తెలంగాణాలో వడ్లు, బియ్యం సేకరణకు ఎఫ్సీఐకు అనుమతి

తెలంగాణాలో వడ్లు, బియ్యం సేకరణకు ఎఫ్సీఐకు అనుమతించినట్లు కేంద్ర మంత్రి పీయూష్ గోయెల్ ప్రకటించారు. ఈ విషయంలో రాష్ట్ర ప్రభుత్వం బాధ్యతారాహిత్యంతో వ్యహరించిదని,  పేదలకు బియ్యం ఇచ్చే విషయంలో రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరించిందని ఆయన మండిపడ్డారు.   ఏప్రిల్, మే నెలల్లో బియ్యం ఇవ్వకుండా కేసీఆర్ సర్కారు పేదలకు అన్యాయం చేసిందని విమర్శించారు. 

తెలంగాణ‌లో పండిన ధాన్యం సేక‌ర‌ణ‌లో జాప్యం కార‌ణంగా రైతులు తీవ్రంగా న‌ష్ట‌పోతున్నార‌న్న హవుస్; నేరుగా రైతుల నుంచి ధాన్యాన్ని సేక‌రించేందుకు ఎఫ్‌సీఐకి ఆదేశాలు జారీ చేసిన‌ట్లు వెల్ల‌డించారు. తెలంగాణ రైతుల నుంచి ధాన్యంతో పాటు బియ్యాన్ని కూడా సేక‌రించేందుకు త్వ‌ర‌లోనే ఎఫ్‌సీఐ రంగంలోకి దిగుతుంద‌ని ప్ర‌క‌టించారు

ధాన్యం కొనుగోళ్లపై కేసీఆర్ ప్రభుత్వం రాజకీయం చేస్తుందని , రాజకీయ ఎజెండాతోనే కేంద్రంపై తెలంగాణ ప్రభుత్వం నిందలు వేస్తోందని కేంద్ర మంత్రి ఆగ్రహం వ్యక్తం చేశారు.  తెలంగాణ ప్రభుత్వానికి రాజకీయాలే ముఖ్యమని, రాష్ట్ర సీఎం, మంత్రులు అసభ్యంగా మాట్లాడుతున్నారని మండిపడ్డారు.  ప్రధానమంత్రి, కేంద్ర మంత్రులపై టీఆర్‌ఎస్‌ నేతల విమర్శలు బాధాకరమని అంటూ తమకు వ్యతిరేకంగా మాట్లాడితే ఒరిగేది లేదని, కేంద్రానికి తెలంగాణ ప్రభుత్వం సహకరించడం లేదని ఆందోళన వ్యక్తం చేశారు.
రాష్ట్ర ప్రభుత్వం తప్పులకు రైతులను బలి చేయడం సరి కాదని భావించి వెంటనే వడ్లు, బియ్యం సేకరణకు అనుమతి ఇస్తున్నామని తెలిపారు. తెలంగాణ మిల్లుల్లో నిల్వ సౌకర్యాలు సరిగా లేవని చెబుతూ ఎన్నిసార్లు లేఖ రాసినా తెలంగాణ ప్రభుత్వం స్పందించలేదని తెలిపారు. తెలంగాణ మిల్లుల్లో రైస్‌ స్టాక్‌ నిల్వలు సరిగా లేవని పేర్కొన్నారు. 
 
రాష్ట్ర ప్రభుత్వం కోరితే మిల్లర్ల అవకతవకలపై కేంద్ర దర్యాప్తు సంస్థలతో దర్యాప్తు చేయిస్తామని కేంద్ర మంత్రి స్పష్టం చేశారు. ధాన్యం కొనుగోలు చేయాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉన్నా.. పట్టించుకోవడం లేదని, దానితో 3 నెలలుగా పేదలకు ఉచితంగా ఇవ్వాల్సిన బియ్యాన్ని పంపిణీ చేయడం లేదని పీయూష్ గోయల్ వాపోయారు. 
 
ముఖ్యమంత్రి కేసీఆర్ ఢిల్లీలో ధర్నా ఎందుకు చేశారో తెలియడం లేదని విస్మయం వ్యక్తం చేశారు. దేశంలో ఎక్కడా లేని సమస్య కేవలం తెలంగాణలోనే ఎందుకు వస్తోందని పీయూష్ గోయెల్ ప్రశ్నించారు. రైస్ మిల్లర్ల అక్రమాలపై ఇప్పటికే కేసులు నమోదయ్యాయని రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికైనా చర్యలు తీసుకోవాలని హితవు చెప్పారు. 
బండి సంజయ్ హర్షం 
  తెలంగాణాలో వడ్లు, బియ్యం సేకరణకు ఎఫ్సీఐకు కేంద్రం అనుమతి ఇవ్వడం పట్ల రాష్ట్ర బిజెపి అధ్యక్షుడు బండి సంజయ్ కుమార్ హర్షం ప్రకటించారు. అందుకు కేంద్ర మంత్రి గోయల్ కు కృతజ్ఞతలు తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం మొండి వైఖరి కారణంగానే రైస్ మిల్లుల్లో ధాన్యం నిల్వలు పేరుకు పోయాయని ఆయన  విమర్సించారు. పీఎం గరీబ్ యోజన కింద ఉచితంగా కేంద్రం పేదలకు ఇస్తున్న బియ్యం పంపిణీని ఆపివేయడం కారణంగానే రైస్ మిల్లుల్లో ధాన్యం నిల్వలు పేరుకు పోయాయని ఆయన తెలిపారు.