కాళేశ్వరం తెలంగాణ ప్రజల పాటి వరప్రసాదామా? శనీశ్వరమా?

ప్రపంచంలోనే గొప్ప ప్రాజెక్టుగా రాష్ట్ర ప్రభుత్వం ప్రచారం చేసుకున్న కాళేశ్వరం పంప్‌హౌస్‌లు గోదావరి వరదలకు మునిగిపోవడానికి కారణాలేంటి? నాణ్యతా లోపమా? ఇంజనీరింగ్‌ డిజైన్‌ వైఫల్యమా? వరద తాకిడి ఉన్న విషయాన్ని అధికారులు ముందుగా ఎందుకు గుర్తించలేకపోయారు? ఇప్పుడు అందరి నోటా వ్యక్తమవుతున్న ప్రశ్నలివి.
 
కేసీఆర్ ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాకరంగా, లక్ష కోట్ల రూపాయలమేరకు వ్యయంతో నిర్మించిన కాళేశ్వరం ప్రాజెక్ట్ గురించి ఇప్పటివరకు అదనంగా సాగునీరు అందించక పోయినా, కేవలం అవినీతి కోసమే నిర్మించారని, కేసీఆర్ కుంటుంబ పాలిట ఏటిఎంగా మారిందనే విమర్శలు వస్తూ వచ్చాయి. 
 
అయితే ఇటీవల వచ్చిన వర్షాలకు పంప్ హౌస్ లు మునిగిపోవడం చూసి ప్రజానీకం గగుర్పాటు చెందింది. అవినీతి సంగతి ఎట్లాగూ ఉంచితే,  పూర్తి నాణ్యతాలోపంగా ఉండడమే గాకుండా,  ఇంజనీరింగ్ పరంగా కూడా అస్తవ్యస్తంగా ఉన్నట్లు ఆందోళనలు వ్యక్తం అవుతున్నాయి.  కనీస ఇంజనీరింగ్ పరిజ్ఞానం, నాణ్యత లేకుండా కట్టిన “కాళేశ్వరం” ప్రాజెక్టు డొల్లతనం ఒక్కవరదతో బయటపడింది.

 
ఇరిగేషన్ ప్రాజెక్టుల డిజైన్ కు సెంట్రల్ వాటర్ కమిషన్ (సిడబ్ల్యుసి) నిర్దేశించిన స్థాయి వరద రాకుండానే రెండు పంపు హౌసులు (అన్నారం, మెడిగడ్డ) పూర్తిగా మునిగిపోయాయి. వందల కోట్ల రూపాయల ప్రజాధనం బూడిదలో పోసిన పన్నీరైంది. సెంట్రల్ వాటర్ కమిషన్ గోదావరిపై నిర్మాణాలకు నిర్దేశించిన డిజైన్ ప్రవాహ అంచనాలతో, నాణ్యతా ప్రమాణాలతో నిర్మాణం జరిగితే ఈ పరిస్థితి వచ్చేది కాదని నిపుణులు స్పష్టం చేస్తున్నారు.  
 
టీజేఏసీ విడుదల చేసిన ప్రకటన ప్రకారం కాళేశ్వరం ఎత్తిపోతల పధకం భారీ ఇంజనీరింగ్ తప్పిదం.  బ్యారేజీల నిర్మాణ ప్రభావం కారణంగా నదీ ప్రవాహ మార్గం కుచించుకు పోతుంది. నదీ ప్రవాహ మార్గం తగ్గి పోవడంతో బ్యారేజీల ఎగువన ప్రవాహం ఎత్తు పెరుగుతుంది.దీన్ని బ్యాక్ వాటర్ ఎఫెక్ట్  అంటారు.
గతంలో వచ్చిన వరద కన్నా తక్కువ స్థాయి వరద వచ్చినా, నది ప్రవహించే ఎత్తు పెరగడానికి ఈ బ్యాక్ వాటర్ ఎఫెక్ట్ కారణం పంప్ హౌజుల నిర్మాణానికి ఈ బ్యాక్ వాటర్ ఎఫెక్ట్ ను పరిగణలోనికి తీసుకోవాలి. ప్రస్తుతం కాళేశ్వరం పంప్ హౌజులు మునిగిపోవడానికి, ఈ బ్యాక్ వాటర్ ఎఫెక్ట్ పరిగణలోనికి తీసుకోకపోవడం, నాణ్యతాలోపాలే ప్రధాన కారణం అని చెబుతున్నారు.
 
రెండవది, గతంలో కన్నా ఎక్కువ వరద వచ్చిందని కొంతమంది చేస్తున్న వాదన శుద్ద అబద్దం అని ఈ సందర్భంగా పేర్కొంటున్నారు. “గతంలో ఇన్ని లక్షల క్యూసెక్ ల ప్రవాహం వచ్చింది. ఇప్పుడు దాన్ని మించి ఇన్ని లక్షల క్యూసేక్ ల నీళ్ళు ప్రవహించాయి. అందుకే పంప్ హౌజులు మునిగిపోయాయి” అనే మాట ప్రజలను పక్క దోవ పట్టించడమే అని స్పష్టం చేస్తున్నారు. 
 
ఎందుకంటే వరద ప్రవాహం తక్కువగానే ఉన్నా పైన ఉన్న బ్యారేజీలలోని నీరు ఒకేసారి విడుదల చేయడంతో వచ్చే సమస్య ఇది. ఉదాహరణకు నదిలో ఒక క్యూసెక్ నీటి ప్రవాహం ఉంది అనుకుంటే, సెకనుకు ఒక ఘనపుటడుగు (క్యూసెక్) నీరు నదిలో ప్రవహిస్తున్నట్టు. ఈ నీటిని మనం ఒక రిజర్వాయర్ లో రోజంతా నింపితే, ఆ రిజర్వాయర్ లో నీటి నిల్వ 86,400 (1x60x60x 24) ఘనపుటడుగులు ఉంటుంది. 
 
ఒక వేళ ఈ రిజర్వాయర్ లో నిల్వ ఉన్న నీటిని, అంటే, మొత్తం 86,400 ఘనపుటడుగులను ఒకే గంటలో విడుదల చేస్తే, నదిలో ప్రవాహం 24 క్యూసెక్ లు గా ఉంటుంది. అంటే సెకనుకు 24 ఘనపుటడుగుల చొప్పున గంటలో మొత్తం రిజర్వాయర్ లోని 86,400 (24x60x60) ఘనపుటడుగుల నీరు నదిలో ప్రవహిస్తుంది. 
 
అంటే సాధారణ ప్రవాహం 1 క్యూసెక్ కాగా, మనం నిలువ చేసి, ఒకేసారి నీటిని విడుదల చేయడంతో ఈ ప్రవాహం 24 క్యూసెక్ లుగా మారింది….ఇప్పుడు వస్తున్న వరదనీటి పరిమాణం గతం కన్నా తక్కువగా ఉన్నా, మనం రిజర్వాయర్లలో నిలువ ఉంచి ఒకేసారి వదులుతున్న నీటి పరిమాణం ఎక్కువ ఉండడంతో, గతం కన్నా వరద ఎక్కువ ఉన్నట్టు కనబడుతున్నది..
 
ఇది రిజర్వాయర్ల, వరద ప్రవాహ నిర్వహణకు సంబంధించిన అంశం. పై ప్రాంతాల నుండి ఎంత ప్రవాహం వస్తున్నది అనే అంచనాలను బట్టి, మన రిజర్వాయర్లలో ఎంత నీరు నిల్వ ఉంచుకోవాలి, ముందే ఎంత నీటిని వదలాలి…అని ప్రణాళికలు ముందే సిద్దం చేసుకోవాలి. క్యూసెక్ లకు, ఘనపుటడుగులకు మధ్య ప్రజలను గందరగోళం చేసే ప్రయత్నం కనబడుతుంది.
మరో వైపు పంప్ హౌజ్ గేట్లు విరిగి పోయి మేడిగడ్డ పంప్ హౌస్ మునిగితే, దానిని వరద ప్రవాహానికి ముడి పెడుతున్నారు. ఇది నాణ్యతకు సంబంధించిన అంశం. నాణ్యతా లోపాలను ప్రకృతికి ముడిపెట్టడం హాస్యాస్పదం. కేవలం పంప్ హౌసులు మునిగి పోవడమే కాదు, మునిగిన పంటపొలాలు, మునిగిన ఇళ్ళు, కకా వికలమైన ప్రజల జీవితాలు, వీటి వల్ల ప్రజలకు, రాష్ట్రానికి వాటిల్లిన నష్టం ఎంత…?
 
కేవలం భారీ కట్టడాలను చూపించి “ఇంజనీరింగ్” అద్భుతంగా అమాయక ప్రజలను మభ్యపెట్టారు. ఈ ప్రాజెక్టు ఇంజనీరింగ్ అద్భుతం కాదు…భారీ ఇంజనీరింగ్ తప్పిదంగా ఇప్పటికే (2016,2018) టీజేఏసీ శాస్త్రీయంగా వివరిస్తూ పుస్తకాలు అచ్చువేసింది. ఇంకా పొంచివున్న ముప్పులుకూడా వివరించింది.
 
ఈ ప్రాజెక్టులో నాణ్యతాలోపాలు, డిజైన్ లోపాలు కోకొల్లలు అని పేర్కొన్నది. వీటిని నిర్లక్ష్యం చేస్తే పర్యవసానాలు ఇంతకన్నా తీవ్రంగా ఉంటాయని హెచ్చరించింది. ఇలాంటి ప్రమాదాలు మల్లన్నసాగర్ వంటి భారీ ప్రాజెక్టువద్ద జరిగితే జరిగే ప్రాణ, ఆస్తినష్టాలు అంచనాకందవని ఆందోళన వ్యక్తం చేసింది. 
 
ఇప్పటికైనా మొత్తం కాళేశ్వరం ప్రాజెక్టు నాణ్యతను, డిజైన్ లోపాలను సమీక్షించి, భవిష్యత్తులో ఇలాంటి ప్రమాదాలు జరగకుండా ఇంజనీరింగ్ నిపుణులతో తక్షణం ఒక కమిటీని వేసి దిద్దుబాటు చర్యలు తీసుకోవాలి. లేకుంటే పాలకుల తప్పులకు తెలంగాణ ప్రజలు మరింత భారీ మూల్యం చెల్లించుకోవాల్సి ఉంటుంది.