పోటా పోటీగా వరద ప్రాంతాల్లో తమిళిసై, కేసీఆర్ పర్యటనలు 

వారం రోజులకు పైగా తెలంగాణను భారీ  వర్షాలు, వరదలు అతలాకుతలం చేస్తుండగా, ఆదివారం గవర్నర్ డా. తమిళసై, ముఖ్యమంత్రి చంద్రశేఖరరావు పోటీపోటీగా వరద ప్రాంతాలలో పర్యటిస్తున్నారు. ఎవ్వరికి వారుగా ఒకే ప్రాంతంలో పర్యటిస్తున్నారు. ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని వరద ప్రభావిత ప్రాంతాల్లో ఓ వైపు సీఎం కేసీఆర్‌, మరో వైపు గవర్నర్‌ తమిళిసై పర్యటనలు కొనసాగుతున్నాయి.

భద్రాద్రి-కొత్తగూడెం జిల్లాల్లో వరద ముంపు ప్రాంతాలను పరిశీలించేందుకు కేసీఆర్‌ ఆదివారం రోడ్డు మార్గంలో భద్రాచలం వెళ్లగా,  మరోవైపు గవర్నర్‌ రైలుమార్గంలో అక్కడికి చేరుకున్నారు.. ఇప్పటికే రాజ్‌భవన్‌కు, ప్రగతి భవన్‌కు మధ్య అంతరం పెరిగిపోవడం, ఇది పలుమార్లు బహిర్గతం కావడం తెలిసిందే.

కేసీఆర్‌ శనివారమే వరంగల్‌కు చేరుకోగా, గవర్నర్‌ తమిళిసై శనివారం సికింద్రాబాద్‌ రైల్వేస్టేషన్‌ నుంచి రైలులో బయలుదేరి ఆదివారం ఉదయానికి కొత్తగూడెం చేరుకోనున్నారు. అక్కడి నుంచి రోడ్డు మార్గంలో భద్రాద్రి చేరుకుని వరద పరిస్థితుల్ని సమీక్షించనున్నారు.

భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని గోదావరి వరద ముంపు ప్రాంతాల్లో గవర్నర్ తమిళిసై పర్యటిస్తూ  అశ్వాపురం గ్రామంలో ఎస్.కే.టీ పంక్షన్ హాల్ ఉన్న పునరావాస కేంద్రంనికి చేరున్నారు. వరద బాధితులకు, చిన్నారులకు, బిస్కెట్లు, హెల్త్ కిట్టులను పంపిణీ చేశారు. వరద బాధితులతో గవర్నర్ ప్రత్యేకంగా మాట్లాడారు.

భద్రాచలం చేరుకున్న కేసీఆర్ బ్రిడ్జిపై నుంచి గోదావరి పరిసరాలను పరిశీలించారు. వరద పరిస్థితి, జిల్లా యంత్రాంగం చేపట్టిన చర్యల గురించి అధికారులను అడిగి తెలుసుకున్నారు. అనంతరం  మహోగ్రంగా ప్రవహిస్తున్న గోదావరి నదికి ముఖ్యమంత్రి శాంతి పూజ చేశారు. షెడ్యూల్ ప్రకారం హెలికాప్టర్ లో ఏరియల్ సర్వే చేయాల్సి ఉండగా.. ప్రతికూల వాతావారణ నేపథ్యంలో రోడ్డు మార్గాన బయలుదేరారు. 
 
తమిళిపై పర్యటనలో ఎప్పటి వలెనే కలెక్టర్‌, జిల్లా ఎస్పీ కనిపించలేదు. గవర్నర్‌ వెంట ఏఎస్పీ, ఆర్డీవో మాత్రమే ఉన్నారు. పోటోకాల్‌ వివాదంపై నో కామెంట్‌ అంటూ గవర్నర్‌ మాట దాట వేశారు. బాధితుల సమస్యలపై ప్రభుత్వానికి నివేదిక ఇస్తానని ఆమె పేర్కొన్నారు.
 
 పాములపల్లిలో గోదావరి ముంపునకు గురైన ఇండ్లను గవర్నర్ తమిళసై పరిశీలించారు. ఢిల్లీ పర్యటన రద్దు చేసుకుని మరీ వరద ప్రాంతాల్లో గవర్నర్ పర్యటిస్తున్నారు. ముంపు ప్రాంతాల్లో షెల్టర్‌ క్యాంపులు, ఇతర వరద ప్రభావిత ప్రాంతాల్లో ఉన్న ప్రజలకు వైద్యం, సహాయక చర్యలు చేపట్టాల్సిందిగా ఇండియన్‌ రెడ్‌క్రాస్‌ సొసైటీ, ఈఎస్‌ఐసీ మెడికల్‌ కాలేజీ బృందాలను గవర్నర్‌ ఆదేశించారు.
 
బిజెపి ఎద్దేవా 
 
ఇలా ఉండగా, వరద బాధిత ప్రాంతాలలో గవర్నర్ పర్యటనకు వెడుతూ ఉండడంతో ఎన్నడూ ఇటువంటప్పుడు బైటకు రాని కేసీఆర్ మొదటిసారిగా హడావుడిగా పర్యటన ప్రారంభించారని బిజెపి నాయకులు ఎద్దేవా చేశారు. ఎనిమిదేళ్ల తర్వాత కేసీఆర్ భారీ వర్షాల సమయంలో మ్దటోసారి బయటకు వచ్చినందుకు బిజెపి ఓబిసి మోర్చా జాతీయ అధ్యక్షుడు డా. కె లక్ష్మణ్ అభినందించారు. 
 
గత ఎనిమిదేళ్లలో పలుమాలరు రాష్ట్రంలో వరదలు వచ్చి, వందలాది గ్రామాలు ముంపుకు గురయి వేలాదిమంది నిరాశ్రయులైన కేసీఆర్ ఒక్కసారి కూడా బైటకు రాలేదని ఆయన గుర్తు చేశారు.