షిండే వర్గంలోకి 12 మంది శివసేన ఎంపీలు

శివసేన అధినేత ఉద్ధవ్‌ థాక్రేకు మరో ఎదురుదెబ్బ తగిలింది.  ఆయన పార్లమెంటరీ పార్టీ చీలిపోయింది. మూడింట రెండు వంతల మంది ముఖ్యమంత్రి ఏక్‌నాథ్‌ షిండే నేతృత్వంలోని తిరుగుబాటు వర్గంలో చేరేందుకు సిద్ధంగా ఉన్నారు. 12 మంది ఎంపిలు కలసి  లోక్‌సభలో ప్రత్యేక గ్రూప్‌ను ఏర్పాటు చేయనున్నట్లు తెలుస్తోంది. 

మహారాష్ట్ర మంత్రివర్గ విస్తరణపై దిల్లీ పెద్దలతో ఎక్‌నాథ్‌ షిండే చర్చలు చేపట్టిన క్రమంలోనే ఈ పరిణామాలు చోటు చేసుకోవటం ప్రాధాన్యం సంతరించుకుంది. ముంబయి సౌత్‌ సెంట్రల్‌ ఎంపీ రాహుల్ షేవాలే నేతృత్వంలో ప్రత్యేక శివసేన బృందం ఏర్పాటు చేయాలంటూ సోమవారం రాత్రి లోక్‌సభ స్పీకర్‌కు పలువురు ఎంపీలు లేఖ వ్రాసారు.

ఆ బృందం చీఫ్‌ విఫ్‌ను సైతం నియమించింది. ఆ బాధ్యతలను యావత్మాల్‌ ఎంపీ భవన గావ్లీ చేపట్టే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇటీవలే ఆమెను చీఫ్‌ విప్‌ పదవి నుంచి ఉద్ధవ్‌ థాక్రే తొలగించారు. లోక్‌సభలో శివసేనకు 19 మంది ఎంపీలు ఉండగా, మహారాష్ట్రలోనే 18 మంది ఉన్నారు.

ఏక్‌నాథ్‌ షిండేతో సోమవారం వర్చువల్‌ సమావేశానికి సుమారు 12 మంది ఎంపీలు హాజరైనట్లు ఆ పార్టీ వర్గాలు తెలిపాయి. ఏక్‌నాథ్‌ షిండేకు మద్దతు తెలిపినట్లు పేర్కొన్నాయి. అదే సమయంలో 12 మంది ఎంపీలకు  హోం మంత్రిత్వ శాఖ వై కేటగిరి భద్రతను మంజూరు చేసింది.

వీరిలో శ్రీరంగ్‌ భర్నే, భావనా గావ్లీ, రాజేంద్ర గవిత్‌, హేమంత్‌ గాడ్సే, ప్రతాప్‌ జాదవ్‌, సదాశివ్‌ లోఖండే, సంజరు మాండ్లిక్‌, ధైర్యషీల్‌ మానే, హేమంత్‌ పాటిల్‌, రాహుల్‌ షెవాలే, శ్రీకాంత్‌ షిండే, కృపాల్‌ తుమానే ఉన్నారు.

తమని ప్రత్యేక బృందంగా స్పీకర్‌ గుర్తించిన తర్వాత, శివసేన గుర్తును తమకే కేటాయించాలని కోరనున్నట్లు సమాచారం. గత వారం పార్టీ ఎంపీలతో సమావేశమైన ఉద్ధవ్‌ థాక్రే  తమ భాగస్వామ్య పార్టీలతో సంబంధాలు తెంచుకుని ఎన్డీయే రాష్ట్రపతి అభ్యర్థి ద్రౌపతి ముర్మూకు మద్దతు ప్రకటించారు.

దీంతో థాక్రేపై విమర్శలు గుప్పించాయి విపక్షాలు. థాక్రే బంధీఅయ్యారని, ఆయనకు ఎంపీల డిమాండ్‌ను అంగీకరించటం తప్ప ఎలాంటి అవకాశం లేదని ఆరోపించాయి. మరోవైపు,  మహారాష్ట్రలో నెలకొన్న రాజకీయ సంక్షోభానికి సంబంధించి ఇరు వర్గాలు దాఖలు చేసిన పిటిషన్లపై బుధవారం సుప్రీంకోర్టులో విచారణ జరగనుంది.