12 దేశాలలో శ్రీ లంక తరహా పరిణామాలు.. ఐఎంఎఫ్‌

 ”పటిష్ట ప్రణాళికలు లేకుండా రుణ భారాలను పెంచుకుంటున్న విధానాలను అవలంభిస్తున్న దేశాలకు శ్రీలంక ఓ పెద్ద గుణపాఠం. ఇటీవల శ్రీలంక, లెబనాన్‌, రష్యా, సురినామె, జాంబియా దేశాలు రుణాల చెల్లింపుల్లో విఫలమయ్యాయి. బెలారస్‌ సహా డజన్‌ దేశాలు డిఫాల్ట్‌ అయ్యే ప్రమాదంలో ఉన్నాయి” అంటూ  అంతర్జాతీయ ద్రవ్య నిధి సంస్థ (ఐఎంఎఫ్‌) చీఫ్‌ క్రిస్టలినా జార్జియేవా హెచ్చరించారు. 
దాదాపు మూడో వంతు దేశాల్లో ప్రభుత్వ బాండ్ల రాబడులు 10 శాతానికి పైగా చేరడం ప్రపంచ ఆర్థిక వ్యవస్థకు ఉన్న ప్రమాదాన్ని సూచిస్తుందని ఆమె ఓ వ్యాసంలో స్పష్టం చేశారు. ఆర్థిక సంక్షోభాన్ని నివారించుకోవడానికి ప్రపంచ దేశాలు పరస్పరం సహకరించుకోవాలని క్రిస్టలినా సూచించారు. 
 
 రానున్న రోజుల్లో ప్రపంచ దేశాలు దారుణ పరిస్థితులను ఎదుర్కోనున్నాయని ఆమె ఆందోళన వ్యక్తం చేసింది. ప్రస్తుత ఏడాదితో పోల్చితే 2023లో పరిస్థితి మరింత తీవ్రంగా మారనుందని ఆమె స్పష్టం చేశారు. 
 
కరోనా సంక్షోభానికి తోడు రష్యా – ఉక్రెయిన్‌ పరిణామాలు ప్రపంచ ఆర్థిక పరిస్థితులను దిగజార్చుతున్నాయని ఐఎంఎఫ్‌ చీఫ్‌ క్రిస్టలినా జార్జియేవా ఓ వ్యాసంలో ఆందోళన వ్యక్తం చేశారు. రాను రాను ఆర్థిక వ్యవస్థలకు మాంద్యం ముప్పు పెరుగుతుందని విశ్లేషించారు. 2022, 2023లో ప్రపంచ ఆర్థిక వ్యవస్థ వృద్థి రేటు 3.6 శాతానికి పరిమితం కావొచ్చని ఆమె  అంచనా వేశారు. 
 
 ”ప్రపంచ దేశాల్లో నమోదవుతున్న అధిక ధరలు ఆందోళన కలిగిస్తున్నాయి. రష్యా యుద్ధం ప్రారంభించిన తర్వాత ద్రవ్యోల్బణం మరింత ఎగిసిపడుతోంది. కరోనా నుంచి ఆర్థిక వ్యవస్థ రికవరీలు అవుతోన్న కాలంలోనే ధరల పెరుగుదల వల్ల మళ్లీ వ్యవస్థలు మందగించాయి. వృద్థికి ధరలు విఘాతంలా మారాయి. కఠిన పరపతి విధానాల వల్లే ద్రవ్యోల్బణాన్ని కట్డడి చేయగలం.” అని ఆమె తెలిపారు. 
 
ప్రస్తుత భౌగోళిక పరిస్థితులు ఇలాగా కొనసాగితే భవిష్యత్తు వృద్థి ప్రశ్నర్థకంగా మారడంతో తీవ్ర ప్రమాదకర పరిస్థితులు నెలకొనొచ్చని ఆమె తెలిపారు. ఆర్థిక వ్యవస్థల్లో ఒక్కటైనా చైనా సహా జి-20 దేశాల వృద్థి రేటు మందగిస్తే అది ప్రపంచ ఆర్థిక వ్యవస్థకు పెను ముప్పుగా పరిణమించనుందని ఆమె పేర్కొన్నారు.