లా కమిషన్ పరిశీలనలో జమిలి ఎన్నికలు

లోక్‌సభతో పాటు అన్ని రాష్ట్రాల అసెంబ్లీలకు ఒకేసారి ఎన్నికలు నిర్వహించాలన్న జమిలి ఎన్నికల అంశం లా కమిషన్ పరిశీలనలో ఉందని కేంద్ర ప్రభుత్వం వెల్లడించింది. ఈ మేరకు లోక్‌సభలో ఎంపీ భగీరథ చౌదరి అడిగిన ప్రశ్నకు కేంద్ర న్యాయశాఖ మంత్రి కిరణ్‌ రిజిజు సమాధానం ఇచ్చారు.

జమిలి ఎన్నికల అంశంపై పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ, కేంద్ర ఎన్నికల సంఘం సహా అనేక భాగస్వామ్య పక్షాలతో చర్చించినట్లు తెలిపారు. జమిలి ఎన్నికల నిర్వహణపై పార్లమెంటరీ స్టాండింగ్‌ కమిటీతో పాటుగా కేంద్ర ఎన్నికల సంఘంతో చర్చలు జరిపినట్లు ఆ సమాధానంలో రిజిజు తెలిపారు. ఈ అంశంపై భాగస్వామ్య పక్షాలతోనూ సుదీర్ఘంగా చర్చలు జరిపినట్లు ఆయన తెలిపారు.

ఏటా ఎన్నికలు జరగ డం వల్ల సాధారణ ప్రజా జీవనం దెబ్బతింటుందని, నిత్యావసర సేవలపై ప్రతికూల ప్రభావం పడుతుందని సిబ్బంది, ప్రజా సమస్యలు, న్యాయ మంత్రిత్వ శాఖకు చెందిన పార్లమెంటరీ స్థాయూ సంఘం తెలిపిందని వెల్లడించారు. లోక్‌ సభ, అసెంబ్లీలకు జమిలి ఎన్నికలు జరిపే విషయంపై ఎన్నికల కమిషన్‌తోపాటు అనేకమందితో చర్చలు జరిపిన ఈ సంఘం.. 79 పేజీల నివేదికలో కొన్ని కీలక సిఫారసులు చేసిందని చెప్పారు. దీని ఆధారంగా జమిలి ఎన్నికలకు రోడ్‌ మ్యాప్‌ను రూపొందించే అంశంపై లా కమిషన్‌ పరిశీలన జరుపుతోందని తెలిపారు.

‘స్టాండింగ్ కమిటీ నివేదికలో కొన్ని ప్రతిపాదనలు, సిఫార్సులు చేసింది. ఆ నివేదిక ఆధారంగా లా కమిషన్ సాధ్యాసాధ్యాలను అధ్యయనం చేస్తూ ఒక ప్రణాళిక తయారుచేసే పనిలో నిమగ్నమైంది. తరచుగా వచ్చే ఎన్నికలు నిత్యావసర సేవలు సహా ప్రజా జీవితాన్ని ప్రభావితం చేస్తున్నాయని స్టాండింగ్ కమిటీ తన నివేదికలో పేర్కొంది’ అని కేంద్ర మంత్రి తెలిపారు.

`పార్లమెంటుకు రాష్ట్ర అసెంబ్లీలకు వేరువేరుగా జరిగే ఎన్నికల కారణంగా భారీగా ప్రజాధనం ఖర్చవుతుందని పేర్కొంది. 2014-22 మధ్యకాలంలో 50 అసెంబ్లీలకు ఎన్నికలు జరిగాయి. ఈ ఎనిమిదేళ్లలో రూ. 7 వేల కోట్లకు పైగా ఎన్నికల నిర్వహణపై ఖర్చు పెట్టాల్సి వచ్చింది’  అని కేంద్ర న్యాయశాఖ కిరణ్ రిజిజు వివరించారు.  ఈ తరహాలో ప్రజాధనం వృథా ఖర్చును నివారించేందుకే జమిలి ఎన్నికలను ప్రతిపాదించినట్లు రిజిజు పేర్కొన్నారు.

అంతేకాక, ఎన్నికల కమిషన్‌ సిఫారసు మేరకు ఎన్నికల చట్టాన్ని సవరించామని చెబుతూ ఎన్నికల సంస్కరణలు నిరంతరం జరుగుతూనే ఉంటాయని వివరించారు.