మోదీపై అహ్మద్ పటేల్ కుట్రలో తీస్తా సెతల్వాద్ భాగస్వామి 

నరేంద్ర మోదీ నేతృత్వంలోని గుజరాత్ ప్రభుత్వాన్ని కూల్చేందుకు భారీ కుట్ర జరిగిందని, (దివంగత) కాంగ్రెస్ నేత అహ్మద్ పటేల్ ఆదేశాల మేరకు సామాజిక కార్యకర్త తీస్తా సెతల్వాద్ ఈ కుట్రలో భాగస్వామి అయ్యారని, అందువల్ల ఆమెకు బెయిలు మంజూరు చేయరాదని గుజరాత్ పోలీసులు శుక్రవారం కోర్టును కోరారు. 2002లో గుజరాత్‌లో జరిగిన అల్లర్ల అనంతరం ఈ కుట్ర జరిగినట్లు తెలిపారు. 
గుజరాత్ స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్ (సిట్)  అహ్మదాబాద్ సెషన్స్ కోర్టులో అఫిడవిట్ దాఖలు చేసింది. ప్రజాస్వామ్యబద్దంగా ఎన్నికైన ప్రభుత్వాన్ని అస్థిరపరచడం, కూల్చివేయడం తీస్తా సెతల్వాద్ రాజకీయ లక్ష్యమని ఆరోపించింది. ఆమె భారీ కుట్రను అమలు చేశారని తెలిపింది.
గుజరాత్‌లోని అమాయకులను తప్పుడు పద్ధతిలో నేరంలో ఇరికించేందుకు, తప్పుడు సమాచారాన్ని వ్యాపింపజేసేందుకు ఆమె కృషి చేశారని, అందుకు ప్రతిఫలంగా ఆమెకు ప్రత్యర్థి రాజకీయ పార్టీ నుంచి బహుమతులు, చట్ట వ్యతిరేక ఆర్థిక సాయం, ఇతర ప్రయోజనాలు, పారితోషికాలు లభించాయని తెలిపింది.
కాంగ్రెస్ నేత దివంగత అహ్మద్ పటేల్ ఆదేశాల మేరకు తీస్తా సెతల్వాద్ కుట్రను అమలు చేసినట్లు తెలిపింది. ఓ సాక్షి ఇచ్చిన వాంగ్మూలాన్ని దీనికి ఆధారంగా చూపించింది. 2002లో గుజరాత్ అల్లర్ల అనంతరం ఆమెకు రూ.30 లక్షలు అహ్మద్ పటేల్ ఆదేశాల మేరకు లభించాయని పేర్కొంది.
2002లో జరిగిన గుజరాత్ అల్లర్ల కేసులో ప్రస్తుత ప్రధాన మంత్రి, అప్పటి ముఖ్యమంత్రి నరేంద్ర మోదీకి సుప్రీంకోర్టు గత నెలలో క్లీన్ చిట్ ఇచ్చింది. ఈ అల్లర్లలో ప్రాణాలు కోల్పోయిన కాంగ్రెస్ ఎంపీ ఎహసాన్ జాఫ్రీ భార్య జాకియా జాఫ్రి దాఖలు చేసిన పిటిషన్‌ను కొట్టివేసింది. అంతేకాకుండా ఈ అల్లర్లపై వివాదం నిత్యం రగులుతూ ఉండేవిధంగా చేయడం కోసం పదే పదే పిటిషన్లను దాఖలు చేశారని పేర్కొంది.
2006 నుంచి దురుద్దేశపూర్వకంగా ఇటువంటి పిటిషన్లను దాఖలు చేశారని పేర్కొంది. విచారణ ప్రక్రియ దుర్వినియోగమయ్యేందుకు కారకులైన వారందరిపై చట్ట ప్రకారం  చర్యలు తీసుకోవాలని ఆదేశించింది. ఈ తీర్పు వెలువడిన మర్నాడు తీస్తా సెతల్వాద్‌తోపాటు గుజరాత్ మాజీ డీజీపీ ఆర్‌బీ శ్రీకుమార్‌లను గుజరాత్ సిట్ అరెస్టు చేసింది.
తప్పుడు సాక్ష్యాలు సృష్టించడం, తప్పుడు సమాచారాన్ని ప్రచారం చేయడం తదితర నేరాలపై కేసు నమోదు చేశారు. 2002 గుజరాత్ అల్లర్ల కేసుకు సంబంధించి కల్పిత సాక్ష్యాలు, తప్పుడు సమాచారం ఆరోపణలపై పోలీసు శాఖకు చెందిన సిట్‌ దర్యాప్తు జరుపుతోంది.
విచారణలో భాగంగా.. సామాజిక కార్య‌క‌ర్త తీస్తా సెత‌ల్వాద్‌, మాజీ డీజీపీ ఆర్‌బీ శ్రీకుమార్‌, ఐపీఎస్ ఆఫీస‌ర్ సంజీవ్ భ‌ట్‌ల‌కు అహ్మ‌ద్ ప‌టేల్ 30 ల‌క్ష‌లు ఇచ్చార‌ని సిట్‌ తెలిపింది. అలాగే, అల్ల‌ర్ల కేసులో మోదీని ఇరికించాలానే ఉద్దేశంతో ప‌టేల్ ఆ డ‌బ్బులు ఇచ్చిన‌ట్లు సిట్ త‌న రిపోర్ట్‌లో పేర్కొన్న‌ది. సెత‌ల్వాద్‌, శ్రీకుమార్‌లు నేర కుట్ర‌కు, ఫోర్జ‌రీకి పాల్ప‌డిన‌ట్లు సిట్ వెల్ల‌డించింది.
ఈ నేపథ్యంలో తీస్తా సెతల్వాద్ బెయిలు కోసం దరఖాస్తు చేశారు. దీనిని సిట్ తిరస్కరించింది. ఆమెపై దర్యా్ప్తు కొనసాగుతోందని చెప్పింది. ఆమెను విడుదల చేస్తే, సాక్షులను బెదిరించే అవకాశం ఉందని, సాక్ష్యాధారాలను తారుమారు చేసే అవకాశం ఉందని తెలిపింది.
మోదీతోపాటు ఇతర అధికారులను, బీజేపీ సీనియర్ నేతలను కూడా ఇరికించేందుకు వీరంతా కలిసి కుట్ర పన్నినట్లు పేర్కొంది.  ఈ కుట్రను అమలు చేయడం కోసం ఆమెకు అక్రమ ఆర్థిక ప్రయోజనాలు లభించినట్లు పేర్కొంది. గుజరాత్ బీజేపీ నేతల పేర్లను కూడా చేర్చేందుకు ప్రయత్నాలు చేశారని పేర్కొంది. అప్పట్లో ఢిల్లీలో అధికారంలో ఉన్న ఓ జాతీయ పార్టీ సీనియర్ నేతలను ఆమె కలిసేవారని పేర్కొంది.
సెతల్వాద్ ఓ కాంగ్రెస్ నేతతో మాట్లాడిన మాటలను 2006లో ఓ సాక్షి తన వాంగ్మూలంలో తెలిపారని గుజరాత్ సిట్ పోలీసులు తమ అఫిడవిట్‌లో పేర్కొన్నారు. రాజ్యసభ సభ్యత్వం కోసం కాంగ్రెస్ పార్టీ తనను ఎందుకు ఎంపిక చేయడం లేదని, షబానా అజ్మీ, జావేద్ అక్తర్‌లకు మాత్రమే ఎందుకు అవకాశాలు ఇస్తోందని ఆ నేతను తీస్తా అడిగినట్లు ఆ సాక్షి చెప్పారని తెలిపారు. అడిషినల్ సెషన్స్ జడ్జి డీడీ ఠక్కర్ సిట్ సమాధానాన్ని పరిగణనలోకి తీసుకుని, తదుపరి విచారణను సోమవారానికి వాయిదా వేశారు.
ఇదిలా ఉండగా.. జూలై రెండ‌వ తేదీన సెతల్వాద్‌, శ్రీకుమార్‌ల‌ను 14 రోజుల పాటుకు రిమాండ్‌కు త‌ర‌లిస్తూ అహ్మ‌దాబాద్ మెట్రోపాలిట‌న్ కోర్టు పోలీసులను ఆదేశించింది.