పీవోపీ గణేష విగ్రహాలపై నిషేధం లేదు… హైకోర్టు స్పష్టం

రాష్ట్రంలో ప్లాస్టర్‌ ఆప్‌ ప్యారిస్‌ (పీవోపీ) వినాయక విగ్రహాల తయారీపై నిషేధం లేదని తెలంగాణ హైకోర్టు స్పష్టం చేసింది. అయితే, పీవోపీ విగ్రహాలను హుసేన్‌సాగర్‌లో నిమజ్జనం చేయోద్దని, జీహెచ్‌ఎంసీ ఏర్పాటు చేసిన ప్రత్యేక కుంటల్లోనే నిమజ్జనం చేయాలని పేర్కొంది.
పీవోపీ విగ్రహాల నిషేధంపై గతంలో మార్గదర్శకాలను జారీ చేసిన కేంద్ర కాలుష్య నియంత్రణ మండలి. పీసీబీ మార్గదర్శకాలను సవాల్‌ చేస్తూ విగ్రహ తయారీదారులు దాఖలు చేసిన పిటిషన్‌పై గురువారం హైకోర్టు విచారించింది. పీవోపీ విగ్రహాలు నిషేధిస్తూ ప్రభుత్వం ఇప్పటి వరకు ఎలాంటి జీవో ఇవ్వలేదన హైకోర్టు పేర్కొంది.
విగ్రహాల ఎత్తు తగ్గించేలా ఉత్తర్వులు ఇవ్వాలన్న ప్రభుత్వ అభ్యర్థననూ హైకోర్టు తోసిపుచ్చింది. దుర్గా పూజపై పశ్చిమ బెంగాల్‌ ప్రభుత్వ మార్గదర్శకాలను పరిశీలించాలని హైకోర్టు సూచించింది. హైకోర్టు తీర్పు పట్ల విగ్రహతయారీ దారులు ఆనందం వ్యక్తం చేశారు.
 ప్రతి ఏటా పోలీసులు, జీహెచ్‌ఎంసీ అధికారులు ఆంక్షల పేరుతో వేధింపులకు గురి చేస్తున్నారని ధూళ్‌పేటలోని విగ్రహాల తయారీదారులు వాపోయారు. కరోనా కారణంగా రెండేళ్ళుగా విగ్రహాలు అమ్ముడు పోలేదని, ఈ దఫా కాస్త విగ్రహాలకు డిమాండ్‌ ఉన్న నేపథ్యంలో పోలీసులు, జీహెచ్‌ఎంసీ అధికారులు నిబంధనల పేరుతో విగ్రహాల తయారీ పనులకు ఆటంకాలను కలిగిస్తున్నారని వివరించారు.
 కరోనా కంటే ముందు తయారు చేసిన కొన్ని విగ్రహాలను ఈ దఫా తీర్చి దిద్ది విక్రయించుకునేందుకు సిద్దమవుతుంటే అధికారులు ఆటంకాలను సృష్టించడంతో విధి లేని పరిస్థితులలో కోర్టును ఆశ్రయించాల్సి వచ్చిందని వారు పేర్కొన్నారు. కోర్టు తీర్పు తమకు కొంత ఊరటను ఇచ్చిందని వారు ఆనందం వ్యక్తం చేశారు.
గణేష్ ఉత్సవ సమితి హర్షం 

గణేష్ విగ్రహాల తయారీపై ఏలాంటి ఆంక్షలు లేవని స్పష్టం చేస్తూ విగ్రహాల ఎత్తు విషయంలో పరిమితి విధించాలన్న తెలంగాణ ప్రభుత్వ వాదనను కూడా తిరస్కరిస్తూ  హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వుల పట్ల భాగ్యనగర్ గణేష్ ఉత్సవ సమితి హర్షం ప్రకటించింది. తెలంగాణా ప్రభుత్వం హైకోర్టు ముందు వాస్తవాలు పెట్టని కారణంగా గత సంవత్సరం ఆంక్షలు విధిస్తూ వచ్చిన తీర్పు కారణంగా నెలకొన్న గందరగోళ పరిస్థితులకు నేటి తీర్పుతో ముగింపు పలికినట్లయిందని సమితి కార్యదర్శి రావినూతల శశిధర్ తెలిపారు.
 
ఒక కుట్రపూరితంగా హిందూ పండుగలను లక్ష్యంగా చేసుకున్న హిందూ వ్యతిరేఖ శక్తులు ప్రతి పండుగను వివాదం చేసే కుట్రలకు తెరలేపుతున్నారని ఆయన ధ్వజమెత్తారు.  అందులో భాగంగానే గణేష్ ఉత్సవాల కారణంగా నీటి కాలుష్యం పెద్దఎత్తున జరుగుతుందని అవాస్తవాలు ప్రచారం సాగిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇపిటిఆర్ఐ నివేధికలు మట్టి విగ్రహాలకంటే ప్లాస్టర్ అఫ్ పారిస్ విగ్రహాలే ఉత్తమమని గతంలో పరిక్షలు జరిపి నివేదికలు ఇచ్చిందని ఆయన గుర్తు చేశారు. 
 
అయితే ఆ నివేదికలను తొక్కిపెట్టిన కాలుష్య నియంత్రణ బోర్డు, జిఎంహెచ్ సి   అధికారులు తమ అవినీతిని కొనసాగించడానికి జలకాలుష్యానికి గణేష్ ఉత్సవాలే కారణమనే విష ప్రచారాన్ని కొనసాగిస్తున్నాయని శశిధర్ మండిపడ్డారు. ఇప్పటికైనా వాస్తవాలు కోర్టు ముందు, ప్రజల ముందు బహిర్గతం చేయాలని తెలంగాణా రాష్ట్రం లోని చెఱువులు వాటి పరిస్థితిపై శ్వేత పత్రం విడుదల చేయాలని ఆయన డిమాండ్ చేశారు.