`సుప్రీం’లో థాక్రేకు మళ్లీ ఎదురుదెబ్బ.. సీఎం షిండేకు ఇంకా గడువు

శివసేన చీఫ్‌ ఉద్ధవ్ ఠాక్రేకు సుప్రీంకోర్టులో ఊరట లభించలేదు. పార్టీపై ఆధిపత్యం కోసం థాక్రే, సీఎం ఏక్‌నాథ్ షిండే వర్గాలు దాఖలు చేసిన పిటిషన్ల విచారణను ఆగస్టు 1కి వాయిదా వేసింది సుప్రీంకోర్టు. అప్పటిలోగా ఏక్‌నాథ్ షిండే వర్గం అఫిడవిట్ దాఖలు చేయాలని ఆదేశించింది. ఎమ్మెల్యేల అనర్హత విషయానికి సంబంధించి స్పీకర్‌ కూడా అప్పటివరకు ఎలాంటి నిర్ణయం తీసుకోవద్దని స్పష్టం చేసింది. దీంతో థాక్రే వర్గానికి మళ్లీ నిరాశే ఎదురైంది.

ఈ పిటిషన్లలోని కొన్ని విషయాలను పరిశీలిస్తే.. వీటి విచారణకు విస్తృత ధర్మాసనం అవసరం అవుతుందని బలంగా నమ్ముతున్నట్లు సీజేఐ జస్టిస్ ఎన్వీ రమణ సూచనప్రాయంగా తెలిపారు. దీంతో ఈ పిటిషన్ల కోసం ఐదుగురు సభ్యులతో కూడిన ప్రత్యేక ధర్మానాన్ని ఏర్పాటు చేసే అవకాశం కన్పిస్తోంది.

రెబల్ ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేయాలంటూ ఉద్ధవ్ ఠాక్రే వర్గం, స్పీకర్ ఏకపక్ష నిర్ణయం తీసుకున్నారంటూ  ఏక్ నాథ్ షిండే వర్గం దాఖలు చేసిన పిటిషన్లను చీఫ్ జస్టిస్ ఎన్వీ రమణ నేతృత్వంలోని త్రిసభ్య ధర్మాసనం బుధవారం విచారించింది. ఏక్ నాథ్ షిండే వర్గం తరఫున సీనియర్ అడ్వకేట్ హరీశ్ సాల్వే, ఉద్ధవ్ థాక్రే తరఫున అభిషేక్ మను సింఘ్వి, కపిల్ సిబల్ వాదనలు వినిపించారు.

ఇరు పక్షాల వాదోపవాదాలు విన్న ధర్మాసనం పిటిషన్లపై తదుపరి విచారణను ఆగస్టు 1కి వాయిదా వేసింది. అప్పటి వరకు అనర్హత నోటీసులపై స్పీకర్‌ ఎలాంటి చర్యలు తీసుకోకుండా యథాతథ స్థితిని కొనసాగించాలని స్పష్టం చేసింది. ఇందుకు సంబంధించిన అన్ని రికార్డులను భద్రపర్చాలని మహారాష్ట్ర అసెంబ్లీ సెక్రటరీకి సూచించింది.

ఈ పిటిషన్లలోని కొన్ని అంశాలపై విచారణను అవసరమైతే విస్తృత ధర్మాసనానికి రెఫర్ చేస్తామని తెలిపింది. అయితే జులై 27 (వచ్చే బుధవారం) కల్లా  ఇరువర్గాలు వారి వారి వాదనలకు బలం చేకూర్చే పత్రాలు, డాక్యుమెంట్లను సమర్పించాలని సుప్రీంకోర్టు ఆదేశించింది.

‘‘ఈ పిటిషన్లలోని కొన్ని అంశాలు రాజ్యాంగంతో ముడిపడినవి అయినందున.. వాటిపై సత్వరం వాదనలు వినాల్సిన అవసరం ఉంది. ఇరువర్గాలు వచ్చే మంగళవారంకల్లా అఫిడవిట్లు దాఖలు చేయాలి. ఈ పిటిషన్లలోని కొన్ని అంశాలపై విచారణను అవసరమైతే విస్తృత ధర్మాసనానికి రెఫర్ చేస్తాం’’ అని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్.వి.రమణ పేర్కొన్నారు. 

‘‘శాసన సభా పక్ష నాయకుడిని తొలగించడం అనేది పార్టీ ఎమ్మెల్యేలకు సంబంధించిన అంశం. దీనిపై ఏదైనా వివాదం, సందేహం ఉంటే స్పీకర్ నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుంది’’ అని ఆయన స్పష్టం చేశారు. 

కోర్టులో వాదనలు చేయాలనుకుంటున్న అంశాలన్నింటినీ సంధానించి వచ్చే బుధవారం కల్లా ఒక   పిటిషన్ సమర్పించాలని ఇరు వర్గాలకూ బెంచ్ సూచించింది. పిటిషన్లకు సంబంధించిన ఏవైనా ఆరోపణలను తిరస్కరించాలనుకున్నా అంతా కలిపి ఒక అఫిడవిట్ దాఖలు చేయాలని స్పష్టం చేసింది.

షిండే వర్గం చేసిన పనిని సమర్థిస్తే దేశంలో ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వాలన్నీ కూలిపోయే పరిస్థితి వస్తుందని థాక్రే వర్గం తరఫున వాదనలు వినిపించిన కపిల్ సిబల్ కోర్టుకు తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వాలను పడగొడితే ప్రజాస్వామ్యం ప్రమాదంలో పడుతుందన్నారు.

మరోవైపు షిండే వర్గం తరఫున సీనియర్ అడ్వకేట్‌  హరీష్ సాల్వే వాదనలు వినిపించారు. అనర్హత వేధింపుల వల్ల పార్టీలో అంతర్గత ప్రజాస్వామ్యానికి మనుగడ ఉండదని కోర్టుకు చెప్పారు. థాక్రే వర్గం పిటిషన్లపై తాము అఫిడవిట్ దాఖలు చేసేందుకు కాస్త గడువు కావాలని, కేసును వచ్చేవారం వాయిదా వేయాలని కోరారు. వాదోపవాదనలు విన్న న్యాయస్థానం విచారణను ఆగస్టు 1కి వాయిదా వేసింది.