రాహుల్ పై పోటీ చేయడంతోనే నా కూతురిపై ఆరోపణలు… స్మ్రితి ఇరానీ

తన కూతురు చట్ట విరుద్ధంగా బార్ నడుపుతోందన్న కాంగ్రెస్ నేతల ఆరోపణల పట్ల ఆగ్రహం వ్యక్తం చేస్తూ  18 ఏళ్ల వయసున్న ఒక ఆడపిల్లపై, ఒక కళాశాల విద్యార్థినిపై ఇలాంటి ఆరోపణలు చేస్తూ ఆమెపై కాంగ్రెస్ నేతలు వ్యక్తిత్వ హననానికి పాల్పడుతున్నారని  కేంద్రమంత్రి స్మృతి ఇరానీ  ఆవేదన వ్యక్తం చేశారు. 
 
ఆమె తప్పల్లా తన తల్లి రాహుల్‌ గాంధీపై 2014, 2019 లోక్‌సభ ఎన్నికల్లో పోటీగా నిలబడటం,  గాంధీలకు వ్యతిరేకంగా మాట్లాడటమే అని స్పష్టం చేశారు.  గోవా ఎక్సైజ్ శాఖ షోకాజ్ నోటీసును చూపిస్తూ కాంగ్రెస్ పార్టీ తన కూతురి వ్యక్తిత్వాన్ని బహిరంగంగా కించపరుస్తోందని మండిపడుతూ ఆ షోకాజ్ నోటీసులో అసలు తన కూతురి పేరు ఎక్కడుందని స్మృతి ఇరానీ ప్రశ్నించారు.
ఆర్‌టీఐ అప్లికేషన్‌లో వివరాల ఆధారంగా మాట్లాడుతున్నానని కాంగ్రెస్ నేత జైరాం రమేష్ అంటున్నారని, ఆ ఆర్‌టీఐ అప్లికేషన్‌లో తన కూతురి పేరు ఎక్కడుందని ఈ మహిళా కేంద్ర మంత్రి నిలదీశారు. రాహుల్ గాంధీ, సోనియా గాంధీలను తరచూ విమర్శిస్తున్నందుకు 18 ఏళ్ల తన కూతురు గోవాలో అక్రమంగా బార్‌ నడుపుతోందనే ఆరోపణలు చేస్తున్నారని విమర్శించారు. ‘కేంద్రమంత్రి కూతురు కావడమే ఆమె శాపమా?’ అని ప్రశ్నించారు.
’18 ఏళ్ల నా కూతురి వ్యక్తిత్వాన్ని కూనీ చేయాలని ఇద్దరు కాంగ్రెస్ నేతలు లక్ష‍్యంగా పెట్టుకున్నారు. నా కూతురు కాలేజీలో చదువుకుంటోంది. ఎలాంటి బార్ నడపటం లేదు. కావాలంటే పేపర్లు చూసుకోండి. ఆమె పేరు ఎక్కడుంది?  నేను రాహుల్ గాంధీ, సోనియా గాంధీలను విమర్శిస్తున్నందు వల్లే నా కూతురిపై లేనిపోని ఆరోపణలు చేస్తున్నారు.  నా కుమార్తె రాజకీయ నాయకురాలు కాదు. సాధారణ విద్యార్థిని.’ అని స్మృతి ఇరానీ తెలిపారు.
తన కూతురుపై వచ్చిన ఈ ఆరోపణలు దురుద్దేశపూర్వకంగా చేసినవేనని, ఆమె వ్యక్తిత్వాన్ని చంపేయడమే కాకుండా.. తనను రాజకీయంగా దెబ్బతీయడం కూడా ఈ ఆరోపణల వెనుక ఉన్న ఉద్దేశమని స్మృతి ఇరానీ చెప్పుకొచ్చారు. ఇదంతా కాంగ్రెస్ అధినాయకత్వంగా చెప్పుకునే గాంధీ కుటుంబం కనుసన్నల్లోనే జరిగిందని ఆమె ఆరోపించారు.
సోనియా గాంధీ, రాహుల్ గాంధీ దోచేసిన రూ  5,000 కోట్ల భారతీయుల సంపదకు సంబంధించి ప్రెస్‌మీట్ పెట్టి మరీ తాను నిలదీసినందుకే ఇలా తన కూతురిని టార్గెట్ చేశారని  స్మృతి ఇరానీ ఆరోపించారు. తన కూతురిపై ఆరోపణలు చేసిన వారి సంగతి న్యాయస్థానంలోనే తేల్చుకుంటానని ఆమె స్పష్టం చేశారు. 
తన కూతురిపై ఆరోపణలు చేసేందుకే పనిగట్టుకుని ప్రెస్‌మీట్ పెట్టించిన గాంధీ కుటుంబానికి ఒక్కటే చెబుతున్నానని అంటూ  రాహుల్ గాంధీపై తాను 2024లో జరిగే లోక్‌సభ ఎన్నికల్లో మళ్లీ అమేథీ నుంచి పోటీ చేస్తానని, మళ్లీ రాహుల్‌ను ఓడిస్తానని ఆమె సవాల్ చేశారు. ఒక బీజేపీ కార్యకర్తగా, ఒక తల్లిగా ఇదే తన శపథం అని  స్మృతి ఇరానీ చెప్పారు.
కాగా, అంతకుముందు స్మృతీ ఇరానీ కూతురు జోయిష్ ఇరానీ గోవాలో రెస్టారెంట్ నడుపుతున్నారని, అందులో ఫేక్ లైసెన్స్‌తో బార్ కూడా ఉందని కాంగ్రెస్‌ నేతలు జైరాం రమేశ్, పవన్ ఖేరా ఆరోపించారు. మోదీ ప్రభుత్వం స్మృతి ఇరానీని వెంటనే పదవి నుంచి తొలగించాలని డిమాండ్ చేశారు.
అయితే ఈ ఆరోపణలను జోయిష్ ఇరానీ తరఫు న్యాయవాది కొట్టిపారేశారు. అవి నిరాధారమైనవని, స్మృతి ఇరానీ కూతురు అయినందువల్లే ఆమెపై రాజకీయ దురుద్దేశంతో లేని పోని ఆరోపణలు చేస్తున్నారని పేర్కొన్నారు.