన శ్రావణ భార్గవి చివరకు సర్వత్రా విమర్శలు చెలరేగడంతో తలవంచి ఆ పాటను తొలగించడం గమనార్హం.

మండిపడ్డ తిరుపతి వాసులు 
గాయని శ్రావణి భార్గవి తీరుపై తిరుపతి వాసులు మండ్డిపడ్డారు. ‘‘ఒకపరి కోకపరి వయ్యారిమై’’ కీర్తనను అశ్లీలంగా ప్రదర్శించడాన్ని పుణ్యక్షేత్ర వాసులు తప్పుబట్టారు. శ్రావణి భార్గవి క్షమాపణ చెప్పాలని వారు డిమాండ్ చేశారు.  తిరుపతిలో పుట్టడం అదృష్టంగా భావిస్తారని చెబుతూస్వామి వారిని  కీర్తిస్తూ అన్నమయ్య భక్తితో ఆలపించిన సంకీర్తనలను వింటూ ప్రపంచం మొత్తం భక్తి భావంతో  పరవశిస్తోందని తెలిపారు.
 ‘‘ఒకపరి ఒకపరి వయ్యారమై’’ సంకీర్తనను గాయాని శ్రావణి భార్గవి తనకోసం చిత్రించకరించిన తీరు అభ్యంతరంగా ఉందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఒక సెలబ్రేట్ అనే గర్వంతో అన్నమయ్య కుటుంబంతో మాట్లాడారని ధ్వజమెత్తారు.  తిరుపతిలో శ్రావణి భార్గవిని అడుగుపెట్టనివ్వమని వారు స్పష్టం చేశారు. తిరుమల దర్శనానికి ఆమెను పంపకుండా అడ్డుకుంటామని హెచ్చరించారు. 
 
అన్నమయ్య కుటుంబానికి క్షమాపణ చెప్పాలని వారు డిమాండ్ చేశారు. సోషల్ మీడియా  నుంచి వెంటనే ఆ కీర్తనను తొలగించాలని స్పష్టం చేశారు. టీటీడీ ఎందుకు ఈ వ్యవహారం పై స్పందించలేదని వారు ప్రశ్నించారు. శ్రావణి భార్గవి వ్యవహార శైలిపై టీడీపీ అధికారులు స్పందించాలని డిమాండ్ చేశారు. 
 
అన్నమయ్య కీర్తనలు ఇకపై ఎవరు తప్పుగా చిత్రీకరించకుండా ఓ చట్టాన్ని టీటీడీ తీసుకురావాలని కోరారు. గాయని శ్రావణి భార్గవిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని తిరుపతి ఈస్ట్ పోలీస్ స్టేషన్‌లో సీఐకు తిరుపతి వాసులు ఫిర్యాదు చేశారు.