కనీస మద్దతు ధరపై కేంద్రం కమిటీ ఏర్పాటు

కనీస మద్దతు ధరను  సమర్ధవంతంగా అమలు పరచేందుకు సూచనలు ఇచ్చేందుకు మాజీ వ్యవసాయ కార్యదర్శి సంజయ్ అగర్వాల్ నేతృత్వంలో కేంద్రం 29 మంది సభ్యులతో ఓ కమిటీని ఏర్పాటు చేసింది. కొత్త వ్యవసాయ చట్టాలకు నిరసనగా ఢిల్లీ పరిసరాలలో రైతులు సంవత్సరకాలం పాటు నిరసనలు చేపట్టడంతో, ఆ చట్టాలను రద్దు చేస్తున్నట్లు ప్రకటిస్తూ, గత ఏడాది ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ చేసిన ప్రకటన మేరకు ఈ కమిటీని ఏర్పాటు చేశారు. 
 
“జీరో బడ్జెట్ ఆధారిత వ్యవసాయాన్ని ప్రోత్సహించడానికి”, కనీస మద్దతు ధర మరింత “సమర్థవంతంగా, పారదర్శకంగా చేయడానికి” ఈ కమిటీని ఏర్పాటు చేస్తున్నట్లు కేంద్రం ప్రకటించింది. వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా నిరసనలకు నాయకత్వం వహించిన సంయుక్త కిసాన్ మోర్చా సూచించిన ముగ్గురు ప్రతినిధులు కూడా ఈ కమిటీలో ఉంటారని తెలిపింది. వారింకా తమ ప్రతినిధులను సూచించక పోవడంతో వారి పేర్లను చేర్చలేదు. 
 
ప్రభుత్వం ప్రకటించిన కమిటీ సభ్యులలో జాతీయ అవార్డు గెలుచుకున్న రైతు భరత్ భూషణ్ త్యాగితో పాటు గున్వంత్ పాటిల్, కృష్ణ వీర్ చౌదరి, ప్రమోద్ కుమార్ చౌదరి, గుని ప్రకాష్, సయ్యద్ పాషా పటేల్ వంటి ఇతర రైతు సంస్థల నుండి ఐదుగురు సభ్యులు ఉన్నారు. 

కమిటీలోని ఇతర సభ్యులు: రమేష్ చంద్, సభ్యుడు (వ్యవసాయం-నీతి ఆయోగ్) వ్యవసాయ ఆర్థికవేత్తలు డాక్టర్ సి ఎస్ సి శేఖర్ (ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఎకనామిక్ డెవలప్‌మెంట్), డాక్టర్ సుఖ్‌పాల్ సింగ్ (ఐఐఎం, అహ్మదాబాద్); రైతుల సహకార/సమూహం ప్రతినిధి దిలీప్ సంఘాని, ఇఫ్కో ఛైర్మన్,  బినోద్ ఆనంద్, ప్రధాన కార్యదర్శి, సి ఎన్ ఆర్; నవీన్ పి. సింగ్, సీనియర్ సభ్యుడు, వ్యవసాయ ఖర్చులు, ధరల కమిషన్.

వ్యవసాయ విశ్వవిద్యాలయాలు/సంస్థల సీనియర్ సభ్యులు: డాక్టర్ పి చంద్రశేఖర్, డైరెక్టర్ జనరల్, నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ అగ్రికల్చరల్ ఎక్స్‌టెన్షన్ (మేనేజ్); డా. జె పి శర్మ, వైస్ ఛాన్సలర్, షేర్-ఇ-కశ్మీర్ యూనివర్శిటీ ఆఫ్ అగ్రికల్చరల్ సైన్సెస్ అండ్ టెక్నాలజీ, జమ్మూ; డాక్టర్ ప్రదీప్ కుమార్ బిసెన్, వైస్ ఛాన్సలర్, జవహర్‌లాల్ నెహ్రూ అగ్రికల్చరల్ యూనివర్సిటీ, జబల్‌పూర్.

వ్యవసాయం, రైతుల సంక్షేమ శాఖ, వ్యవసాయ పరిశోధన, విద్య శాఖ,  డైరెక్టర్ జనరల్ (ఐసిఎఆర్), ఆహార, ప్రజా పంపిణీ శాఖ, సహకార మంత్రిత్వ శాఖ, జౌళి మంత్రిత్వ శాఖతో సహా 5 ప్రభుత్వ శాఖలు/మంత్రిత్వ శాఖల కార్యదర్శులు. కర్ణాటక, ఆంధ్రప్రదేశ్, సిక్కిం, ఒడిశా అనే నాలుగు రాష్ట్రాల అదనపు ప్రధాన కార్యదర్శులు లేదా ప్రధాన కార్యదర్శులు (వ్యవసాయం). వ్యవసాయ మంత్రిత్వ శాఖలోని జాయింట్ సెక్రటరీ (పంటలు) కమిటీకి మెంబర్-సెక్రటరీగా నియమించారు.
కాగా, మద్దతు ధరకే పరిమితం కావాల్సిన కమిటీ పరిధిని సహజ సాగుకు ప్రోత్సాహం, పంట వైవిధ్యం వంటి పలు అంశాలకు విస్తరించడం పట్ల అభ్యంతరం వ్యక్తం చేస్తూ ఈ కమిటీని నిర్ద్వంద్వంగా తిరస్కరిస్తున్నట్టు రైతు సంఘాల కూటములైన భారతీయ కిసాయన్‌ యూనియన్‌ (బీకేయూ), సంయుక్త కిసాన్‌ మోర్చా (ఎస్‌కేఎం) ప్రకటించాయి. అయితే,  రైతులు, నేతల అభ్యంతరాలన్నింటినీ కమిటీలో చర్చిస్తామని కమిటీ సభ్యుడైన హరియాణాకు చెందిన రైతు నేత గునీ ప్రకాశ్‌ చెప్పారు.
మరోవైపు, చట్టపరమైన హామీ కల్పించేందుకు కమిటీ వేస్తామని సంయుక్త కిసాన్‌ మోర్చాకు ప్రభుత్వం హామీ ఇవ్వలేదని కేంద్ర వ్యవసాయ మంత్రి నరేంద్రసింగ్‌ తోమర్‌ స్పష్టం చేశారు. మంగళవారం లోక్‌సభకు ఆయన ఈ మేరకు లిఖితపూర్వకంగా బదులిచ్చారు.
 ఎంఎస్‌పీని మరింత పారదర్శకంగా ప్రభావశీలంగా మార్చడం, సహజ సాగును ప్రోత్సహించడం తదితరాల కోసం కమిటీ వేస్తామని మాత్రమే కేంద్రం హామీ ఇచ్చిందని పేర్కొన్నారు. ఆ మేరకే రైతు ప్రతినిధులు, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వోద్యోగులు, వ్యవసాయ ఆర్థికవేత్తలు, శాస్త్రవేత్తలతో కమిటీ వేశామని తెలిపారు.