ఏపీలో దేవాదాయశాఖ రూ 300 కోట్ల ఫిక్సడ్‌ డిపాజిట్లు ఖాళీ

ఆంధ్ర ప్రదేశ్ లో హిందూ దేవాలయాలపై వై ఎస్ జగన్ మోహన్ రెడ్డి  ప్రభుత్వంలో దాడులు తీవ్రమవుతున్నాయి. ఒక వంక దేవాలయాలపై దాడులు జరిపి, దేవతా విగ్రహాలను ధ్వంసం చేసిన వారిని కాపాడుతూ, మరోవంక హిందువేతరుల పెత్తనం దేవాలయాలపై- దేవాలయ ఆస్తులపై ఉండేటట్లు చేయడంతో పాటు నేరుగా దేవాలయాల ఆస్తులపై ప్రభుత్వ కన్ను పడింది.
రాష్ట్రంలోని పలు దేవాలయాల ఆధునీకరణకు గతంలో రూ.138 కోట్లతో ప్రతిపాదనలను ఎటువంటి నిధులు అందుబాటులో ఉంచకుండా ఆమోదం తెలిపారు.  ఫలితం గా ఆ బిల్లుల చెల్లింపుకు రాష్ట్రవ్యాప్తంగా ఇతర దేవాలయాల ఫిక్స్‌డ్‌ డిపాజిట్లను రద్దుచేసి ఆ సొమ్ముతో బిల్లులు చెల్లించాల్సిన పరిస్థితి ఏర్పడింది.
అయితే, అభివృద్ధి పనులకు సంబంధించి రూ. 150 కోట్ల వరకే బిల్లులు చెల్లించాల్సి ఉన్నప్పటికీ దేవాదాయ ధర్మాదాయ ఉన్నతాధికారులు మాత్రం రూ. 300 కోట్లకుపైగా ఎఫ్‌డీలను రద్దుచేసి ఆసొమ్మును సీజీఎఫ్‌, ఈఏఎఫ్‌ ఖాతాల్లో వేయనున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే గడచిన రెండు వారాల్లో రూ.80 కోట్లకుపైగా ఎఫ్‌డీలు పై ఖాతాలకు జమచేసినట్లు సమాచారం.
 రాష్ట్ర వ్యాప్తంగా రూ. 20 లక్షలకుపైడి ఉన్న ఎఫ్‌డీలను రద్దుచేసి ఆసొమ్ముతో కాంట్రాక్టర్లకు బిల్లులు చెల్లించాలని ఇటీవలనే ప్రభుత్వం నిర్ణయం తీసుకోండి. ఈ మేరకు దశలవారీగా డిపాజిట్లు రద్దుచేసి ఆ సొమ్మును ఇతర ఖాతాలకు మళ్లిస్తున్నారు. రాష్ట్రంలోని ఏ, బీ, సీ కేటగిరీ పరిధిలోని వేలాది దేవాల యాల పరిధిలో సుమారు రూ. 3 వేల కోట్లకుపైగా ఎఫ్‌డీలు ఉన్నాయి.
ఆయా ఆలయాల పరిధిలో ప్రతి ఏటా ఉత్సవాలు, నిర్వహణ తదిరాల కోసం ఎఫ్‌డీలపై వచ్చే వడ్డీపై ఆధారపడే నిర్వహిస్తుంటారు. అయితే, ఆ శాఖ ఉన్నతాధికారులు ఆయా జిల్లాల పరిధిలోని ప్రముఖ దేవాలయాలకు సంబంధించిన ఎఫ్‌డీల నుండి సుమారు రూ. 300 కోట్లు సేకరించాలని లక్ష్యంగా పెట్టుకుని ఆ దిశగా రద్దుచేస్తున్నట్లు తెలుస్తోంది.
దీంతో అనేక దేవాలయాల్లో ఎఫ్‌డీ ఖాతాలు ఖాళీ అవుతు న్నాయని ఆయా దేవాలయాల పరిధిలోని ఉద్యోగుల్లో ఆందోళన వ్యక్తమవుతోంది. భవిష్యత్‌లో ఆలయాల నిర్వహణకు, జీతభత్యాలకు ఇబ్బందులు ఎదురైతే పరిస్థితి ఏమిటి? అని వారు ప్రశ్నిస్తున్నారు. ప్రస్తుతం రద్దు చేస్తున్న ఎఫ్‌డీలను తిరిగి జమ చేస్తారా?  అనే అంశంపై కూడా స్పష్టత లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
మరోవంక దేవాలయాల ఆధునీకరణకు తయారు చేసిన ప్రతిపాదనలతో నిబంధనలను ఉల్లంఘించి  ప్రైవేటు దేవాలయాల అభివృద్ధికి కూడా దేవాదాయ శాఖ అధికారులు నిధులను కేటాయించారు. అంతేకాకుండా ఒక్కో అభివృద్ధి పనికి గరిష్టంగా రూ. 20 లక్షల నుండి రూ. 25 లక్షల వరకూ మాత్రమే మంజూరు చేయాల్సి ఉందని చెబుతున్నారు. దీనిని కూడా పాటించకుండా ఇష్టారాజ్యంగా కేటాయించడంతో ఇప్పుడు ఈ చిక్కులు వచ్చి పడినట్లు ఉద్యోగులు చెబుతున్నారు.
 కృష్ణా జిల్లాలో అయితే ఓ ప్రైవేటు దేవాలయ అభివృద్ధికి ఏకంగా రూ. 60 లక్షలు కేటాయించినట్లు తెలుస్తోంది. అదేవిధంగా గ్రామాల పరిధిలో రామాలయాలు, సత్రాల ఆధునీకరణకు రూ. 5 లక్షల నుండి రూ. 10 లక్షల వరకూ కేటాయించినట్లు విమర్శలు వినిపిస్తున్నాయి. ప్రస్తుతం ఆబిల్లుల చెల్లింపుకు ఎఫ్‌డీలను రద్దుచేస్తున్నట్లు తెలుస్తోంది.
దేవాలయాల పరిధిలో వచ్చే ఆదాయంలో 55 శాతం ఖర్చులు, జీతభత్యాలకు వినియోగించాల్సి ఉంది. మిగిలిన 45 శాతం నిధులతో ఉత్సవాలు, కళ్యాణాలు ఇతర ఆధునీకరణ పనులకు వెచ్చించాల్సి ఉంది. అయితే, దేవాదాయ శాఖ పరిధిలోని కొంత మంది అధికారులకు ముందుచూపు కొరవడటంతో అందుకు పూర్తి భిన్నంగా ఆ నిధులను ఇతర అవసరాలకు వినియోగించినట్లు విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
 ఉన్నతాధికారుల జీతాలు, సీజీఎఫ్‌, ఈఏఎఫ్‌లకు కలిపి దేవాదాయ శాఖకు 25 శాతం నిధులను జమ చేయాలి. అలాగే, ఉద్యోగులు, అర్చకుల జీతాలు, కరెంట్ బిల్లులు మరో 25 శాతం ఖర్చవుతుంది. మొత్తం ఆదాయంలో 55 శాతం పోను మిగిలిన 45 శాతం ఆలయ ఖాతాల్లో భద్రపరచాలి.
ఆ సొమ్మును ఏడాదికొకసారి నిర్వహించే ఉత్సవాలు, కళ్యాణాలు, ఆలయ నిర్వహణకు వెచ్చించాలి. సరిగ్గా ఇక్కడే ఆశాఖ ఉన్నతాధికారులు నిబంధనలను తుంగలో తొక్కారు. నిర్వహణకు వెచ్చించాల్సిన 45 శాతం నిధులను ఇతర అవసరాలకు వినియోగించినట్లు తెలుస్తోంది. దీంతో గత ఏడాది చేపట్టిన అభివృద్ధి పనులకు సంబంధించి బిల్లుల చెల్లింపు ఎఫ్‌డీలను రద్దుచేసి ఆ సొమ్ముతో కాంట్రాక్టర్లకు బిల్లులను చెల్లించాల్సి వస్తోంది.