“స్వరాజ్యమే నా జన్మ హక్కు” అని గర్జించిన తిలక్ 

డా. టి ఇంద్రసేనారెడ్డి 
సామాజిక శాస్త్రవేత్త 
 
* జన్మదిన నివాళి 
 
బ్రిటిష్ వలస పాలనకు వ్యతిరేకంగా దేశ ప్రజలు ఉమ్మడిగా సాయుధ పోరాటం మొదటిసారిగా 1857లో జరిపారు. పలు కారణాలతో అది ఫలించలేదు. అయితే ఆ తర్వాత `స్వరాజ్యమే నా జన్మహక్కు. నేను సాధిస్తాను” అంటూ 60 ఏళ్ళ తర్వాత లోకమాన్య బాలగంగాధర తిలక్ గర్జించే వరకు బ్రిటిష్ వారిని మన దేశం నుండి పారదోలడం కోసం చెప్పుకోదగిన ఉద్యమాలు జరగలేదని చెప్పవచ్చు. ఆ తర్వాత దేశంలో విప్లవోద్యమాలు అన్నింటికీ ఆయన స్ఫూర్తిగా నిలిచారు. 
 
కాంగ్రెస్ పార్టీని ఇద్దరు బ్రిటిష్ యువకులు ఏర్పాటు చేసినా, ప్రజా సమస్యలను బ్రిటిష్ పాలకుల దృష్టికి తీసుకొచ్చి, వారి పరిష్కారం కోసం కృషి చేయడం ద్వారా బ్రిటిష్ పాలకులలో సాధారణ ప్రజలలో వ్యతిరేకత తొలగించే ప్రయత్నం జరిగిందే గాని, `స్వరాజ్యం’ ఏర్పాటు చేయాలని కాంగ్రెస్ పార్టీ 1930ల తర్వాత కానీ ఘంటాపధంగా చెప్పలేదు. అందుకనే కాంగ్రెస్ పార్టీని ఆ రోజులలో “పిటీషన్ కాంగ్రెస్” అనేవారు. 
 
ప్రజానీకం `లోకమాన్య’ అని ప్రేమతో పిలుచుకునే  కేశవ గంగాధర తిలక్ లేదా బాల గంగాధర తిలక్ ప్రముఖ హిందుత్వ జాతీయ వాది.  హిందూ ధర్మ సంస్కృతుల సంరక్షణ ద్వారానే జనసామాన్యంలో జాతీయతను మేల్కొల్పాలి,   హిందూ సమాజ సంఘటన ద్వారానే స్వాతంత్ర్యం సాధించాలి అని నమ్మిన వ్యక్తి. వృత్తిరీత్యా
ఉపాధ్యాయుడు.  
 

లాల్ బాల్ పాల్ త్రిమూర్తులలో ఒకరైన తిలక్ భారత స్వాతంత్ర్య ఉద్యమానికి ప్రధాన నాయకులలో ఒకరు. ‘మేకర్ ఆఫ్ మోడర్న్ ఇండియా’ అని పిలవబడే తిలక్ ఒక శక్తిగా గుర్తింపు పొందారు.  ‘స్వరాజ్యం’  అనే ధృడమైన సంకల్పాన్ని భారత ప్రజలలో కలిగించారు.

ఆయన జూలై 23,1856న బొంబాయి ప్రెసిడెన్సీలో రాజ్ కాలంలో రత్నగిరి జిల్లాలోని హిందూ చిత్పవన్ బ్రాహ్మణ కుటుంబంలో జన్మించారు. పూణేలోని దక్కన్ కళాశాలలో గణిత శాస్త్రంలో బ్యాచిలర్ డిగ్రీని పొందారు. తన మాస్టర్స్ కోర్సును మధ్యలోనే మానేసిన తర్వాత  ప్రభుత్వ న్యాయ కళాశాలలో ఎల్ ఎల్ బి చదివారు.

 
తిలక్ 1890లో భారత జాతీయ కాంగ్రెస్‌లో చేరి స్వయం పాలనపై పార్టీలోని మితవాద అభిప్రాయాలకు వ్యతిరేకంగా తన బలమైన వ్యతిరేకతను వినిపించడం ప్రారంభించారు. బ్రిటీష్ వారిని తరిమి కొట్టడానికి సాధారణ రాజ్యాంగ బద్ద ఆందోళన వ్యర్థం అని స్పష్టం చేసేవారు. లార్డ్ కర్జన్ బెంగాల్ విభజన తరువాత, తిలక్ స్వదేశీ  ఉద్యమానికి, బ్రిటిష్ వస్తువుల బహిష్కరణకు హృదయపూర్వకంగా మద్దతు ఇచ్చారు.
లాల్-బాల్-పాల్
బ్రిటిష్ వారి పట్ల సానుకూల ధోరణిని అవలంభించే నాటి కాంగ్రెస్ నాయకులకు భిన్నమైన అభిప్రాయాలను వ్యక్తం చేస్తూ ఉండడంతో తిలక్ ను,  ఆయన మద్దతు దారులను కాంగ్రెస్ లో `అతివాదుల బృందం’ అని పిలిచేవారు.  తిలక్ ప్రయత్నాలకు బెంగాల్‌కు చెందిన తోటి జాతీయవాదులు బిపిన్ చంద్ర పాల్, పంజాబ్‌కు చెందిన లాలా లజపత్ రాయ్ మద్దతు ఇచ్చారు. ఈ ముగ్గురిని లాల్-బాల్-పాల్ అని పిలుస్తారు. 1907లో జరిగిన భారత జాతీయ కాంగ్రెస్ జాతీయ సమావేశంలో, భారత జాతీయ కాంగ్రెస్ పార్టీలోని మితవాద, అతివాద విభాగాల మధ్య భారీ సమస్య తలెత్తింది. ఫలితంగా కాంగ్రెస్ రెండు వర్గాలుగా చీలిపోయింది.
 

1896 సమయంలో, పూణే మరియు దాని చుట్టుపక్కల ప్రాంతాలలో బుబోనిక్ ప్లేగు అంటువ్యాధి చెలరేగింది.  బ్రిటిష్ వారు దానిని అరికట్టడానికి చాలా కఠినమైన చర్యలను చేపట్టారు. కమీషనర్ డబ్ల్యు సి రాండ్  ఆదేశాల ప్రకారం, పోలీసులు, సైన్యం ప్రైవేట్ నివాసాలపై దాడి చేశారు, వ్యక్తుల వ్యక్తిగత గోప్యతను ఉల్లంఘించి, వారి ఆస్తులను తగలబెట్టారు. వ్యక్తులు నగరంలోకి, వెలుపలికి వెళ్లకుండా నిరోధించారు. తిలక్ బ్రిటిష్ ప్రయత్నాల అణచివేత స్వభావాన్ని నిరసిస్తూ తన వార్తాపత్రికలలో దానిపై రెచ్చగొట్టే కథనాలు రాశారు.

ఆయన రచనలతో ప్రేరణ పొందిన చాపేకర్ సోదరులు  కమిషనర్ రాండ్,  మరియు లెఫ్టినెంట్  అయర్స్ట్   ల  హత్యకు జూన్ 22, 1897న  పాల్పడ్డారు. దానితో తిలక్  ప్రేరేపించినందుకు దేశద్రోహ ఆరోపణలపై 18 నెలల జైలు శిక్ష అనుభవించారు. 1908-1914 కాలంలో, బాల గంగాధర్ తిలక్ బర్మాలోని మాండలే జైలులో ఆరు సంవత్సరాల కఠిన కారాగార శిక్షను అనుభవించవలసి వచ్చింది.

 

 1908లో చీఫ్ ప్రెసిడెన్సీ మేజిస్ట్రేట్ డగ్లస్ కింగ్స్‌ఫోర్డ్‌ను హత్య చేసేందుకు విప్లవకారులు ఖుదీరామ్ బోస్, ప్రఫుల్ల చాకి చేసిన ప్రయత్నాలకు ఆయన  బహిరంగంగా మద్దతు ఇచ్చాడు.   జైలులో ఉన్న సమయంలో రచనను కొనసాగించారు. ఆయన రచనలో  గీత రహస్యం.

అతని కీర్తి, ప్రజాదరణతో భయపడిన బ్రిటిష్ ప్రభుత్వం ఆయన వార్తాపత్రికల ప్రచురణను నిలిపివేయడానికి ప్రయత్నించింది. మాండలే జైలులో మగ్గుతున్న సమయంలో ఆయన భార్య పూణేలో మరణించింది.

జలియన్‌వాలాబాగ్ హత్యాకాండ  తిలక్ ను ఎంతగానో కలచి వేసింది.   అనారోగ్యంతో బాధపడుతున్నప్పటికీ, తిలక్ ఏమి జరిగినా ఉద్యమాన్ని ఆపవద్దని భారతీయులకు పిలుపునిచారు. ఉద్యమానికి నాయకత్వం వహించాలని కోరుకున్నాఅతని ఆరోగ్యం సహకరించలేదు. తిలక్ మధుమేహంతో బాధపడుతూ చాలా బలహీనంగా మారిపోయారు. జూలై 1920 మధ్యలో, పరిస్థితి మరింత దిగజారడంతో ఆగష్టు 1 న   మరణించారు.

 
సామూహిక గణేష్ ఉత్సవాలు 

తిలక్  గణేష్ చతుర్థి ఉత్సవాలను సామూహికంగా జరుపుకొనే ఆనవాయితీని ప్రారంభించి, స్వాతంత్ర్య పోరాటంలో అవి కీలక భూమిక వహించేటట్లు చేశారు. ఆయన ప్రారంభించిన ఒరవడిలోనే నేడు మనం భాగ్యనగర్ లో సహా దేశంలో పలు ప్రాంతాలలో గణేష్ చతుర్థి ఉత్సవాలను సామూహికంగా పెద్ద ఎత్తున జరుపుకొంటున్నాము.  
భారతీయుల ఐక్యతను బలోపేతం చేయడానికి ఆయన ఆలోచనల నుండే ఈ ఉత్సవాలు వచ్చాయి.

మరాఠా సామ్రాజ్య స్థాపకుడు, ఛత్రపతి శివాజీ మహారాజ్ జన్మదినం  ‘శివ జయంతి’ని జరుపుకోవడానికి తిలక్ శ్రీ శివాజీ ఫండ్ కమిటీని కూడా ప్రారంభించారు. స్వాతంత్ర్య సమరయోధుడు గోపాల్ గణేష్ అగార్కర్ సంపాదకుడిగా మరాఠీలో కేసరి, ఆంగ్లంలో మరాఠా అనే రెండు వార పత్రికలను కూడా ప్రారంభించారు. ఈ ప్రచురణలు  భారత స్వాతంత్ర్య ఉద్యమంలో స్ఫూర్తిదాయక పాత్ర వహించాయి.
 

భారత ప్రజలలో స్వతంత్ర ఆకాంక్షను రగిల్చిన ఆయనను “భారత అశాంతికి పితామహుడు” అని బ్రిటీష్ రచయిత సర్ వాలెంటైన్ చిరోల్ అభివర్ణించారు. భారతీయ యువతకు నాణ్యమైన విద్యను అందించడం కోసం డెక్కన్ ఎడ్యుకేషన్ సొసైటీని కూడా స్థాపించారు. ఆయన ఆధునిక విద్య పేరుతో బ్రిటిష్ వారి చదువులపై భారతీయులు చూపుతున్నా మోజును తీవ్రంగా వ్యతిరేకించారు. ఆ విద్యావిధానం భారతీయ విద్యార్థుల పట్ల వివక్షత ప్రదర్శిస్తున్నారని ఘాటుగా విమర్శించారు.
భారతీయ యువతలో జాతీయవాద ఆలోచనలు కలిగించి, భారతీయ సంస్కృతిపై వారు దృష్టి సారించే కొత్త విద్యా విధానాన్ని దీని ద్వారా రూపొందించే ప్రయత్నం చేశారు. ప్రస్తుతం డెక్కన్ ఎడ్యుకేషన్ సొసైటీ స్థాపించబడింది. ఇది ప్రస్తుతం 40కు పైగా సంస్థలను నడుపుతోంది.
తిలక్ ను ఒక విలేకరి  “స్వాతంత్ర్యం లభిస్తే ప్రభుత్వంలో ఏ మంత్రిత్వ శాఖను తీసుకుంటారు?” అని ఓ విలేఖరి అడిగితే తిలక్ చెప్పిన
సమాధానం ” దేశానికి స్వతంత్రం వస్తే నేను ప్రభుత్వంలో చేరను.  నేను మా జిల్లా రత్నగిరికి వెల్లి ఇంతకు ముందు
పని చేసిన పాఠశాలలో ఉపాధ్యాయునిగా చేరతాను. ఎందుకంటే జాతి నిర్మాణం తరగతి గదిలోనే జరుగుతుంది” అని చెప్పారు.