అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌ కు కరోనా

అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌ కు కరోనా సోకింది. ఆయనకు స్వల్పంగా కరోనా పాజిటివ్ లక్షణాలు ఉన్నట్లు గురువారం వైట్ హౌస్  ఓ ప్రకటనలో తెలిపింది. ఆయన ఫ్ఫైజర్ ఇంక్‌కు చెందిన పాక్స్‌లోవిడ్ చికిత్స పొందుతున్నట్లు వివరించింది.  వైట్ హౌస్ ప్రెస్ సెక్రటరీ కరైన్ జీన్-పియర్రే విడుదల చేసిన ప్రకటనలో, జో బైడెన్ (79)కి స్వల్పంగా కరోనా పాజిటివ్ లక్షణాలు కనిపించినట్లు తెలిపారు.
ఆయన ప్రొఫైజర్ ఇంక్   పాక్స్‌లోవిడ్   చికిత్స పొందుతున్నారని తెలిపారు.  ఆయన వైట్ హౌస్‌లో ఐసొలేషన్‌లో ఉంటారని, అయితే తన విధులను కొనసాగిస్తారని చెప్పారు. వైట్ హౌస్ సిబ్బందితో టెలిఫోన్‌ ద్వారా మాట్లాడుతున్నారని తెలిపారు. ఆయన పాల్గొనవలసిన సమావేశాల్లో తన నివాసం నుంచి ఫోన్, జూమ్ ద్వారా పాల్గొంటారని పేర్కొన్నారు.
జో బైడెన్ ఇటీవల సౌదీ అరేబియా, ఇజ్రాయెల్‌లలో పర్యటించారు. బుధవారం ఆయన మసాచుసెట్స్‌లో పర్యటించారు. వాతావరణ మార్పులను ఎదుర్కొనేందుకు జారీ చేసిన ఎగ్జిక్యూటివ్ ఆర్డర్స్‌ అమలు గురించి మాట్లాడారు. గన్ సేఫ్టీ, నేరాలపై పెన్సిల్వేనియాలో గురువారం ప్రసంగించాల్సి ఉంది.
ఇదిలావుండగా, జో బైడెన్‌కు పూర్తిగా టీకాకరణ జరిగింది. అంతేకాకుండా రెండు బూస్టర్ డోసులు కూడా తీసుకున్నారు. అయినప్పటికీ ఆయనకు స్వల్పంగా కరోనా లక్షణాలు కనిపిస్తున్నాయి. ఆయన పూర్తిగా కోలుకునే వరకు ఆయన ఆరోగ్య పరిస్థితిని రోజూ తెలియజేస్తామని వైట్ హౌస్ ప్రకటన పేర్కొంది. అయితే, జో బైడెన్ సతీమణి జిల్‌కు కరోనా నెగెటివ్ రిపోర్టు వచ్చిందని తెలిపింది.