శ్రీలంక కొత్త అధ్యక్షుడిగా రణిల్‌ విక్రమసింఘే

శ్రీలంక నూతన అధ్యక్షుడిగా మాజీ ప్రధాన మంత్రి, ప్రస్తుత తాత్కాలిక అధ్యక్షుడు రణిల్ విక్రమసింఘే ఎన్నికయ్యారు. బుధవారం జరిగిన ఓటింగ్‌లో మొత్తం 225 సీట్లకుగానూ 223 మంది ఎంపీలు ఓటు హక్కు వినియోగించుకున్నారు. ఇద్దరు గైర్హాజరవ్వగా, 4 ఓట్లు తిరస్కరణకు గురయ్యాయి.
 
దీంతో చెల్లుబాటు అయిన 219 ఓట్లలో రణిల్ విక్రమసింఘేకి మెజారిటీ దక్కింది. ఈ ఎన్నికల్లో విక్రమ సింఘేకు మద్దతుగా 134 ఓట్లు రాగా.. అలాహా పెరుమాకు 82 ఓట్లు, అనురాకుమారకు 3 ఓట్లు పడ్డాయి. దానితో శ్రీలంక 8వ  అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించేందుకు మార్గం సుగుమమైంది.
అధ్యక్ష ఎన్నికల్లో గెలిచిన తర్వాత రణిల్ విక్రమసింఘే పార్లమెంటును ఉద్దేశించి ప్రసంగిస్తూ శ్రీలంకను కష్టాల నుంచి గట్టెక్కించటానికి అన్ని పార్టీలూ కలసికట్టుగా పనిచేయాలని కోరారు. అలాగే, గురువారం నాడు తాను స్వయంగా అన్ని పార్టీలతో సమావేశమై చర్చిస్తానని ప్రకటించారు.
 
గొటబాయ రాజపక్స ప్రాతినిధ్యం వహించే ఎస్ఎల్పీపీ పార్టీకి చెందిన ఎంపీలంతా రణిల్ కే ఓటు వేశారు. దీంతో ఈ విజయం సాధ్యమైంది. 63 ఏళ్ల బలమైన సింహళ బౌద్ధ జాతీయవాది,   ఎస్ఎల్పీపీ చీలిక వర్గం నాయకుడు దుల్లాస్ అలహప్పేరుమ\, వామపక్ష జనతా విముక్తి పెరమున (జేవీపీ) నాయకుడు అనుర కుమార దిసనాయకేలతో   తలపడ్డారు. 

శ్రీలంక పార్లమెంటు నేరుగా అధ్యక్షుడిని ఎన్నుకోవడం 44 ఏళ్లలో ఇదే తొలిసారి. 1982, 1988, 1994, 1999, 2005, 2010, 2015 మరియు 2019లో జరిగిన అధ్యక్ష ఎన్నికలలో ప్రజల ఓట్లతో వారిని ఎన్నుకున్నారు. ఇంతకుముందు 1993లో అధ్యక్షుడు రణసింగ్ ప్రేమదాస హత్యకు గురైనప్పుడు మాత్రమే అధ్యక్ష పదవి ఖాళీగా ఉంది.
 
 డిబి విజేతుంగ ప్రేమదాస్ పదవీకాలాన్ని కొనసాగించడానికి పార్లమెంటుచే విస్తృతంగా ఆమోదించబడింది. ఎన్నికల అనంతరం పార్లమెంటు మళ్లీ జూలై 27న సమావేశమవుతుంది.. ప్రజానిరసనలతో గొటబాయ రాజపక్స దేశం విడిచి వెళ్లడంతో ఖాళీ అయిన అధ్యక్ష స్థానానికి రణిల్ ఎన్నికయ్యారు. ఆయన అధ్యక్ష పదవిలో 2024 నవంబరు వరకు కొనసాగనున్నారు. 
 
రణిల్ విక్రమ సింఘే యునైటెడ్ నేషనల్ పార్టీ (యూఎన్‌పీ)  నాయకుడు. శ్రీలంకలో 2020లో జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో యూఎన్పీకి ఒక్క సీటు కూడా రాలేదు. అయితే, మొత్తం ఓట్ల ఆధారంగా ఆ పార్టీకి కేటాయించిన ఒక సీటుతో విక్రమ సింఘే పార్లమెంటుకు నామినేట్ అయ్యారు. ఇలా పార్లమెంటుకు నామినేట్ అయిన రణిల్.. దేశ అధ్యక్ష స్థానానికి ఎంపికవడం విశేషం. 
 
రణిల్ కు 6 సార్లు ప్రధానమంత్రిగా పనిచేసిన విశేష అనుభవం రణిల్ విక్రమసింఘేకి ఉంది. రాజకీయాల్లోకి రాకముందు జర్నలిస్టు, న్యాయవాదిగా పనిచేశారు. 1977లో సార్వత్రిక ఎన్నికల్లో గెలిచిన తర్వాత తొలిసారిగా రణిల్  పార్లమెంటు సభ్యుడు అయ్యారు. 1993లో తొలిసారి ప్రధాని అయ్యారు.
అయితే ఇటివల చోటుచేసుకున్న పరిణామాలతో రాజపక్సల భాగస్వామిగా ఆయనపై ముద్ర పడింది. రాజపక్స కుటుంబ పార్టీ ఎస్ఎల్‌పీపీ మద్దతిస్తుండడంతో వారి ప్రయోజనాలను విక్రమసింఘే కాపాడుతున్నారని ఆందోళనకారులు విశ్వసిస్తున్నారు. ప్రధాని పదవికి ఆయన కూడా రాజీనామా చేయాలని నిరసనకారులు డిమాండ్ చేశారు. ఆయన సొంత ఇంటిని కూడా ధ్వంసం చేశారు.