తెలంగాణాలో అభివృద్ధి జరగాలంటే బిజెపి రావాల్సిందే

అప్పులపాలైన తెలంగాణలో అభివ్రుద్ధి జరగాలన్నా, సంక్షేమ పథకాలు అమలు కావాలన్నా, ఫస్ట్ తారీఖును ఠంచన్ గా ఉద్యోగులకు జీతాలు రావాలన్నా బీజేపీ అధికారంలోకి వస్తేనే సాధ్యమని బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు, ఎంపీ బండి సంజయ్ కుమార్ స్పష్టం చేశారు. టీఆర్ఎస్ పాలనలో రాష్ట్రాన్ని నిండా అప్పుల పాల్జేసి ప్రజల చేతికి చిప్ప ఇచ్చారని మండిపడ్డారు. 
 
‘జనం గోస ‌- బీజేపీ భరోసా’ యాత్రలో భాగంగా గురువారం సిద్దిపేట జిల్లా నాంచార్ పల్లిలో బైక్ ర్యాలీలని ప్రారంభిస్తూ ప్రజలు బాధలు పోవాలంటే తెలంగాణలో  నరేంద్ర మోదీ ఆధాయారంలో డబల్ ఇంజిన్ ప్రభుత్వం రావాల్సిందే అని పిలుపిచ్చారు.  నాంచార్ పల్లి వద్ద ప్రజలను ఉద్దేశించి ప్రసంగిస్తూ ‘‘జనం గోస –బీజేపీ భరోసా‘’ పేరుతో 10 రోజుల పాటు గ్రామాల్లో తిరుగుతూ ప్రజల బాధలు తెలుసుకుని వారికి భరోసా ఇవ్వాలనే ఉద్దేశంతోనే బైక్ ర్యాలీలు నిర్వహిస్తున్నామని తెలిపారు.
ఇరిగేషన్ ఇంజనీర్ అవతారమెత్తిన సీఎం కేసీఆర్  రీడిజైన్ పేరుతో రూ 30 వేల కోట్ల కాళేశ్వరం ప్రాజెక్టును రూ లక్ష కోట్లకుపైగా ఖర్చు చేసి కట్టి ఊళ్లకు ఊళ్లను ముంచేసిండని ధ్వజమెత్తారు.   సిద్దిపేట జిల్లా ప్రజలు అష్టకష్టాలు పడి కేసీఆర్ ను పెంచి పెద్ద చేస్తే ఏమిచ్చిండు.. ఒక్క ఇల్లు ఇయ్యలే.. కొత్త రేషన్ కార్డు ఇయ్యలే.. కొత్తగా పెన్షన్ ఇయ్యలే.. ఇక్కడే 8 ఏండ్ల నుండి తెలంగాణ రాష్ట్ర ప్రజల గోస పుచ్చుకుంటున్నడు. యువకులకు ఉద్యోగాలియ్యలే… ఉన్న ఉద్యోగాలు పాలిట శనిలా దాపురించిండు… అంటూ సంజయ్ దుయ్యబట్టారు.
 
రైతుల పాలిట యముడైండు. రుణమాఫీ అమలు చేయలేదు. రైతుల అకౌంట్లో ఉన్న సొమ్మును బ్యాంకుల్లో జమ చేసుకుంటున్నరు. కేసీఆర్ నిర్వాకంవల్ల లక్షల ఎకరాల పంట నష్టపోయిండ్రు అంటూ ఆందోళన వ్యక్తం చేశారు.   బీజేపీ ఊర్లలో తిరుగుతుంటే, బీజేపీ జెండాలను చూస్తే టీఆర్ఎస్ నేతలు గజగజ వణికిపోతున్నరని ఎద్దేవా చేశారు. దాడులు చేసి భయపెట్టాలనుకుంటున్నరని, జెండా గద్దెలు కూడా కట్టనీయకుండా పోలీసులతో బెదిరిస్తున్నరని ఆగ్రహం వ్యక్తం చేశారు.
 
టీఆర్ఎస్ బెదిరింపులకు, పోలీసు కేసులకు భయపడే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు.  ఐఎస్ఐ, నక్సలైట్లకు వ్యతిరేకంగా కొట్లాడినోళ్లం. మీ లాఠీలకు, బుల్లెట్లకు భయపడతమా? అని ప్రశ్నించారు. టీఆర్ఎస్ ప్రభుత్వం శాశ్వతం కాదు… రాబోయేది బీజేపీ ప్రభుత్వమే అంటూ పోలీస్ అధికారులను హెచ్చరించారు. 
 
  బీజేపీని ఎదుర్కొనేందుకు కాంగ్రెస్ తో కలిసి కేసీఆర్ కుట్రలు చేస్తున్నరని ఆరోపించారు.  బీజేపీ రాష్ట్ర ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలపై కొట్లాడుతుంటే, కాంగ్రెస్ మాత్రం బీజేపీకి పోటీగా కార్యక్రమాలు చేస్తుండటం సిగ్గు చేటని మండిపడ్డారు.