బాసర ట్రిపుల్ ఐటీలో విషాహారం.. 100 మంది విద్యార్థులకు అస్వస్థత

బాసర ట్రిపుల్ ఐటీలో 100 మంది విద్యార్థులు అస్వస్థకు గురయ్యారు. శుక్రవారం మధ్యాహ్న భోజనంలో ఎగ్‌ఫ్రైడ్ రైస్ పెట్టారు. అది తిన్న విద్యార్థులు తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. వాంతులు, విరేచనాలతో ఇబ్బంది పడ్డారు.
అప్రమత్తమైన అధికారులు వెంటనే వారిని చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు.దీంతో క్యాంపస్‌లో ఒక్కసారిగా కలకలం రేగింది. వంద మందికి పైగా విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు. కొందరికి అక్కడే వైద్యం అందించగా, తీవ్ర అస్వస్థతకు గురైన 15 మంది విద్యార్థులను నిజామాబాద్ తరలించినట్టు నిర్మల్ జిల్లా కలెక్టర్ ముషారఫ్ అలీ తెలిపారు. 11 మంది విద్యార్థులకు నిజామాబాద్ లోని ఓ ప్రైవేట్ ఆసుపత్రి ఐసీయూలో చికిత్స అందిస్తున్నారు.
ఈ ఘటనపై ప్రభుత్వం విచారణకు ఆదేశించినట్లు విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి తెలిపారు. బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటామని తెలిపారు. విద్యార్థులకు మెరుగైన సేవలు అందేలా చూడాలంటూ రాష్ట్ర ఉన్నత విద్యామండలి ఉపాధ్యక్షుడు ప్రొఫెసర్ వి.వెంకటరమణను నిజామాబాద్ ఆసుపత్రికి వెళ్లాలని మంత్రి ఆదేశించారు.
ఆరోగ్య శాఖ మంత్రి హరీష్ రావు కూడా స్పందించారు. విద్యార్థులకు మెరుగైన వైద్యం అందించాలని ఆ శాఖ ఉన్నతాధికారులను ఆదేశించారు.  మరోవంక, ఈ సంఘటనపై అధికారుల విచారణ ప్రారంభించారు. రెండు క్యాంటీన్లపై కేసు నమోదు చేసిన అధికారులు వాటి టెండర్లు రద్దు చేసే యోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం విద్యార్థుల ఆరోగ్యం నిలకడగా ఉందని ట్రిపుల్ ఐటీ సిబ్బంది తెలిపారు.
ఈ సంఘటన పట్ల ఆదిలాబాద్ ఎంపీ సాయం బాబురావు దిగ్బ్రాంతి వ్యక్తం చేశారు. బాసర ట్రిపుల్ ఐటి కిచెన్ అధ్వాన్నంగా ఉన్నదని, దానిని ఆధునీకరించాలని, వంటగదిలో  శుభ్రత  తాను మొదటి నుంచి చెబుతున్నా  ప్రభుత్వం పెడచెవిన పెడుతూ ఉండడం కారణంగానే ఈ దుర్ఘటన జరిగినదని పేర్కొన్నారు.
బాసర ట్రిపుల్ ఐటీలో ఆహారం కలుషితమై వంద మందికి పైగా విద్యార్థులు అస్వస్థతకు గురికావడంపై బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ విచారం  వ్యక్తంచేశారు . చికిత్స పొందుతున్న విద్యార్థులతో ఆయన ఫోన్‌లో మాట్లాడారు. ముఖ్యమంత్రి కేసీఆర్ మొదటి నుంచి విద్యార్థులపై కక్షపూరితంగా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. పీసీసీ చీఫ్ రేవంత్‌రెడ్డి మాట్లాడుతూ ఈ ఘటనకు బాధ్యులైన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.