హైకోర్టు తరలింపుపై పూర్తిస్థాయి ప్రతిపాదనలు లేవు

 అమరావతిలో ఉన్న రాష్ట్ర హైకోర్టును కర్నూలుకు తరలించాలని ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం నుండి సమగ్రమైన ప్రతిపాదనలు ఏవీ అందలేదని కేంద్ర న్యాయ శాఖ మంత్రి కిరణ్‌ రిజిజు తెలిపారు.  2020 ఫిబ్రవరిలో ఏపీ ముఖ్యమంత్రి ఈ విషయమై ప్రతిపాదనలు అందించారని,  కానీ తమ వద్ద పూర్తిస్థాయి ప్రతిపాదనలు లేవని స్పష్టం చేశారు.
“హైకోర్టు ప్రధాన ధర్మాసనాన్ని కర్నూలు తరలించే అంశంపై రాతపూర్వక విజ్ఞప్తి వచ్చిందా? సానుకూలంగా నిర్ణయం తీసుకునే అంశాన్ని కేంద్రం పరిశీలిస్తోందా?’’ అని లోక్‌సభలో వైసీపీ ఎంపీలు కోటగిరి శ్రీధర్‌, చింతా అనురాధ అడిగిన ప్రశ్నకు కేంద్ర మంత్రి శుక్రవారం లిఖితపూర్వక సమాధానం ఇచ్చారు.
కర్నూలుకు తరలింపుపై రాష్ట్ర ప్రభుత్వం, హైకోర్టు ఒక అభిప్రాయానికి వచ్చి కేంద్రానికి పూర్తిస్థాయిలో ప్రతిపాదనలను సమర్పించాల్సి ఉంటుందని కేంద్ర మంత్రి తెలిపారు.
‘ఏపీ హైకోర్టును అమ‌రావ‌తి నుంచి క‌ర్నూల్‌కు త‌ర‌లించాల‌నే ప్ర‌తిపాద‌న కేంద్రానికి అందింది. క‌ర్నూల్‌కు త‌ర‌లింపుపై హైకోర్టుతో సంప్ర‌దింపులు జ‌రిపి రాష్ట్ర ప్ర‌భుత్వ‌మే నిర్ణ‌యం తీసుకోవాలి.హైకోర్టు నిర్వ‌హ‌ణ ఖ‌ర్చుల‌న్నీ రాష్గ్ర ప్ర‌భుత్వ‌మే భ‌రిస్తుంది.హైకోర్టును క‌ర్నూల్‌కు త‌ర‌లింపుపై రాష్ట్ర ప్ర‌భుత్వం, హైకోర్టు క‌లిసి ఒక నిర్ణ‌యానికి రావాల్సి ఉంది.ఆ త‌ర్వాత ఆ ప్ర‌తిపాద‌న‌లు కేంద్రానికి పంపాల్సి ఉంటుంది’ అని  కిరణ్‌ రిజిజు పేర్కొన్నారు.
కాగా,  మంగళగిరి ఎయిమ్స్‌ నిర్మాణం వచ్చే నెలలో పూర్తవుతుందని కేంద్ర ఆరోగ్య శాఖ సహాయ మంత్రి భారతీ ప్రవీణ్‌ పవార్‌ తెలిపారు. లోక్‌సభలో కాంగ్రెస్‌ ఎంపీ ఉత్తమ్‌కుమార్‌ రెడ్డి అడిగిన  ప్రశ్నకు కేంద్ర మంత్రి లిఖితపూర్వక సమాధానం ఇస్తూ ఎయిమ్స్‌ ఏర్పాటుకు రూ.1618 కోట్లు మంజూరు చేశామని, అందులో రూ.1137.92 కోట్లు విడుదల చేశామని చెప్పారు.