నుపూర్ శర్మకు అరెస్ట్ నుండి `సుప్రీం’ రక్షణ!

మహ్మద్ ప్రవక్తపై చేసిన వ్యాఖ్యలకు సంబంధించి ఎఫ్‌ఐఆర్‌లలో అరెస్ట్ కాకుండా బిజెపి నుండి సస్పెండ్ అయిన మాజీ అధికార ప్రతినిధి  నుపుర్ శర్మకు సుప్రీంకోర్టు మంగళవారం రక్షణ కల్పించింది. ఆమెపై దాఖలైన తొమ్మిది ఎఫ్‌ఐఆర్‌లలో  అరెస్టు చేయకుండా, కలపకుండా రక్షణ కోరుతూ శర్మ వేసిన పిటిషన్‌పై గతంలో ఇచ్చిన తీర్పును కొంతమేరకు సవరించింది. 
 
న్యాయమూర్తులు సూర్యకాంత్ మరియు జెబి పార్దివాలాతో కూడిన ధర్మాసనం, “మేము ఇదివరకు ఇచ్చిన ఉత్తర్వులను కొంత మేరకు సరిచేస్తాము. మీరు ప్రతి కోర్టుకు వెడుతూ ఉండాలని మేము ఎప్పుడూ కోరుకోలేదు” అని స్పష్టం చేసింది. దేశవ్యాప్తంగా తనపై నమోదైన కేసులను ఓకే కేసుగా మార్చాలని కోర్టును కోరారు. ఈ ఫిటిషన్ పై విచారణ చేపట్టిన సర్వోన్నత న్యాయస్థానం నుపుర్ శర్మకు అనుకూలంగా తీర్పు ఇచ్చింది.

ఎఫ్‌ఐఆర్‌లను కలపాలన్న ఆమె పిటిషన్‌పై కోర్టు ఈ మేరకు చర్యలు తీసుకోవాల్సిందిగా కేసులు నమోదయిన రాష్ట్రాలు ఢిల్లీ, పశ్చిమ బెంగాల్, మహారాష్ట్ర, తెలంగాణ, కర్ణాటక, ఉత్తరప్రదేశ్, జమ్మూకాశ్మీర్, అసోంలకు సుప్రీంకోర్ట్ నోటీసులు జారీ చేసింది. ఈ కేసు తదుపరి విచారణ ఆగస్టు 10న జరగనుంది. అదే  విధంగా భవిష్యత్తులో ఆమెపై దాఖలయ్యే ఎఫ్‌ఐఆర్ లేదా ఫిర్యాదులకు కూడా ఈ ఉత్తరువులు వర్తిస్తాయని కూడా ధర్మాసనం స్పష్టం చేసింది.


జులై 1 నాటి సుప్రీంకోర్టు ఆదేశాల తర్వాత, ఆమెకు నిజమైన, తీవ్రమైన ప్రాణహానిఎదురైనదని, ఆమె జీవితానికి, స్వేచ్ఛకు బెదిరింపుల కారణంగా, ఆమె ప్రత్యామ్నాయ పరిష్కారాన్ని పొందే స్థితిలో లేదని శర్మ తరఫు న్యాయవాది సీనియర్ న్యాయవాది మణిందర్ సింగ్ న్యాయస్థానంలో పేర్కొన్నారు.  

శర్మపై ఢిల్లీలో ఒకటి, మహారాష్ట్రలో ఐదు, పశ్చిమ బెంగాల్‌లో రెండు, తెలంగాణలో ఒకటి సహా మొత్తం తొమ్మిది ఎఫ్‌ఐఆర్‌లు దాఖలైనట్లు సమాచారం. 
తనపై నమోదైన ఎఫ్‌ఐఆర్‌లను అన్నింటినీ కలిపి విచారించాలని, వేర్వేరు అరెస్టుల నుంచి రక్షణ కల్పించాలని నుపూర్‌ గతంలోనే సుప్రీం కోర్టుకు వెళ్లారు. ఆ పిటిషన్‌ను జులై 1న కోర్టు తిరస్కరిస్తూ ఆమెపై తీవ్రమైన వాఖ్యలు చేయడంతో దుమారం రేగింది.
 
తాను చేసిన వ్యాఖ్యలపై సుప్రీం కోర్టు తనను తీవ్ర పదజాలంతో మందలించిన తర్వాత తనకు ప్రాణహాని మరింత పెరిగిందని నుపూర్‌ శర్మ ఆందోళన వ్యక్తం చేశారు. రేప్‌ చేస్తామని, చంపేస్తామని అంటూ చాలా మంది తనను భయపెడుతున్నారని వాపోయారు. ఆ మేరకు ఆమె సోమవారం తిరిగి సుప్రీం కోర్టును ఆశ్రయించారు. 
 
పైగా, తనపై చేసిన ప్రతికూల వ్యాఖ్యలను ఉపసంహరించుకోవాలని కూడా ఆమె  అత్యున్నత న్యాయస్థానాన్ని కోరారు. ఇంతకు ముందు తన పిటిషన్ ను తిరస్కరిస్తూ,  తనపై ప్రతికూల వాఖ్యలు చేసిన  ధర్మాసనం ముందుకే తిరిగి ఆమె వెళ్లడం గమనార్హం. అదే ధర్మాసనం ఇప్పుడు తన ఉత్తరువును సవరించుకుంది.