జగన్ ప్రభుత్వ హామీలపై ఎన్‌హెచ్ఆర్సీకి బిజెపి నేతల ఫిర్యాదు

 అన్నమయ్య ప్రాజెక్ట్ కట్ట ఘటనలో బాధితులకు న్యాయం చేయాలని కోరుతూ  జాతీయ మానవ హక్కుల కమిషన్‌కు ఏపీ బీజేపీ నాయకులు నాగోతు రమేష్‌నాయుడు, రఘు, భాస్కర్  ఫిర్యాదు చేశారు. 60 రోజుల్లో వరద బాధితులకు ఇళ్లు కట్టిస్తామని ముఖ్యమంత్రి వై ఎస్ జగన్ మోహన్ రెడ్డి ఇచ్చిన  హామీని వారు గుర్తు చేశారు.
 
 ప్రాజెక్ట్ ప్రమాదానికి కారకులైన అధికారులపై చర్యలు తీసుకోవాలని వారు ఫిర్యాదు చేశారు. కాగా ఈ ఘటనపై ఏపీ ప్రభుత్వాన్ని సమగ్ర నివేదిక కోరతామని ఎన్‌హెచ్ఆర్సీ సభ్యుడు జ్ఞానేశ్వర్ ముల్లే  తెలిపారు.  
 
‘ప్రాజెక్టు దిగువున జరుగుతున్న ఇసుక తవ్వకాల కోసం ప్రాజెక్టు గేట్లను ఎత్తలేదు. గేట్లు నిర్వహణ సరిగ్గా లేకపోవడం కూడా ప్రాజెక్టు కొట్టుకుపోవడానికి కారణమైంది. మానవ తప్పిదం వల్లే అన్నమయ్య ప్రాజెక్టు వరదల్లో కొట్టుకుపోయింది’ అంటూ బిజెపి నాయకులు ఆరోపించారు. 
 
వరదల్లో మృతి చెందినవారి కుటుంబాలకు మాత్రమే పరిహారం అందజేశారని,  పంట నష్టపోయిన రైతులకు ఎలాంటి పరిహారమూ ఇవ్వలేదని తెలిపారు. కడప జిల్లాలోని అన్నమయ్య ప్రాజెక్టు 2001లో వినియోగంలోకి వచ్చింది. 
 
ఈ ప్రాజెక్టు నీటి నిల్వ సామర్థ్యం 2.23 టీఎంసీలు. చిత్తూరు జిల్లాలో కురిసిన భారీ వర్షాలకు చెయ్యేరుకు వరద ఉధృతి భారీగా పెరిగింది. పింఛా ప్రాజెక్టు రింగ్‌బండ్‌ కొట్టుకుపోయింది. పింఛా ప్రాజెక్టు నుంచే కాకుండా, మాండవ్య నది నుంచి కూడా అన్నమయ్య ప్రాజెక్టుకు వరద పోటెత్తింది.
 
 ఏ క్షణమైనా ప్రాజెక్టు కట్ట తెగిపోయే ప్రమాదం ఉందని తెల్లవారుజామున అధికారులు రెడ్‌ అలర్ట్‌ ప్రకటించారు. ఈ హెచ్చరిక వచ్చిన గంటలోపే భారీశబ్దంతో డ్యామ్‌ కట్ట కొట్టుకుపోయింది. ఈ ఘటన నవంబర్ 2021లో జరిగింది. కొందరు మృత్యువాత పడగా, మరికొందరు గల్లంతయ్యారు. 
 
నష్టం వివరాలు కోరిన ఏపీ  హైకోర్టు 
 
మరోవంక, అన్నమయ్య ప్రాజెక్టు వరదలకు కొట్టుకుపోవడంలో అధికారుల వైఫల్యం ఉందని, ఇందుకు బాధ్యులపై అధికారుల పై చర్యలు తీసుకోవాలని, వరద వల్ల నష్టపోయిన బాధితులకు పరిహారం చెల్లించేలా ఆదేశాలు ఇవ్వాలని కోరుతూ బీజేపీ నాయకుడు ఎన్‌.రమేశ్‌ నాయుడు ఏపీ హైకోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యం దాఖలు చేశారు.
 
వరదల కారణంగా నష్టపోయిన రైతులకు రుణమాఫీ చేసేలా ప్రభుత్వాన్ని ఆదేశించాలని కోరారు. వరద సమయంలో పొలాల్లో మేట వేసిన ఇసుకను విక్రయించుకొనేందుకు రైతులను అనుమతించాలని కూడా అభ్యర్థించారు.
 
అయితే, అన్నమయ్య ప్రాజెక్టు వరదల్లో ఎంతమంది రైతులు నష్టపోయారు? ఎంత విస్తీర్ణంలో వారికి భూములు ఉన్నాయి? పరిహారం ఇంకా ఎంతమందికి అందాల్సి ఉందనే వివరాలను తమ ముందు ఉంచాలని పిటిషనర్‌ను హైకోర్టు ఆదేశించింది. వరదల కారణంగా నష్టపోయిన రైతులకు రుణమాఫీ చేసేలా ప్రభుత్వాన్ని ఆదేశించాలని పిటిషనర్‌ చేసిన అభ్యర్ధనను తోసి పుచ్చింది. అలాంటి ఆదేశాలు ఇవ్వలేమని స్పష్టం చేసింది.
 
 బాధితులకు ఇప్పటికే నష్టపరిహారం అందజేసినట్లు ప్రభుత్వం చెబుతోందని చెబుతూ ప్రభుత్వం దాఖలు చేసిన కౌంటర్‌కు రిప్లై కౌంటర్‌ దాఖలు చేయాలని పిటిషనర్‌ను ఆదేశిస్తూ విచారణను రెండువారాలకు వాయిదా వేసింది. ఈ మేరకు చీఫ్‌జస్టిస్‌ ప్రశాంత్‌కుమార్‌ మిశ్రా, జస్టిస్‌ డీవీఎ్‌సఎస్‌ సోమయాజులుతో కూడిన ధర్మాసనం సోమవారం ఆదేశాలు ఇచ్చింది.