వరద బాధితుల సేవలో 300 మంది సేవాభారతి కార్యకర్తలు

గత పక్షం రోజులుగా తెలంగాణాలో పలు ప్రాంతాలలో భారీ వర్షాల కారణంగా అస్తవ్యస్తంగా జనజీవనం మారడంతో బాధితులకు చేయూత అందించడం కోసం సేవ భారతి కార్యకర్తలు పెద్ద ఎత్తున కృషి చేస్తున్నారు. ముఖ్యంగా జిల్లాల్లోని గ్రామీణ ప్రాంత ప్రజలు తీవ్రమైన ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఆహరం, మంచి నీరు, మందులు ఇతర నిత్యావసరాల కోసం ప్రజలు నానా కష్ఠాలు పడుతున్నారు.
 
తెలంగాణాలో దీర్ఘకాలంగా పలు సమయాజిత కార్యక్రమాలు చేబడుతున్న స్వచ్ఛంద సంస్థ సేవాభారతి ఈ నెలలో వచ్చిన వరదల వలన దెబ్బతిన్న ప్రాంతాల్లోని ప్రజలను ఆడుకావడానికి కార్యక్షేత్రంలో క్రియాశీలకంగా పనిచేస్తున్నది.  సుమారు ౩౦౦ మంది కార్యకర్తలు క్షేత్ర స్థాయిలో పని చేస్తున్నారు. 
 
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చర్ల, భద్రాచలం, బూర్గంపాడు, మణుగూరు మండలాలు, ములుగు జిల్లా తాడ్వాయి, ఏటూరునాగారం, వెంకటాపురం, వాజేడు మండలాలు, పెద్దపల్లి జిల్లా మంధని, గోదావరిఖని మండలాలు, మంచిర్యాల జిల్లా చెన్నూరు, కోటపల్లి, మంచిర్యాల మండలాలు, భూపాల్ జిల్లా మహాదేవపూర్ మండలాల పరిధిలోని గ్రామాలు వరదల వలన కోలుకోలేని విధంగా దెబ్బ తిన్నాయి. 
 
సేవాభారతి యుద్ధ ప్రాతిపదికన ఈ గ్రామాలలోని ప్రజలను ఆదుకోవడానికి ముందుకు వచ్చింది. హైదరాబాద్ కేంద్రంగా ఈ గ్రామాలకు నిత్యావసర సరకులు, మందులు, బట్టలు, వంటపాత్రలు పిల్లలకు పాల పొడి మొదలగు కిట్స్ గత వారం రోజులుగా సరఫరా చేయబడుతున్నాయి. 
 
ఒక కుటుంబానికి సుమారుగా 15 రోజులు సరిపడా బియ్యం చింతపండు, పప్పులు, నూనె, సబ్బులు, కారం పొడి, పసుపు పాడి, కొవ్వొత్తులు, అగ్గిపెట్టెలు తదితర 16 రకాల నిత్యావసర వస్తువుల కిట్లను దశల వారీగా పంపిణి చేస్తున్నారు.  ఇప్పటి వరకు దాతల సహాయంతో 3000 పైగా కిట్ల సరఫరా చేశారు. మొత్తంగా 15,000 కిట్ల సరఫరా లక్ష్యంగా సేవాభారతి పెట్టుకుంది. క్షేత్ర స్థాయిలో అవసరమైన చోట ఆహరం, మందులను కూడా అందజేస్తున్నారు.  
 
ఈ నిత్యావసర కిట్లను సమకూర్చడం కోసం 60 మంది కార్యకర్తలు 24 గంటలు పనిచేస్తూ దశల వారీగా ఆయా గ్రామాలకు పంపిస్తున్నారు  గ్రామాల్లో సేవాభారతి కార్యకర్తలు ఇంటింటికి తిరుగుతూ ఆయా కుటుంబాలకు కావలసిన నిత్యావసరాలు, ఇతర ఇబ్బందులను తెలుసుకుంటున్నారు. 
 
 ఉధృతమైన వరదల వలన జరిగిన ఈ అపార నష్టం ప్రభావం ఇంకా 6 నెలలు కొనసాగుతుందని ఒక అంచనా. వ్యవసాయం, పశుసంపద, ప్రాణ నష్టం, ఆస్తి నష్టం జరిగి ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.  సేవాభారతి తాత్కాలికమైన ఉపశమనమే కాకుండా, వివిధ రకాలుగా నష్టపోయిన ప్రజలకు పురావాస వసతుల గురించి కూడా ప్రణాళిక సిద్ధం చేస్తుంది.
 “ఫ్రీడమ్ ఆయిల్” వారు రూ 10 లక్షల విలువైన నూనె పాకెట్స్ ఉచితంగా పంపిణీ చేశారు. అవసరాన్ని బట్టి ఇంకా ఎక్కువ నూనె పాకెట్స్ సరఫరా చేయడానికి ఫ్రీడమ్ ఆయిల్ వారు సంసిద్ధత వ్యక్తం చేశారు. ఇట్టి ఆపద సమయంలో కార్పొరేట్ కంపెనీలు, దాతలు ముందుకు వచ్చి ఇతోధికంగా సహాయం చేయవలసిందిగా సేవాభారతి నిర్వాహకులు కోరుకొంటున్నారు.  మరిన్ని వివరాల కోసం 85005 850056 నుంబర్ గాని 96180 36965 గాని సంప్రదించగలరు.