
ఆంధ్రప్రదేశ్, తెలంగాణతోపాటు కేరళ, పంజాబ్, పశ్చిమ బెంగాల్, ఢిల్లీ, రాజస్థాన్ తదితర రాష్ట్రాలు తీవ్ర అప్పుల్లో చిక్కుకుపోయాయని.. పరిస్థితి ఇలాగే కొనసాగితే ఆయా రాష్ట్రాల్లో శ్రీలంక తరహా పరిస్థితులు ఏర్పడతాయని కేంద్ర ప్రభుత్వం ఆయా రాష్ట్రాలను హెచ్చరించింది. శ్రీలంక సంక్షోభంపై మంగళవారం ఢిల్లీలో కేంద్రం ఏర్పాటు చేసిన అఖిలపక్ష సమావేశంలో కేంద్ర ఆర్థిక వ్యవహారాల కార్యదర్శి అజయ్ సేథ్ ప్రత్యేక ప్రజెంటేషన్ ఇచ్చారు.
ఈ సమావేశంలో తెలంగాణ దాదాపు రూ.4.5 లక్షల కోట్లు, ఆంధ్రప్రదేశ్ 4 లక్షల కోట్ల మేర అప్పులు చేశాయని ఆయన పేర్కొన్నట్లు తెలుస్తున్నది. ఈ సందర్భంగా ఆయా రాష్ట్రాల ఆర్థిక పరిస్థితిపై ఆందోళన వ్యక్తం చేశారు. దీంతో ఆయా రాష్ట్రాలకు చెందిన ప్రాంతీయ పార్టీల ప్రతినిధులు శ్రీలంకపై సమావేశంలో ఈ ప్రస్తావన దేనికని వారు ప్రశ్నించారు. కె.కేశవరావు, నామా నాగేశ్వరరావు (టీఆర్‌ఎస్).. విజయసాయిరెడ్డి, మిథున్‌రెడ్డి (వైసీపీ), టీఆర్ బాలు (డీఎంకే), సౌగతా రాయ్ (టీఎంసీ) తదితరులు ఆయనకు అడ్డుపడే ప్రయత్నం చేశారు.
విదేశాంగ మంత్రి జైశంకర్ సమావేశంకు అధ్యక్షత వహిస్తూ తమ వైఖరిని తేటతెల్లం చేశారు. ‘‘ఈ ప్రజెంటేషన్‌లో ఎలాంటి రాజకీయ ఉద్దేశం లేదు. ఆర్థిక క్రమశిక్షణతో మెలగడం, ఉచిత పథకాలు మానుకోవడం వంటి గట్టి పాఠాలను శ్రీలంక ఆర్థిక సంక్షోభం నుంచి మనం నేర్చుకోవాలి’’ అని స్పష్టం చేశారు. శ్రీలంకలో తీవ్ర సంక్షోభ పరిస్థితులు నెలకొన్నాయని, పొరుగు దేశంగా భారత్‌కూ ఇది ఆందోళనకారకమేనని తెలిపారు.
అలాంటి సంక్షోభం భారత్‌కు ఎదురవుతుందన్న ఆందోళనను తోసిపుచ్చారు. అయితే ఈ సంక్షోభం నుంచి ఆర్థిక వివేచనపై గట్టి పాఠాలు నేర్చుకోవాలని, ఉచితాల సంస్కృతిని వదులుకోవాలని ఆయన హితవు చెప్పారు. తప్పుడు సమాచారంతో శ్రీలంక, భారత దేశం మధ్య పోలికలు తేవడాన్ని మనం ఈ మధ్య గమనిస్తున్నామని చెబుతూ శ్రీలంక పరిస్థితులు మన దేశంలో కూడా వస్తాయని ప్రచారం చేస్తున్నారని తెలిపారు.
శ్రీలంక సంక్షోభం వల్ల ఎదురయ్యే పర్యవసానాల గురించి ఆందోళన వ్యక్తమవడం సహజమేనని, శ్రీలంక మనకు అత్యంత సమీపంలోని పొరుగు దేశమని, అందువల్ల అక్కడి సంక్షోభం ప్రభావం మనపై ఏ విధంగా ఉంటుందోననే ఆందోళన వ్యక్తమవడం సహజమేనని జైశంకర్ చెప్పారు. ఆ దేశంలో ప్రస్తుత పరిస్థితులు మునుపెన్నడూ లేవని పేర్కొంటూ ఇది అత్యంత తీవ్రమైన సంక్షోభమని తెలిపారు.
మత్స్యకారులకు సంబంధించిన సమస్య ఎదురవుతూ ఉంటుంది కాబట్టి ఈ సమావేశంలో మత్స్య శాఖ మంత్రి కూడా పాల్గొన్నారని తెలిపారు. ఈ సమావేశానికి కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మల సీతారామన్ అధ్యక్షత వహిస్తారని మొదట్లో ప్రకటించినప్పటికీ, ఆమె రాలేక పోయారు.
కాగా, రాష్ట్రాల అప్పులపై చర్చ గురించి విలేకరులు ప్రశ్నించగా.. ‘లంక పరిస్థితి, రాజకీయ పర్యవసానాలపై విదేశీ వ్యవహారాల కార్యదర్శి వినయమోహన్ క్వాత్రా ప్రజంటేషన్ ఇవ్వగా.. సేథ్ మన రాష్ట్రాల ఆర్థిక స్థితిని వివరించారు. మన దేశంలో శ్రీలంకలాంటి పరిస్థితి వస్తుందని అనుకోవడం లేదు. అయితే ఆర్థిక క్రమశిక్షణ ప్రాధాన్యం చెప్పడానికి మేం ప్రయత్నిస్తున్నాం’ అని జైశంకర్ స్పష్టం చేసారు. \
ఒకటి, రెండు రాష్ట్రాల అప్పులను మాత్రమే హైలైట్ చేయలేదని, ప్రతి రాష్ట్రం వివరాలూ తమ వద్ద ఉన్నాయని తెలిపారు. అది భారత్‌లో పరిస్థితిని పోల్చిచెప్పే డేటా ఆధారిత ప్రజెంటేషన్ మాత్రమేనని పేర్కొన్నారు. తద్వారా ప్రతి రాజకీయ పార్టీ, నేతలు మంచి, స్పష్టమైన సందేశంతో సమావేశం నుంచి బయటకు వెళ్తారనే ఉద్దేశంతోనే ఈ వివరాలు తెలియజేశామని తెలిపారు.
శ్రీలంక సంక్షోభం నుంచి ఆర్థిక క్రమశిక్షణ, సత్పరిపాలన అనే పెద్ద పాఠాలను నేర్వాల్సిన అవసరం ఉందని.. అదృష్టవశాత్తూ ప్రధాని మోదీ సారథ్యంలో మనకు ఈ రెండూ ఉన్నాయని వ్యాఖ్యానించారు. ‘ఇప్పుడు బంతి శ్రీలంక కోర్టులో ఉంది. వారికి, ఐఎంఎ్‌ఫకు మధ్య చర్చలు జరుగుతున్నాయి. ఒక ఒప్పందం కుదరాలి. అప్పుడు భారత్ ఏ విధంగా సహకరించగలమో ఆలోచిద్దాం’ అని తెలిపారు.
భారత్ సాయం
కాగా, కష్టాల్లో ఉన్న శ్రీలంకకు భారత దేశం పెద్ద ఎత్తున సాయపడుతోంది. 44,000 మెట్రిక్ టన్నుల యూరియాను రుణ ఒప్పందంలో భాగంగా ఇచ్చింది. 3.8 బిలియన్ డాలర్లను శ్రీలంకకు ఇచ్చినట్లు జైశంకర్ గత వారం చెప్పారు.
More Stories
రైళ్ల పేర్లలో గందరగోళంతో ఢిల్లీలో తొక్కిసలాట!
అక్రమ వలసదారులతో అమృత్సర్ కు మరో రెండు విమానాలు
భారతదేశ వారసులు హిందువులే