రామాయపట్నం పోర్టు పనులను ప్రారంభించిన సీఎం జగన్

ప్ర‌కాశం జిల్లాలోని రామాయపట్నం పోర్టు మొద‌టి ద‌శ ప‌నుల‌కు ఆంధ్ర‌ప్ర‌దేశ్ ముఖ్య‌మంత్రి వైఎస్‌ జ‌గ‌న్ మోహన్ రెడ్డి బుధవారం శంకుస్థాప‌న చేశారు. రామాయపట్నం పోర్టుతో రాష్ట్రానికి ఎంతో ప్రయోజనం చేకూరుతుందని ఈ సందర్బంగా జగన్ చెప్పారు.రాష్ట్రాలు అభివృద్ధి జరగాలంటే పోర్టులు ఉండటం ఓ వరమనిచెబుతూ రామాయపట్నం పోర్టుతో రాష్ట్రానికే కాదు, ఈప్రాంతం రూపురేఖలు మారుతాయని తెలిపారు. 
 
 రాష్ట్రంలో ఎక్కడ ఏ పరిశ్రమల వచ్చినా 75 శాతం ఉద్యోగాలు స్థానికులకే ఇవ్వాలని చట్టం తీసుకు వచ్చామని జగన్ గుర్తు చేశారు. పోర్టులోకాని, దీనికి అనుబంధంగా ఉన్న వచ్చే పరిశ్రమల్లో 75శాతం ఉద్యోగాలు స్థానికులకే వస్తాయని వెల్లడించారు. రాష్ట్రంలో రాష్ట్రంలో దాదాపు 6 పోర్టులు ఉన్నాయి.
రాష్ట్రంలో ఉన్న 6 పోర్టుల కంటే మరో 4 పోర్టులను నిర్మించబోతున్నట్లు ముఖ్యమంత్రి తెలిపారు. మన పిల్లలు ఎక్కడికో వెళ్లకుండా ఇక్కడే ఉద్యోగాలు వస్తాయని, పోర్టుతో పారిశ్రామిక రంగం పురోగమిస్తుందని ఆయన చెప్పుకొచ్చారు. 
 కృష్ణపట్నం, కాకినాడలో 2, విశాఖపట్నం, గంగవరం తదితర పోర్టుల ద్వారా ఎగుమతులు, దిగుమతులు కొనసాగుతున్నాయని జగన్ తెలిపారు. దీనికి మరో 4 పోర్టులు అదనంగా వస్తున్నాయని వెల్లడించారు. భావనపాడు, కాకినాడ గేట్‌వే, మచిలీపట్నం, రామాయపట్నం పోర్టులను నిర్మిస్తున్నామని పేర్కొన్నారు.
వీటిద్వారా మరో 100 మిలియన్‌ టన్నుల సరుకు రవాణా సామర్థ్యం వస్తుందని చెబుతూ దీంతో పాటు 9 ఫిషింగ్‌ హార్బర్లు కూడా కడుతున్నామని ఈ సందర్బంగా జగన్ చెప్పుకొచ్చారు. ఇక శంకుస్థాపన పూజా కార్యక్రమాల్లో జగన్ పాల్గొని, సముద్రుడికి పట్టు వస్త్రాలు సమర్పించారు. డ్రెడ్జింగ్‌ పనులను ప్రారంభించి, పోర్టు పైలాన్‌ను ఆవిష్కరించారు.
దేశంలోనే రెండో అతిపెద్ద తీరం కలిగిన రాష్ట్రం మనది.. రామాయపట్నం పోర్టు భూమి పూజ.. చరిత్రలో నిలిచిపోయే రోజు అని ఏపీ పరిశ్రమల శాఖ మంత్రి గుడివాడ అమర్నాథ్ పేర్కొన్నారు. ప్రజలను మభ్యపెట్టేందుకు గతంలో చంద్రబాబు హయాంలో శంకుస్థాపన అంటూ డ్రామాలాడారు. అదసలు పునాదా? అని ప్రశ్నించారు. అనుమతులు లేకున్నా చేసిన పనిని ప్రజలు నమ్మే పరిస్థితి లేదని టీడీపీ అధినేతకు  మంత్రి గుడివాడ చురకలు అంటించారు.
ఈ పోర్టు ఎన్నో ఏళ్ళుగా ప్రతిపాదనలకే పరిమితమైన విష‌యం తెలిసిందే.  255.34 ఎకరాల సేకరణను ప్రభుత్వం చేపట్టింది. అలాగే, ప్రజలకు సహాయ, పునరావాస కార్య‌క్ర‌మాల‌కు రూ.175.04 కోట్లు ఖ‌ర్చు చేస్తోంది.
రామాయపట్నం ఓడ రేవును మొత్తం రూ.10,640 కోట్ల వ్యయంతో రెండు దశల్లో 19 బెర్త్‌లతో నిర్మించాలని ప్రభుత్వం నిర్ణయించింది. తొలిదశలో రూ.3,736.14 కోట్ల పనులకు పరిపాలన అనుమతులు  మంజూరు చేసింది. తొలిదశలో నాలుగు బెర్త్‌లతో ఓడ రేవు నిర్మాణానికి టెండర్లను పిలిచింది.
రూ.2,647 కోట్ల విలువైన తొలి దశ పనులను నవయుగ, అరబిందో కన్సార్టియం దక్కించుకున్నాయి.  ఇప్పటికే తొలి దశ టెండర్లను ఖరారు చేయడంతో భూమి పూజతో పనులు ప్రారంభం కానున్నాయి. పోర్టు తొలిదశ పనులు 36 నెలల్లో పూర్తిచేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు.
తొలిదశలో మొత్తం నాలుగు బెర్తుల నిర్మాణం. ఏడాదికి 25 మిలియన్‌ టన్నుల ఎగుమతి. కార్గో, బొగ్గు, కంటైనర్ల కోసం నాలుగు బెర్తుల నిర్మాణం, రెండో దశలో 138.54 మిలియన్‌ టన్నులకు విస్తరణ, మొత్తంగా 15 బెర్తుల నిర్మాణం చేపట్టనున్నారు.