రాష్ట్రపతి ఎన్నికల్లో 99 శాతం ఓటింగ్

రాష్ట్రపతి ఎన్నికల్లో 99 శాతం ఓటింగ్ నమోదైనట్లు కేంద్ర ఎన్నికల సంఘం ప్రకటించింది. దేశవ్యాప్తంగా రాష్ట్రపతి ఎన్నికలు ప్రశాంతంగా ముగిసాయి. రాష్ట్రాల అసెంబ్లీలలో ఎమ్మెల్యేలు ఓటు హక్కు వినియోగించుకోగా, పార్లమెంట్ ఆవరణలో ఎంపీలు ఓటు వేశారు. 4,796 మంది ఎంపీలు, ఎమ్మెల్యేల్లో 99 శాతం మంది ఓటు హక్కు వినియోగించుకున్నట్లు కేంద్ర ఎన్నికల సంఘం తెలిపింది. 
 
పార్లమెంట్‌లోని రూమ్‌ నెంబర్‌ 63లో ఏర్పాటు చేసిన పోలింగ్‌ బూత్‌లో ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ, మాజీ ప్రధానులు మన్మోహన్‌ సింగ్‌, హెచ్‌డి దేవగౌడ, బిజెపి జాతీయ అధ్యక్షుడు జెపి నడ్డా, కాంగ్రెస్‌ అధ్యక్షురాలు సోనియా గాంధీ, కాంగ్రెస్‌ నేత రాహుల్‌ గాంధీ, ఎన్‌సిపి అధినేత శరద్‌ పవార్‌, కేంద్ర మంత్రులు, వివిధ రాష్ట్రాల్లో ముఖ్యమంత్రులు ఓటు హక్కు వినియోగించుకున్నారు. మాజీ ప్రధాని మన్మోహన్‌ సింగ్‌ అనారోగ్యం కారణంగా వీల్‌ చైర్‌పై పార్లమెంట్‌కు వచ్చి ఓటు వేశారు.
 
11 రాష్ట్రాలతో పాటు కేంద్రపాలిత ప్రాంతమైన పాండిచ్చేరిలో ఎమ్మెల్యేలందరూ ఓటు హక్కు వినియోగించుకున్నారని చెప్పుకొచ్చింది. ఛత్తీస్ ఘడ్, గోవా, గుజరాత్, హిమాచల్ ప్రదేశ్, కేరళ, కర్నాటక, మధ్యప్రదేశ్, మణిపూర్, మిజోరం, సిక్కిం, తమిళనాడు, పాండిచ్చేరిల్లో 100 శాతం ఓటింగ్ నమోదైందని ఎన్నికల అధికారు తెలిపారు.
పార్లమెంటు హౌస్లో ఏర్పాటు చేసిన పోలింగ్ బూత్లో 736 కి 728 మంది ఓటు వేశారని రిటర్నింగ్ ఆఫీసర్ పీసీ మోదీ ప్రకటించారు. బీజేపీ, శివసేనకు చెందిన చెరో ఇద్దరు ఎంపీలతో పాటు కాంగ్రెస్, సమాజ్ వాదీ పార్టీ , బహుజన్ సమాజ్ వాదీ పార్టీ,ఎంఐఎం ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ ఓటింగ్ కు దూరంగా తెలిపారు.
ఇక పోలింగ్ కోసం వివిధ రాష్ట్రాలకు పంపించిన బ్యాలెట్ బాక్సులు సోమవారం రాత్రి లోపు పార్లమెంటుకు చేరుకోనున్నాయి. వాయు, రోడ్డు మార్గాల్లో బ్యాలెట్ పెట్టెలను ఢిల్లీకి తరలిస్తున్నట్లు రాష్ట్రపతి ఎన్నికల రిటర్నింగ్ అధికారి పీసీ మోదీ తెలిపారు. బ్యాలెట్ బాక్సులు అసిస్టెంట్ రిటర్నింగ్ అధికారులు పర్యవేక్షణలో ఉంటాయని అన్నారు.
పార్లమెంట్ భవనంలో జరిగిన రాష్ట్రపతి ఎన్నికల పోలింగ్​లో ముందుగా ప్రధానమంత్రి మోడీ ఓటేశారు. అనంతరం కేంద్ర మంత్రులు, ఎంపీలు తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు. లోక్​సభ స్పీకర్ ఓంబిర్లా చివరి ఓటు వేశారు. కరోనా​తో బాధపడుతున్నప్పటికీ కేంద్రమంత్రులు నిర్మలా సీతారామన్, ఆర్కే సింగ్ ఓటు హక్కు వినియోగించుకున్నారు. పీపీఈ కిట్ ధరించి పార్లమెంట్​కు ఓటేసేందుకు వచ్చారు.
 ఎలక్టోరల్‌ కాలేజీలో 771 మంది ఎంపిలు, 4,025 మంది ఎమ్మెల్యేలు ఉండగా, వీరిలో 763 మంది ఎంపిలు, 3,991 మంది ఎమ్మెల్యేలు ఓటు వేశారు. ఎనిమిది మంది ఎంపిలు, 34 మంది ఎమ్మెల్యేలు ఓటు హక్కును వినియోగించుకోలేకపోయారు. జులై 21న పార్లమెంట్ హౌస్​లో రాష్ట్రపతి ఎన్నిక ఓట్ల లెక్కింపు జరగనుంది. అదే రోజు ఫలితాలు వెల్లడించనున్నారు. ఎన్డీఏ అభ్యర్థి ద్రౌపది ముర్ముకే విజయావకాశాలు అధికంగా ఉన్నట్లు తెలుస్తుంది.