తెలంగాణాలో త్వరలో మహారాష్ట్ర తరహా రాజకీయాలు!

రాష్ట్రంలో అతి త్వరలోనే మహారాష్ట్ర తరహా రాజకీయాలు రాబోతున్నాయని ఎమ్మెల్యే రాజాసింగ్‌  జోస్యం చెప్పారు. గురువారం నిజామాబాద్‌ జిల్లా బోధన్‌ మండలం నర్సాపూర్‌లో నిర్వహించిన ‘ప్రజల గోస.. బీజేపీ భరోసా’ కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. 
 
రాష్ట్రంలోని మంత్రులు, ఎమ్మెల్యేలకు వారి వారి పదవులపై నమ్మకం లేదని తెలిపారు. వారికి పదవులు ఎప్పుడు ఊడుతాయో తెలియని భయంతో ఉన్నారని ఎద్దేవా చేశారు. గత రెండేళ్లుగా కేంద్ర ప్రభుత్వం వరద సహాయం కోసం ఇచ్చిన డబ్బులను రాష్ట్ర ప్రభుత్వం ఎక్కడ ఖర్చు చేసిందో చెప్పాలని రాజాసింగ్‌ డిమాండ్‌ చేశారు. 
 
టీఆర్‌ఎస్‌  కార్యకర్తల కోసమే రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వాన్ని వరద సహాయం అడుగుతోందని  రాజాసింగ్ విమర్శించారు. గతంలో జీహెచ్‌ఎంసీ  పరిధిలో వరద బాధితులకు రూ. 10 వేలు ఇస్తామని చెప్పి చివరకు టీఆర్‌ఎస్‌ వాళ్లే పంచుకున్నారని మండిపడ్డారు. సీఎం కేసీఆర్‌కు ప్రధాని మోదీ భయం పట్టుకుందని పేర్కొన్నారు. 
ఇచ్చిన హామీల అమలు ఏమైందని టీఆర్​ఎస్​ ఎమ్మెల్యేలను, లీడర్లను ఓట్ల కోసం వచ్చినప్పుడు నిలదీయాలని ప్రజలకు  రాజాసింగ్ పిలుపునిచ్చారు. ‘‘తెలంగాణలో గల్లీగల్లీకి.. వద్దు కేసీఆర్​, సాలు కేసీఆర్​,  ఇంటికి పో కేసీఆర్..​ అనే నినాదాలు వినిపిస్తున్నయ్​. ఎన్నికల్లో ఇచ్చిన హామీలను కేసీఆర్​ అమలు చేయలేదు” అని మండిపడ్డారు.
 
జీఎస్టీ అంశాన్ని అనవసర రాద్ధాంతం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్రంలో ఎన్నికలు పెడితే వచ్చేది బీజేపీ  ప్రభుత్వమేనని భరోసా వ్యక్తం చేశారు. ప్రజా సమస్యలను తెలుసుకునేందుకే తాను బైక్‌ యాత్రను చేపట్టినట్లు రాజాసింగ్‌ స్పష్టం చేశారు.