క్లౌడ్ బరస్ట్ కాదు.. మీకు మైండ్ బరస్ట్

క్లౌడ్ బరస్ట్ కాదు.. మీకు మైండ్ బరస్ట్ అయ్యిందంటూ ముఖ్యమంత్రి కేసీఆర్ ఫై బిజెపి జాతీయ కార్యవర్గ సభ్యురాలు, మాజీ ఎంపీ విజయశాంతి ఆగ్రహం వ్యక్తం చేసారు. సీఎం కేసీఆర్ ఆదివారం భద్రాచలంలో వరద బాధిత ప్రాంతాలలో పర్యటన సందర్బంగా క్లౌడ్ బ‌ర‌స్ట్ (అనూహ్య రీతిలో భారీ వర్షపాతం) అనే కొత్త ప‌ద్ధ‌తి వ‌చ్చింద‌ని,  క్లౌడ్ బ‌ర‌స్ట్‌పై ఏదో కొన్ని కుట్ర‌లు ఉన్న‌ట్లు చెబుతున్నారని పేర్కొన్నడం గమనార్హం. 
 
 ఇత‌ర దేశాల వాళ్లు కావాల‌ని మ‌న దేశంలో అక్క‌డ‌క్క‌డ క్లౌడ్ బ‌ర‌స్ట్ చేస్తున్నారని అంటూ గ‌తంలో లడాఖ్‌, లేహ్‌, ఉత్త‌రాఖండ్‌లో క్లౌడ్ బ‌ర‌స్ట్ చేశారని, గోదావ‌రి ప‌రివాహ‌క ప్రాంతంపై కూడా క్లౌడ్ బ‌ర‌స్ట్ చేస్తున్న‌ట్లు స‌మాచారం ఉంద‌ని కేసీఆర్ ఆరోపించారు. ఈ వాఖ్యలను బిజెపి నేతలు ఎద్దేవా చేస్తున్నారు.
 
భారీ వర్షాల వెనుక విదేశీ కుట్ర ఉందని వ్యాఖ్యానించడం హాస్యాస్పదంగా ఉందని, సీఎంకు మతి భ్రమించి నట్టుందని విజయశాంతి ఎద్దేవా చేశారు. సీఎం వరద ముంపు పర్యటనను చూసి జనాలు నవ్వుకుంటున్నారని చెబుతూ వరద ప్రాంతాల్లో సీఎం పర్యటిస్తే బాధితులకు భరోసా కలగాలని, తమను ఆదుకుంటారనే నమ్మకం ఏర్పడాలని ఆమె చెప్పారు.  
 
కానీ ఈ సీఎం అక్కడకు వెళ్లి చేసిన కామెంట్స్ జోకర్ ను తలపిస్తున్నాయని ధ్వజమెత్తారు.  గోదావరికి గతంలో ఎన్నోసార్లు వరదలు వచ్చాయని, అలాగే ఇప్పుడు కూడా వచ్చాయని, భవిష్యత్తులో కూడా వస్తాయని పేర్కొంటూ కానీ, కేసీఆర్ కు మాత్రం ఈ భారీ వర్షాలు మానవ సృష్టిలా కనిపిస్తోందని దుయ్యబట్టారు. పైగా విదేశీ కుట్ర అంటున్నారని ఎద్దేవా చేశారు.
తానే పెద్ద ఇంజినీరింగ్ నిపుణుడినని గొప్పలు చెప్పుకున్నారని,  కేసీఆర్ రీడిజైన్ చేసిన కాళేశ్వరం ప్రాజెక్టు పంప్ హౌస్ నీట మునిగిందని ఆమె విమర్శించారు. మిషన్ కాకతీయ పేరుతో పూడిక తీయడమే తప్ప  కరకట్టల నిర్మాణాన్ని విస్మరించడంతో అనేక చోట్ల చెరువులు, కుంటలు తెగి వేల ఎకరాల పంట నష్టానికి దారి తీసిందని ఆమె చెప్పారు. తన పాలనా వైఫల్యాలను కప్పిపుచ్చుకునేందుకు  విదేశీ కుట్ర పేరుతో కొత్త డ్రామాకు తెరతీశారని ఆమె మండిపడ్డారు.